భారత జాతీయులు కూడా కమలకి ఓటేయరా?

అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న. ఇది అందరి నమ్మకం. అమెరికా కూడా ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఏ దేశంలో ఏ యుద్ధమొచ్చినా కలగచేసుకోవడం, అశాంతి ఎక్కడున్నా అక్కడ మరఫిరంగులతో దిగిపోవడం వంటివి చేస్తుంటుంది.…

అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న. ఇది అందరి నమ్మకం. అమెరికా కూడా ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఏ దేశంలో ఏ యుద్ధమొచ్చినా కలగచేసుకోవడం, అశాంతి ఎక్కడున్నా అక్కడ మరఫిరంగులతో దిగిపోవడం వంటివి చేస్తుంటుంది. దీని కోసం గణనీయంగా ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చు పౌరుల మీద పన్నుభారంగా మోపుతుంది. ఇది ఇప్పటి కథ కాదు. ఎన్నో దశాబ్దాలుగా అమెరికా చరిత్రే అంత.

ఎందుకిలా చేస్తుంది? దాని గొడవ అది చూసుకోవచ్చు కదా అంటే..ఇక్కడ అమెరికాకి మిగిలిన దేశాలకి చాలా తేడా ఉంది. అమెరికా వలసదారులవల్ల పెరిగిన, పెరుగుతున్న దేశం. ప్రపంచంలోని అన్ని దేశాలవాళ్లని ఆకర్షించడం, ఆహ్వానించడం, క్రమంగా పౌరసత్వమివ్వడం..ఇదీ ఈ దేశం ప్రత్యేకత. కనుక అన్ని దేశాల మూలాలున్న పౌరులు, జనాభా అమెరికాలో ఉంటారు. కనుక ఏ దేశంలో ఏ గొడవొచ్చినా కొద్దో గొప్పో అక్కడ ఆ దేశాల వాళ్లు ర్యాలీలు అవీ చేయడం సహజం..మొన్నీమధ్య ఇజ్రాయెల్, పాలెస్తీనా వాళ్ళు చేసినట్టు.

ఇండియా విషయానికొస్తే సొంతింట్లోనో, ఇరుగో, పొరుగో అమెరికాలో స్థిరపడిన వ్యక్తులుంటున్నారు. కనీసం చదువుకోవడానికి వెళ్లిన వాళ్లైనా ఉంటారు. కనుక చాలా మంది ఇండియన్స్ కి తెలియకుండా అమెరికా ఎన్నికల మీద, అమెరికా వర్తమాన భవిష్యత్తుల మీద ఆసక్తి పెరుగుతోంది. ఇండియా తర్వాత వాళ్ల దృష్టి అమెరికా మీదే ఉంటోంది. కారణం వాళ్ల కుటుంబసభ్యులు, స్నేహితులు అక్కడ ఉండడం వల్ల. అందుకే రూపాయి విలువ పడిందన్న బాధ పక్కనే, డాలర్ విలువ పెరిగిందన్న సంతోషాన్ని మనసులో పొందుతున్న మధ్య, ఎగువ మధ్యతరగతి వాళ్లు ఉంటారు. దానికి కూడా కారణం తమ అన్నో, కొడుకో, కూతురో అమెరికాలో ఉండడం.

ఇదంతా పక్కన పెడితే అమెరికా తన పెద్దన్న ఇమేజుని కాపాడుకోవడానికి బలమైన కారణం డాలర్ వేల్యూ. ప్రపంచ విపణిని శాసిస్తున్నది అమెరికన్ డాలర్. ఆ ప్రభ తగ్గకూడదంటే అన్ని దేశాలకి పెద్ద దిక్కుగా ఉంటున్నట్టు కనపడాలి. అప్పు కావాలన్నా, ఆయుధం కావాలన్నా అమెరికా వైపు చూడాలి అన్ని దేశాలు..అనేది అమెరికా లక్ష్యం. ఇనాళ్లూ అదే జరుగుతోంది. అందుకే అమెరికా పెద్దన్న ప్రభ వెలుగుతోంది. కానీ ఈ మధ్యన చాలా వరకు ఆ వెలుగు తగ్గింది. దానికి కారణాలేంటి? చూద్దాం.

ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత వరకు పరిస్థుతులన్నీ బాగానే ఉండేవి. కానీ ట్రంప్ వచ్చాక మొదట్లో బాగానే ఉన్నా కరోనా కాలంలో లెక్క మారింది.

ఆ లాక్డౌన్ సమయంలో స్టిములస్ చెక్స్ ఇచ్చాడు. ప్రజలెవ్వరూ ఆర్ధిక పరిస్థితి కారణంగా ఆత్మహత్యలు చేసుకోకుండా, డిప్రెషన్ కి లోను కాకుండా, క్రైం కి తెగపడకుండా ఉండేందుకు తీసుకున్న అతిపెద్ద చర్య ఇది. అయితే మార్కెట్లో బిలియన్ల డాలర్లు పంపింగ్ చేయడం వల్ల తర్వాత కాలంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపొయింది. దానివల్ల అన్ని వస్తువుల రేట్లు ఉన్నపళంగా మూడింతలు, నాలుగింతలు అయిపోయాయి.

కానీ జీతాలు అలా పెరగలేదు. దాంతో జనం ఉక్కిరిబిక్కిరవ్వడం మొదలుపెట్టారు. అయితే ఈ పరిస్థితి వచ్చే సరికి బైడన్ అధ్యక్షుడయ్యాడు. ఆ మైనస్సంతా బైడెన్ మోయాల్సి వచ్చింది. ట్రంప్ కాలంలో అమలు చేసిన నిర్ణయాల వల్ల పరిస్థితి అలా తయారయింది తప్ప తన పాలన లోపం కాదని బైడన్ సర్కార్ చెప్పే ప్రయత్నం చేసినా జనం ఒప్పుకోలేదు. “అయితే అయ్యింది…దానిని బాగు చేయాల్సిన పని నీదే” అన్నారు బైడెన్ ని. కానీ అది ఆయనకి సాధ్యపడలేదు.

ఎకానమీని, ద్రవ్యోల్బణాన్ని జనరంజకంగా ఆయా స్థానాల్లో నిలబెట్టే విషయంలో బైడెన్ ప్రభుత్వం ఫెయిలయ్యింది. ఇప్పుడా అసంతృప్తి అంతా ఎన్నికలపై ప్రభావం చూపనుంది.

మీడియా మొత్తం ఏకకంఠంతో కమలా హారిస్ గెలుస్తుందని చెబుతున్నా బెట్టింగ్ యాప్ లు, జనం ట్రంప్ గెలుస్తాడంటున్నారు. దీనిని బట్టి ప్రభుత్వవ్యతిరేకత ఏ రేంజులో ఉందో అర్ధమవుతుంది.

లోకల్ గా పరిస్థితి ఇది అయితే అంతర్జాతీయంగా అమెరికా ఇమేజ్ సన్నగిల్లింది. దానికి నిదర్శనం రష్యా-ఉక్రైన్ యుద్ధాన్ని కానీ, ఇజ్రాయేల్-ఇరాన్-లెబనాన్ ల మధ్య యుద్ధవాతావరణాన్ని కానీ ఆపలేకపోయింది బైడెన్ సర్కార్. 2021లో అమెరికా తన సైన్యాన్ని వెనక్కి వచ్చేయమని చెప్పడంతో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమయ్యింది. ఇది కూడా అమెరికా చేసిన పిచ్చిపని అని అనుకుంటున్న ప్రపంచం ఉంది.

