ఇబ్బంది తలెత్తిన కొన్ని గంటల్లోనే దిద్దుబాటు చర్యలకు దిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఊహించని విధంగా భక్తుల రాక పెరగడంతో, సర్వదర్శనం విషయంలో ఉన్నఫలంగా టోకెన్ సిస్టమ్ ను ఎత్తేసిన టీడీపీ, ఆ తర్వాత భక్తులకు దర్శనభాగ్యం కల్పించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. మొన్నటివరకు సర్వదర్శనానికి 22 గంటల సమయం పట్టేది. అయితే వెంటనే తేరుకున్న టీటీడీ, భక్తుల సమస్యల్ని తీర్చేందుకు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది.
టోకెన్ సిస్టమ్ లేకపోవడంతో, ప్రస్తుతం భక్తులంతా తిరుమల చేరుకుంటున్నారు. వాహనాల్లో వచ్చిన వాళ్లు, కాలినడకన వచ్చే వాళ్లు అంతా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోకి వెళ్తున్నారు. ఇలా చేరుకుంటున్న వేలామంది మంది భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మొన్నటివరకు 22 గంటలుగా ఉన్న సర్వదర్శన సమయాన్ని సక్సెస్ ఫుల్ గా 10-12 గంటలకు కుదించగలిగారు. నేరుగా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు.. 12 గంటల్లో స్వామివారిని దర్శించుకొని బయటకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. క్యూ కాంప్లెక్సుల్లో అన్నప్రసాదం, జలప్రసాదం, పాలు అందుబాటులో ఉంచారు.
అయితే రాబోయే రోజుల్లో కూడా ఇంతే తక్కువ టైమ్ లో సర్వదర్శనం సాధ్యమౌతుందా అనేది అనుమానం. ఎందుకంటే, ప్రస్తుతానికి వీఐపీ బ్రేక్ దర్శనాల్ని రద్దుచేసింది టీటీడీ. అందువల్ల సర్వదర్శన సమయం గణనీయంగా తగ్గింది. కానీ మరికొన్ని రోజుల్లో తిరిగి బ్రేక్ దర్శనాలు మొదలవుతాయి. కొన్ని ఆర్జిత సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అప్పుడు మళ్లీ సర్వదర్శనం భక్తులకు కష్టాలు తప్పవేమో. ఈలోగా టీటీడీ మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే, సామాన్య భక్తులకు కష్టాలు కాస్త తగ్గుతాయి.
కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పాటు, వేసవి సీజన్ మొదలుకావడంతో తిరుమలకు భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రాకకు తగ్గట్టే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మరికొన్ని రోజుల్లో పాఠశాలలకు వేసవి శెలవులు మొదలవుతున్నాయి. టీటీడీ చర్యలు ఏ మేరకు ఫలితాన్నిచ్చాయో అప్పుడు తెలుస్తుంది.