తాము పోరాడేది కేవలం చంద్రబాబునాయుడితో మాత్రమే కాదని, ఎల్లో మీడియా అనే రాక్షస మూకతో అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెబుతుంటారు. ఇటీవల నంద్యాలలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్, ఎల్లో మీడియా అధినేతలంతా కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరని తలపై చేయి పెట్టి అభినయించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అలాంటి ఎల్లో మీడియాను వదులుకుంటున్నందుకు జగన్ కొత్త కేబినెట్‌లోని మంత్రి ఆర్కే రోజా కన్నీరుమున్నీరవడం విశేషం.
మంత్రి పదవి దక్కిన నేపథ్యంలో ఇకపై ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ జడ్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రోజా ప్రకటించిన సంగతి తెలిసిందే. రోజాకు పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖను కేటాయించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాకు ఈటీవీ జబర్దస్త్ టీం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించి విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటోంది.
ఇది చాలా గర్వపడే సమయం అంటూ జబర్దస్త్ టీం పేర్కొంది. రోజాకు అభినందనలు తెలిపారు. ఈ ప్రోమోలో జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నందుకు ఆవేదనతో కన్నీటిపర్యంతమయ్యారు. రోజా ఏమన్నారో తెలుసుకుందాం.
జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొంటూనే రెండుసార్లు ఎమ్మెల్యే అయిన విషయాన్ని రోజా గుర్తు చేశారు. అలాగే మంత్రిగా కూడా ఇక్కడి నుంచే కావాలని మనస్ఫూర్తిగా అనుకున్నట్టు తెలిపారు. అనుకున్న విధంగానే మంత్రి కూడా అయినట్టు చెప్పుకొచ్చారు. ఇక మీదట జబర్దస్త్ చేయడం కష్టమే అని, అందర్నీ మిస్ అవుతున్నాననే బాధ ఉందని రోజా కన్నీళ్లు కార్చారు.
సర్వీస్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పారు. అలాంటిది ఒక మంచిస్థాయి ఇచ్చినప్పుడు, ఇలాంటి ఇష్టమైనవి వదులుకోవాల్సి వస్తోందని రోజా ఆవేదనతో చెప్పారు. ఈటీవీకి చాలా కృతజ్ఞతలు చెప్పాలన్నారు. తన జీవితంలో కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకూ చేర్చిందని మీడియాధిపతి రామోజీరావు చానల్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా జబర్దస్త్ టీం సభ్యులంతా రోజా శోకంతో శృతి కలిపారు.