అంతే కాదు డాలర్ కి సవాల్ విసురుతూ ఇండియా రూపీ ట్రేడ్ మొదలుపెట్టింది. కొన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు ఇండియా. రష్యా, చైనాలు కూడా రూబుల్, యువాన్ ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఇలా పెద్ద దేశాలు సొంత కరెన్సీలు వాడుకుంటూ పోతే డాలర్ చిల్లర రాలదు అమెరికాకి. అయినా నాన్-డాలర్ కరెన్సీలకి అడ్డుకట్ట వేయడంలో వెనకబడింది బైడన్ సర్కార్. పెద్దన్నంటే ప్రపంచానికి భయం తగ్గిందనడానికి ఇదొక నిదర్శనం.

అమెరికా ఇమేజ్ అంటే ఎకానమీ మాత్రమే. అది గాడిలో లేదు. బ్యాంకులు కుప్పకూలుతున్నాయి.

దీనికి తోడు గన్ లాస్, డ్రగ్స్ విచ్చలివిడితనం పెరిగిపోయింది బైడెన్ పాలనలో.

ఇవన్నీ చుట్టుకుని ఇప్పుడు డెమాక్రటిక్ పార్టీ దిగాలుగా కూర్చుంది.

ఇక ట్రంప్ వస్తే బాగుంటుందని ఎక్కువమంది స్థానిక అమెరికన్లు అనుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కానీ యూరోప్ మాత్రం ట్రంప్ గెలవకూడదని అనుకుంటోంది. దానికి కారణం యూరోప్ రక్షణని చిన్నచూపు చూస్తాడని ట్రంప్ పై ఒక అభిప్రాయం.

ఇక సుదూరంగా ఇండియాలో ఉంటున్నవాళ్లకి భారతదేశ నేపథ్యమున్న కమల హ్యారీస్ నెగ్గితే బాగుణ్ణు అని అనుకుంటున్నా, పౌరులుగా ఉన్న భారత సంతతి వాళ్లే ఆమెకి ఓట్లేసే పరిస్థితిలో లేరని సర్వేలు చెబుతున్నాయి. ఫోన్ చేసి అడుగుతున్నా పది మందిలో తొమ్మిదిమంది ట్రంప్ కే ఓటేస్తామంటున్నారు.

ఎన్నికలు రోజుల్లోకొచ్చేసాయి. దాని ఫలితంగా ఇండియాలో స్టాక్ మార్కెట్ కూడా తాత్కాలికంగా ప్రభావితమవుతోంది. ఏం జరుగుతుందోనని స్టాక్ మార్కెట్ నిపుణులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

పద్మజ అవిర్నేని

12 Replies to “భారత జాతీయులు కూడా కమలకి ఓటేయరా?”

  1. కమలా హరిస్ పేరుకి భారత మూలాలు వున్నా కూడా, ఆమె ఆలోచనలు, సిద్ధాంతాలు అన్ని కూడా భారత వ్యతిరేకం. ముస్లిం ల ఓట్ల కోసం తాన తందాన అని అటుంది. కాశ్మీర్ విషయంలో భారత వ్యతిరేఖ వైఖరి. అందుకే కాస్త ఆలోచన చేసి ఓట్ వేసే వారు ఆమెకి బదులు ట్రంప్ కి మొగ్గు చూపుతారు

  2. భారత వ్యతిరేక శక్తులని హరీస్ / డెమోక్రాట్లు బలపరుస్తున్నారు, అందువల్ల నాలాంటి బీజేపీ సపోర్టర్స్ కూడా ట్రంప్ రావాలి అని కోరుకుంటున్నాం.

    1. హరీస్ వైస్ ప్రెసిడెంట్ కాక ముందు కాశ్మిర్ లాంటి విషయాలు లో భారత వ్యతిరేక స్టాండ్ తీసుకొని ఉంది.

    2. I dont think it will change much but at least he will not raise unnecessary things. Biden govt gave more visas to indians and also our exports got increased during his govt

Comments are closed.