మట్కా, కంగువా.. సినిమా కష్టాలు

రేపు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ నైజాంలో ఆ సినిమాకు థియేటర్లు లేవు. కీలకమైన సెంటర్లలో ఇప్పటికీ బుకింగ్స్ తెరుచుకోలేదు. మరో సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.…

రేపు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ నైజాంలో ఆ సినిమాకు థియేటర్లు లేవు. కీలకమైన సెంటర్లలో ఇప్పటికీ బుకింగ్స్ తెరుచుకోలేదు. మరో సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. థియేటర్లు మాత్రం దండిగా పెట్టారు. బుకింగ్స్ బొత్తిగా కనిపించడం లేదు.

బహుశా.. ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ సినీ రంగంలోనే జరుగుతాయేమో. చూద్దామనుకున్న సినిమాకు థియేటర్లు లేవు. మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమాకు ఇబ్బడిముబ్బడిగా స్క్రీన్స్. అవే కంగువా, మట్కా సినిమాలు.

సూర్య హీరోగా నటించిన సినిమా కంగువా. ఈ హీరో కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. పూర్తిస్థాయి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకు భారీగా ప్రచారం చేశాడు సూర్య. 2 విడతలుగా హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్ లో లోటు లేకుండా చూసుకున్నాడు. దీంతో అంచనాలు బాగానే సెట్ అయ్యాయి.

కానీ నైజాంలో ఈ సినిమా రిలీజ్ మరీ తీసికట్టుగా తయారైంది. ఎగ్జిబిటర్లతో ఉన్న సమస్యల కారణంగా, ఈ సినిమాకు భారీగా స్క్రీన్స్ తెచ్చుకోలేకపోతోంది పంపిణీ సంస్థ ‘మైత్రీ’. విడుదలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న వేళ.. ఏషియన్, పీవీఆర్ ఛెయిన్స్ లో ఇప్పటివరకు బుకింగ్స్ తెరుచుకోలేదు. వేట్టయాన్, గోట్ సినిమాలతో పోలిస్తే.. వాటికి కేటాయించిన స్క్రీన్స్ లో సగం కూడా కంగువాకు ఇప్పటివరకు రాలేదు.

నైజాంలోనే కాదు, అటు తమిళనాట కూడా పరిస్థితి ఇలానే ఉంది. సూర్యపై కొంతమంది ఎగ్జిబిటర్లు చాన్నాళ్లుగా గుర్రుగా ఉన్నారు. దీంతో తమిళనాట ఇప్పటివరకు 50శాతం సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అటు ప్రమోషన్ పెద్దగా లేకపోవడంతో మలేషియా, సింగపూర్ లో బుకింగ్స్ డల్ గా ఉన్నాయి.

కంగువా కష్టాలు ఇలా ఉంటే, మట్కా కష్టాలు దీనికి పూర్తి భిన్నం. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకు భారీగా ప్రచారం చేస్తున్నారు. స్వయంగా హీరో రంగంలోకి దిగి తెలుగు రాష్ట్రాలు చుట్టేస్తున్నాడు. ఆమధ్య ముంబయి కూడా వెళ్లొచ్చాడు. ప్రచార హోరుకు తగ్గట్టే ఏపీ, నైజాంలో థియేటర్లు కూడా భారీగా కేటాయించారు.

కానీ వరుణ్ తేజ్ ట్రాక్ రికార్డ్ కారణంగా మట్కాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. మధ్యాహ్నం 12 గంటల టైమ్ కు కీలకమైన హైదరాబాద్ సెగ్మెంట్ లో 5 శాతం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరగలేదు. స్క్రీన్స్ అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదే ట్రెండ్ రేపు ఉదయం వరకు కొనసాగితే, మట్కా మార్నింగ్ షోలు భారీగా రద్దయ్యే అవకాశాలున్నాయి.

ఇలా రేపు రిలీజ్ అవుతున్న 2 సినిమాలు, 2 రకాల కష్టాల్ని ఫేస్ చేస్తున్నాయి. బజ్ ఉండి థియేటర్లు దొరక్క ఓ సినిమా.. భారీ సంఖ్యలో స్క్రీన్స్ ఉన్నప్పటికీ ఆశించిన బజ్ లేక ఇంకా సినిమా ఇబ్బంది పడుతున్నాయి.

11 Replies to “మట్కా, కంగువా.. సినిమా కష్టాలు”

Comments are closed.