నిజంగా ఇది విచిత్రమే. రాష్ట్ర రాజకీయాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా ఉచిత విద్యుత్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ మాత్రమే. ఆయన మానసపుత్రిక ఈ పథకం.
అయితే టీడీపీ నేతలు నడుస్తున్న చరిత్రను కూడా వక్రీకరించేస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎన్టీయార్ ప్రారంభించారని తెలుగుదేశం నేతలు తాజాగా చెబుతూండడం విడ్డూరమే.
నిజానికి ఎన్టీయార్ రైతులకు విద్యుత్ ని సబ్సిడీ మీద అందించారు. అంతవరకూ చెప్పుకుంటే ఫరవాలేదు కానీ ఉచిత విద్యుత్ కి ఆద్యుడు అన్నగారే అంటే ఎలా కుదురుతుంది.
ఇక నాడు చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరవేసుకోవాల్సిందేనంటూ ఆడిన ఎకసెక్కాలు కూడా అంతా మరచిపోయారనుకుంటే ఎలా.
ఉచిత విద్యుత్ క్రెడిట్ ని ఎన్టీయార్ కి, చంద్రబాబుకూ, కిరణ్ కుమార్ రెడ్డికీ కూడా టీడీపీ ఆపాదించేసింది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇపుడు టీడీపీలో ఉన్నాడు. ఆ మాజీ సీఎం మీద కూడా ఏవో ఆశలు ఉన్నట్లున్నాయి.
మొత్తానికి గుంపులో గోవిందం మాదిరిగా వైఎస్సార్ కి ఉచిత విద్యుత్ పధకంలో వీరితో పాటుగా స్థానం ఇచ్చారు తెలుగుదేశం నాయకులు.
ఇక జగన్ ఉచిత విద్యుత్ కి ద్రోహం చేస్తున్నారు అని రైతులకు మీటర్లు బిగిగించి ఉరితాళ్ళు వేస్తున్నారని అచ్చెన్నాయుడుతో సహా తమ్ముళ్ళు తెగ బాధపడిపోతున్నారు. ఇలా చాలానే చెబుతున్న తమ్ముళ్ళకు ఎంత ధీమా అంతే తాము చెప్పిందే వేదమని, దాన్ని జనం నమ్ముతారు అని.