'వాళ్లు నన్ను విమర్శిస్తూ ఉన్నారు. వారిని పిలిచి మీరు మందలించండి. మీరు చర్యలు తీసుకోకపోతే నేను కోర్టుకు వెళ్తా..' ఇదీ ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ సారాంశం అనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిమ్మగడ్డ గవర్నర్ కు ఏమని లేఖ రాశారో బయట వాళ్లకు తెలియదు కానీ, మీడియాలో మాత్రం ఈ మేరకు ప్రచారం జరుగుతూ ఉంది. ఏపీ ఎస్ఈసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మంత్రుల హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లు ఎస్ఈసీని విమర్శించారు. అలాగే ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల కూడా బహిరంగ విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని.. రాజ్ భవన్ కు పిలిచి మందలించాలని నిమ్మగడ్డ కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఇది కోరడంలా లేదని.. వారిని గవర్నర్ పిలిచి మందలించకపోతే తను కోర్టుకు వెళ్తానంటూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారని కూడా పత్రికల్లో రాశారు. గవర్నర్ ను నిమ్మగడ్డ కోరినట్టుగా లేదని, గవర్నర్ ఏం చేయాలో ఆదేశించినట్టుగా ఉంది ఈ వ్యవహారం అని ప్రజలు అనుకోవాల్సి వస్తోంది.
ఏపీలో ప్రభుత్వానికి, ఎస్ఈసీకి పరస్పర నమ్మకం లేదని సామాన్య ప్రజలకు కూడా బోధపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీరి రచ్చ సామాన్యులు విసిగెత్తిపోయేలా ఉంది. ఈ విషయంలో ఎవ్వరినీ వెనకేసుకు రావాల్సిన అవసరం ప్రజలకు లేదు. ఎవరికి వారు తమ అధికార పరిధిని చూపించుకుంటున్నారనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ హద్దు మీరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటున్నారు. గవర్నర్ విచక్షణాధికారాలను కూడా నిమ్మగడ్డే శాసిస్తూ ఉన్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో తాము ప్రివిలైజ్ కమిటీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారట ఏపీ మంత్రులు.
నిమ్మగడ్డ గవర్నర్, కోర్టు అంటుంటే.. మంత్రులు ప్రివిలైజ్ కమిటీ అంటున్నారు! ఎవరికి వారు తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రయోగించడానికి ఎన్నికల ప్రక్రియను ప్రయోగశాలగా మార్చుకున్నారేమో అని సామాన్యుడు విసిగెత్తి పోతే బాధ్యత ఈ ముఖ్యులదే అవుతుంది. ప్రజలు కోరుకుంటే ఆగిన ఎన్నికలు కావు, ప్రజలు కోరుకుంటే వచ్చిన ఎన్నికలు కావివి. కీలక హోదాల్లోని వ్యక్తులు తమకు అధికారాలు ఉన్నాయని చూపించుకోవడానికి పడుతున్న ఆరాటంలా ఉంది ఈ వ్యవహారం అంతా.
చంద్రబాబుకు ఏజెంట్లా పనిచేస్తున్న నిమ్మగడ్డ..
చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?