తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిట్లకు దిగారు. 2019లో టీడీపీని ఓడించిన జనంపై అచ్చెన్నాయుడు అక్కసు వెళ్లగక్కారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అచ్చెన్నాయుడు ఆవేశంలో ఊగిపోయారు.
భారత రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్‌ను ఎంపిక చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. అదీ సామాజిక న్యాయమంటే అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అంతేకానీ, ఏదో ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చి, వారి నోటికి ప్లాస్టర్లు అంటిస్తే సామాజిక న్యాయం కాదని అచ్చెన్నాయుడు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సమాన ప్రాతిపదికన న్యాయం చేస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాలకు చేసిన సంక్షేమం దేశ, రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్కరూ చేయలేదన్నారు. కానీ గత ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడించారంటే మనలో (ప్రజల్లో) చైతన్యం లేదని నిష్టూరమాడారు. మనం మోసపోతున్నామని, ఇప్పటికైనా చైతన్యవంతం కాకపోతే మనవి బానిస బతుకులుగానే వుంటాయని హెచ్చరించారు.
ఏం తక్కువ చేశామని ఆయన ప్రజల్ని నిలదీశారు. ఏ వర్గానికి పథకం ఇవ్వలేదని ప్రశ్నించారు. గిరిజనులు, దళితుల పిల్లలు చదువుకోవాలనే ఆశయంతో విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని అచ్చెన్న చెప్పుకొచ్చారు. ఎవరైనా విదేశాల్లో చదువుకుంటామంటే ఒక్కరికైనా డబ్బు మంజూరు చేశారా? అని జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు.
టీడీపీని గెలిపిస్తేనే సమాజం చైతన్యవంతమైందని, లేకపోతే కాదని విమర్శించడం టీడీపీ నేతల అహంకారానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు సహజమని, వాటిని స్పోర్టీవ్‌గా తీసుకోకుండా ప్రజల్ని నిందించే స్థాయికి అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు దిగజారారని ప్రత్యర్థులు మండిపడుతున్నారు.
ఇటీవల మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో బీసీలతో పాటు ఇతర అణగారిన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని, అదే అచ్చెన్నాయుడి మాటల్లో ప్రతిబింబిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.