Amaran Review: మూవీ రివ్యూ: అమరన్

ఆర్మీ ఫైట్లని ఇష్టపడే టీనేజ్ ఆడియన్స్ కి, సాయిపల్లవి అభిమానులకీ నచ్చుతుంది.

చిత్రం: అమరన్
రేటింగ్: 3/5
తారాగణం: శివ కార్తికేయన్, సాయిపల్లవి, భువన్ అరోరా, రాహుల్ బోస్ తదితరులు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎడిటింగ్: కళైవనన్
కెమెరా: సాయి
నిర్మాతలు: కమల్ హాసన్, మహేంద్రన్, వివేక్ కృష్ణాని
దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియసామి
విడుదల: 31 అక్టోబర్ 2024

“అమరన్” అంటే అమరుడు అని అర్ధమవుతోంది. ఇది వీరమరణం చెందిన ఒక ఆర్మీ ఆఫీసర్ కథ. సాయిపల్లవి లీడ్ హీరోయిన్. శివ కార్తికేయన్ హీరో. ట్రైలర్ ఆకట్టుకుంది. అంచనాలు ఏర్పడ్డాయి. ఎలా ఉందో చూద్దాం.

ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) కి కాలేజీలో మళయాళి అమ్మాయి ఇందు రెబెక్కా వర్ఘీస్ (సాయిపల్లవి) తో పరిచయమవుతుంది. అది క్రమంగా ప్రేమగా మారుతుంది. చదువు అవ్వగానే ముకుంద్ ఎస్.ఎస్.బి ఇంటర్వ్యూ పూర్తి చేసి ఆర్మీ ట్రైనింగ్ కి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్తాడు. ముకుంద్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా, ఇందు కుటుంబ సభ్యులు ముందుగా పెళ్లికి ఒప్పుకోరు. మిలిటరీలో పనిచేసే వాడికి తన కూతుర్ని ఇవ్వనంటాడు ఇందు తండ్రి. కానీ కన్విన్స్ చేసి పెళ్లిచేసుకుంటారు. ఆ తర్వాత కాశ్మీర్ తీవ్రవాదులని నిలువరించే బెటాలియన్ అయిన 44 ఆర్ ఆర్ టీం లో చేరతాడు ముకుంద్. అక్కడి నుంచి అతని ఆర్మీ జీవితం, దాడులు, ప్రతిదాడులు..అతను చివరికి వీరమరణం పొందిన తీరు…ఇదే తక్కిన కథంతా.

“మేజర్” చూసిన ప్రేక్షకులకి ఈ ట్రైలర్ చూస్తే కథగా అంతకంటే వేరే గ్రాఫ్ ఏమీ ఉండదని అనిపిస్తుంది. అందుకే కథలో ఏముంటుంది అనే దానికంటే కథనం ఎలా ఉంది అన్నదొక్కటే ఇక్కడ పాయింట్.

సాధారణంగా ఆర్మీవీరుల కథలన్నీ ఒకే పాటర్న్ లో ఉంటాయి. ఔత్సాహిక యువకుడు కాలేజీలో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, ఆర్మీకి వెళ్లడం, అక్కడ యుద్ధంలోనో, దాడిలోనో వీరమరణం పొందడం. “మేజర్” సినిమా ఇలాగే ఉంది. “సీతారామం”లో కూడా ప్రధాన అంశాలు ఇవే అయినా దాంట్లో అన్వేషణ, సస్పెన్స్ కలగలిపి మరోలా ప్రెజెంట్ చేయడం జరిగింది. అయితే బయోపిక్ ఫార్మాట్ ని ఎంచుకుంటే మాత్రం కల్పితాలకి స్కోప్ తగ్గిపోతుంది. ఎలా చూసినా “మేజర్” లాగే తీయాల్సి వస్తుంది. అలాగే తీసారు ఈ చిత్రాన్ని.

ఆసక్తిగా తీయొచ్చనుకున్న కొన్ని ఎపిసోడ్స్ ని అలా ముట్టుకుని వదిలేసారు. ఎస్.ఎస్.బి ఇంటర్వ్యూ ఎంత కష్టమో అంటూ ఒక డైలాగ్ చెబుతాడు ముకుంద్. కానీ అంతలోనే ఆ ఇంటర్వ్యూ సీన్ ని అత్యంత పేలవంగా ముగించారు. దేశంలోనే అత్యంత కష్టరమైనది ఎస్.ఎస్.బి ఇంటర్వ్యూ. ఎంపిక ప్రక్రియ నాలుగైదు రోజుల పాటు పెట్టే శారీరక, మానసిక పరీక్షలతో జరుగుతుంది. ఎంత ప్రతిభాశాలి అయితే ముకుంద్ కి ఆ ఉద్యోగం వచ్చింది అనేది చూపలేకపోయారు.

అలాగే, అప్పటివరకు పెళ్లికి ససేమిరా అన్న ఇందు తండ్రి ముకుంద్ వచ్చి ఒక్క డైలాగ్ చెప్పగానే తనతో పాటు కుటుంబసభ్యులంతా ఒప్పేసుకోవడం కన్విన్సింగ్ గా లేదు.

ఈ సినిమాకి వీటన్నిటికన్నా పెద్ద మైనస్ మ్యూజిక్. ఇలాంటి సినిమాలకి నేపథ్య సంగీతం చాలా కీలకం. దర్శకుడు ఇలాగే కోరాడా లేక సంగీత దర్శకుడు ఎలా కోరినా ఇంతకంటే ఇవ్వలేకపోయాడా అనేది తెలీదు కానీ, చాలా లో క్లాస్ లో ఉంది.

ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకుని చంపే ఆపరేషన్ “జీరో డార్క్ 30” టైటిల్ తో సినిమాగా వచ్చింది. చాలామంది చూసే ఉంటారు. అందులో ఇంటిని చుట్టు ముట్టి కేప్చర్ చేసే సీన్లు వస్తున్నప్పుడు హోరెత్తించే సంగీతం వినపడదు. చిన్న చిన్న శబ్దాలు, ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల్ని అరెస్ట్ చేసేస్తుంది ఆ ఎపిసోడ్. ఇక్కడ ప్రధమార్ధంలో ఒక టెర్రరిస్టు ఉన్న ఇంటిని కేప్చర్ చేసే సీన్ ని ఆ సీన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాదుడు వల్ల సీన్ ఎలివేట్ కాలేదు.

ద్వితీయార్ధం చివర్లో ఇందుకి ముకుంద్ మరణవార్త తెలిసినప్పటి సీన్ లో మాత్రం సంగీత దర్శకుడు మెయింటైన్ చేసి బతికించాడు. అక్కడ కూడా ఏదో ఫిల్ చెయ్యాలని వాయిద్యాలని వాయించి ఉంటే సీన్ పాడైపోయేది.

ఎంత ఆర్మీలో మేజర్ ర్యాంక్ ఆఫీసర్ అయినా మిడిల్ క్లాస్ ఖర్చుల లెక్కలు, లోన్ తీసుకుని ఫ్లాట్ కొనడాలు వంటి అంశాలు చూపించడం బాగుంది. ఆర్మీ ఆఫీసర్ల త్యాగమయమైన జీవితాల్ని ఇలాంటి సన్నివేశాలు ఇంకాస్త ఎలివేట్ చేస్తాయి.

అలాగే ముకుంద్, ఇందు పాత్రలు ఫోన్లో వీడియో కాల్ ఆన్ చేసుకుని పక్క పక్కనే పడుకునే సన్నివేశం కొత్తగా ఉండి ఆకట్టుకుంటుంది.

శివ కార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ గా పర్ఫక్ట్ గా సరిపోయాడు. పాత్రకి తగిన బాడీ బిల్డింగ్, బాడీ లాంగ్వేజ్ చూపించాడు.

ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ సాయిపల్లవి. ఆమె ఉందన్న కారణంగానే క్రేజ్ వచ్చింది. నటనపరంగా ఆమె ఊహించినట్టుగానే రక్తికట్టించింది. కొన్ని సన్నివేశాల్లో ఈమె తప్ప మరో నటి ఎవరున్నా ఇంత ఎమోషనల్ గా ఉండేది కాదేమో అనిపిస్తుంది.

తల్లిదండ్రుల, ఇతర కుటుంబ సభ్యుల కేరక్టర్లు పోషించిన నటీనటులు చాలా నార్మల్ గా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకి వాళ్లెవరూ పెద్దగా పరిచయం ఉన్నవాళ్లు కాదు.

ఇతర ఆర్మీ జవాన్లు, ఆఫీసర్స్ కూడా అంతే. కల్నల్ గా కనిపించిన రాహుల్ బోస్ ఒక్కడూ సుపరిచితమైన మొహం.

ఓవరాల్ గా ఈ చిత్రం ఆర్మీ ఫైట్లని ఇష్టపడే టీనేజ్ ఆడియన్స్ కి, సాయిపల్లవి అభిమానులకీ నచ్చుతుంది. నిత్యం సినిమాలు చూసేవాళ్లకి మాత్రం ఇందులో కొత్తదనం, సరికొత్త అనుభూతిలాంటివి ఏవీ కలగవు. ఇది ఇద్దరు టెర్రరిస్టు నాయకుల్ని చంపి వీరమరణం పొంది, మరణానంతరం అశోకచక్ర పురస్కారన్ని పొందిన ఒక ఆర్మీ వీరుడి కథ. కానీ సాయిపల్లవి వల్ల ఇది ఇందు రెబెక్కా వర్ఘీస్ కథ కూడా అయ్యింది. మేకింగ్ ఇంకా బాగుండొచ్చని అనిపించినా…ఆర్మీ వైబ్స్ ని, దేశభక్తి తాలూకు ఎమోషన్ ని, టెర్రరిస్టుల్ని ఎదుర్కొనే ఆపరేషన్స్ ని, సున్నితమైన ఒక సగటు ఆర్మీ వైఫ్ మనసుని వెండితెరమీద పరిచిన ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ కి నిజమైన నివాళి.

బాటం లైన్: సాయిపల్లవి కోసం

13 Replies to “Amaran Review: మూవీ రివ్యూ: అమరన్”

  1. అరవ సినిమాలకి వీడు ఎక్కువ డబ్బులు తీసుకుని రివ్యూ లు రాస్తాడు..3 రేటింగ్ అనేది చాలా చాలా ఎక్కువ ఈ సినిమాకి

  2. greatandhra వారికి నచ్చినట్టు తీయగలిగే మాగోడు ఇంకా పుట్టలేదు మిత్రమా ! దేవుడా ఎక్కడ ఉన్న మావాడికి నచ్చేటట్టు తీసే మాగోడిని పుట్టించు స్వామి

Comments are closed.