ఏజెంట్ బయ్యర్ కు హ్యాండ్ ఇచ్చేసారు

టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే అని అనేసుకోవాలేమో…ఇక్కడ మన బాధ మనం చూసుకోవాల్సిందే. ఎదుటివాడి బాధ గురించి ఆలోచిస్తే మనం బాధ పడిపోవాల్సి వస్తుందేమో? ఏజెంట్ సినిమాతో పాతిక కోట్ల నష్టంలో మునిగిపోయారు…

టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే అని అనేసుకోవాలేమో…ఇక్కడ మన బాధ మనం చూసుకోవాల్సిందే. ఎదుటివాడి బాధ గురించి ఆలోచిస్తే మనం బాధ పడిపోవాల్సి వస్తుందేమో? ఏజెంట్ సినిమాతో పాతిక కోట్ల నష్టంలో మునిగిపోయారు ఆ సినిమా హోల్ సేల్ బయ్యర్. నాన్ రికవరబుల్ అడ్వాన్స్ పద్దతిన తీసుకున్నారు కనుక నిర్మాతకు ఏ చట్టబద్దమైన బాధ్యత వుండదు. కానీ నైతిక బాధ్యత అనేది వుంటుంది.

ఏజెంట్ సినిమా తరువాత లైన్ లో వున్న సినిమాలు ఇచ్చి ఆదుకుంటారు అనే ఏ బయ్యర్ అన్నా అనుకుంటారు. ఎంతో కొంత వెనక్కు ఇచ్చి ఆదుకోవడం అన్నది కామన్. అది ఎలాగూ ఇప్పట్లో జరిగే వ్యవహారం కాదు. కనీసం లైన్ లో వున్న పెద్ద సినిమా అన్నా ఏదో ఒక రేటుకు ఇస్తే బయ్యర్ గట్టెక్కుతాడు. కానీ అది కూడా జరగలేదు.

హోల్ సేల్ బయ్యర్ సతీష్ తనకు భోళాశంకర్ సినిమా వైజాగ్ ఏరియా హక్కులు ఇస్తారని ఆశపెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అవి కాస్తా వేరే వాళ్లకు ఇచ్చేసారు. అదేంటీ అని అడిగితే హీరో మెగాస్టార్ ఇవ్వమని చెప్పడంతో అలా చేయక తప్పలేదని సమాధానం వచ్చిందట. నేరుగా మెగాస్టార్ నే అడుగుతానంటే, వద్దని వారించారని తెలుస్తోంది.

పదేళ్ల కిందట ఇదే అనిల్ సుంకర సినిమా ఒకటి కుదేలైపోయానని, మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తిందని బయ్యర్ సతీష్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కోటిన్నర తక్కువగా కమిట్ అయిన మొత్తం అంతా ఏజెంట్ కు కట్టానని, ఆ కోటిన్నర కూడా మహాసముద్రం సినిమాలో లాస్ కు సంబంధించినది అని ఆయన చెబుతున్నారని తెలుస్తోంది.

మరి ఈ విషయంలో కౌన్సిల్ ఏమి చేస్తుందో, ఛాంబర్ ఏమి అంటుందో?