గౌడ్ పుణ్యం.. గులాబీబాస్ హేపీయేనా?

తమకు అధికారం దక్కితే.. ఇతర పార్టీలను దాదాపుగా ఊడ్చేసి వాటి ఉసురు తీయాలని, ప్రత్యర్థిని బలహీన పరచడం ద్వారా ఎదురులేకుండా చేసుకోవాలనే వ్యూహాన్ని తెలంగాణ రాజకీయాల్లోకి కేసీఆర్ స్వయంగా తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు…

తమకు అధికారం దక్కితే.. ఇతర పార్టీలను దాదాపుగా ఊడ్చేసి వాటి ఉసురు తీయాలని, ప్రత్యర్థిని బలహీన పరచడం ద్వారా ఎదురులేకుండా చేసుకోవాలనే వ్యూహాన్ని తెలంగాణ రాజకీయాల్లోకి కేసీఆర్ స్వయంగా తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలను గరిష్టంగా తన జట్టులో చేర్చుకోవడం ద్వారా.. ఆయన ఆ పార్టీని దెబ్బకొట్టారు. 2018 ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీమీద అదే తరహా కుయుక్తిని ప్రదర్శించారు.

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. వారు కూడా భారాసను ఖాళీ చేయించడం మీద కన్నేసేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. కోర్టుల్లో కేసులు వేసి రేవంత్ మీద విరుచుకుపడుతున్నారు. ఈనేపథ్యంలో.. కాంగ్రెస్ లోకి ఇంకా వలసలు కొనసాగడం గురించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు బహుశా గులాబీ దళపతికి ఊరట కలిగిస్తుండవచ్చు.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలోకి అధికారం చేపట్టిన తర్వాత.. గులాబీ రాజకీయాలకు సంబంధించి అనేక చేదు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేకమంది గులాబీ ఎమ్మెల్యేలు… వెళ్లి రేవంత్ ను కలవడం జరిగింది. వారందరూ కూడా కాంగ్రెసులోకి జంప్ చేస్తారనే పుకార్లు వచ్చాయి. అందరూ కాదు గానీ కొందరు మాత్రం జంప్ చేశారు. పార్టీ ఫిరాయించారు. వారి మీద ఇప్పటికీ భారాస కోర్టులో అనర్హత వేటు వేయించడం కోసం పోరాడుతోంది. ఆ పోరాటం వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. ఈలోగా ఇంకెంత మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లిపోతారో తెలియదు.

ఒకవైపు తెలుగుదేశం కూడా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివేట్ అవుతుండగా.. తీగల కృష్ణారెడ్డి వంటివారు ఆ పార్టీలోకి వెళుతున్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫ్యామిలీ కూడా ఆ బాటలోనే ఉన్నట్టుగా పుకార్లూ వస్తున్నాయి. ఇలాంటప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాటలు కేసీఆర్ కు హేపీగా ధ్వనించడంలో ఆశ్చర్యం లేదు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నాయకుల వల్ల ఆయా ప్రాంతాల్లో తమ పార్టీల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతున్నదని చెప్పారు. వలస నాయకులతో సహజంగానే స్థానికంగా వైషమ్యాలు పెరుగుతుండడం సహజం. పార్టీ బాధ్యతలు తీసుకున్న ఈ కొత్త సారథి.. ఎంతో కాలం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారి అసంతృప్తులను పరిగణనలోకి తీసుకోవడం మంచి విషయమే.

ఈ నేపథ్యంలో ఇతర పార్టీలనుంచి వచ్చే వారిని చేర్చుకోవడానికి కొంతకాలం బ్రేక్ వేసినట్టుగా గౌడ్ ప్రకటించారు. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఫిరాయించి వెళ్లిపోతారో అనే భయంలో గడుపుతున్న భారత రాష్ట్ర సమితికి ఇది ఊరట ఇచ్చే మాటే! అయితే ఈ బ్రేకులు ఎంత కాలం ఉంటాయో, ఎప్పుడు వీటిని తొలగిస్తారో వేచిచూడాలి.

6 Replies to “గౌడ్ పుణ్యం.. గులాబీబాస్ హేపీయేనా?”

  1. ఏరి ఎక్కడ? ఉద్యోగులను పక్కదారి పట్టించి భ్రష్టుపట్టించిన ఉద్యమసింహాలు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లు…ఎక్కడా వినిపించరేం?

Comments are closed.