శేఖర్ కమ్ముల..మారుతి..శ్రీవాస్..ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కొందరు ట్రయిల్స్ వేసారు. కొందరు స్క్రిప్ట్ వరకు వెళ్లారు. మరి కొందరు ఆదిలోనే తప్పించుకున్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రశాంత్ వర్మ వంతు వచ్చింది. ఇదంతా నిర్మాత దానయ్య కుమారుడు కళ్యాణ్ తెరంగ్రేటం గురించే.
ఎన్నో బ్లాక్ బస్టర్లు తీసిన, తీస్తున్న దానయ్య ఆ బిజీలో పడి కొడుకు లాంచింగ్ ను మాత్రం ప్రోపర్ గా చేయలేకపోతున్నారేమో? ముందుగా శేఖర్ కమ్ముల అనుకున్నారు. టెస్ట్ షూట్ లు అవీ జరిగాయి. కానీ ఎక్కడో తేడా వచ్చింది.
మారుతికి అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఆయనతో పెద్ద సినిమా చేయాలని మనసు మార్చుకున్నారు. శ్రీవాసు డైరక్షన్ ఫిక్స్ చేసారు. కథ, స్క్రిప్ట్ వర్క్ మీద చాలా కాలం కసరత్తు చేసారు. కానీ ఎందుకో సెట్ కాలేదు.
ఆఖరికి ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారు. హనుమాన్ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రశాంత్ వర్మ యంగ్ హీరోలతో మంచి వెరైటీ సినిమాలు ప్లాన్ చేస్తూ వస్తున్నారు.
అందువల్ల కళ్యాణ్ తో కూడా అలాంటి సినిమాను ప్లాన్ చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పుడైనా కళ్యాణ్ తెరంగ్రేటం ఏ ఆటంకం లేకుండా జరుగుతుందేమో?