చిరు వార్తతో అంతమంది వైసీపీ నేతలు బాధపడ్డారా?

చిరు రాజ్యసభ సీటు వ్యవహారం టీడీపీ మొదలు పెట్టినా, వైసీపీలో ఇబ్బంది పడినవారు ఉన్నారు. తాజాగా చిరంజీవి రాజ్యసభ సీటు గురించి వైవీ సుబ్బారెడ్డి స్పందించడమే దీనికి నిదర్శనం. పిలిచి సీటు ఇవ్వాల్సిన అవసరం…

చిరు రాజ్యసభ సీటు వ్యవహారం టీడీపీ మొదలు పెట్టినా, వైసీపీలో ఇబ్బంది పడినవారు ఉన్నారు. తాజాగా చిరంజీవి రాజ్యసభ సీటు గురించి వైవీ సుబ్బారెడ్డి స్పందించడమే దీనికి నిదర్శనం. పిలిచి సీటు ఇవ్వాల్సిన అవసరం వైసీపీకీ లేదని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికే జగన్ సీటు ఇస్తారని చెప్పారు. అంటే.. చిరుకి సీటు అనగానే.. వైసీపీ ఆశావహుల్లో కాస్త ఆందోళన పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. చివరికి చిరు నో వ్యూస్ ఓన్లీ న్యూస్ అనడంతో వారంతా కుదుట పడ్డారు.

ఈ ఏడాది ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అందులో ఒకటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిది కాగా, మరో మూడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నవారివి. అయితే ఈ దఫా లెక్కల ప్రకారం ఆ నాలుగు వైసీపీకే దఖలు పడతాయి. అంటే విజయసాయిరెడ్డికి తిరిగి ఆ పదవి కేటాయించినా, మరో మూడు ఆశావహులను ఊరిస్తున్నాయి. ఈ మూడింటికి 30 మంది పోటీలో ఉంటే, మధ్యలో ఏకగ్రీవం అంటూ చిరంజీవి పేరు తెరపైకి రావడంతో కొంతమంది టెన్షన్ పడ్డారు.

నామినేటెడ్ పోస్ట్ లు అనేవి పుష్పక విమానం లాంటివే. ఎంతమందికి ఇచ్చినా, ఇంకా ఆశావహులు ఉంటూనే ఉంటారు. గతంలో చేసిన త్యాగాలు, భవిష్యత్తులో చేయబోయే పనులు, అన్నీ వివరించి అధినేత వద్ద మంచి మార్కులు కొట్టేయాలనుకుంటారు. అందులోనూ జగన్ ఇచ్చిన మాట కోసం, వారు చేసిన త్యాగాల్ని లెక్కలోకి తీసుకుని చాలా ఈజీగా పదవుల్న కేటాయిస్తారని అంటుంటారు.

అందుకే చిరుకి రాజ్యసభ అనగానే అందరికీ ఎక్కడో చిన్న అనుమానం. ఆ అనుమానం వల్లే వైవీ సుబ్బారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా ఇలా తమ కామెంట్లతో బయటపడ్డారు.

టీటీడీ చైర్మన్ గా రెండేళ్ల పదవీ కాలం పూర్తైన తర్వాత సుబ్బారెడ్డి రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. కానీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపిస్తే విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గుతుందేమోనన్న అనుమానం కూడా ఉంది. అందుకే రెండు పవర్ హౌస్ లను ఒకే దగ్గర పెట్టడం ఇష్టం లేక జగన్ సుబ్బారెడ్డిని టీటీడీకి పరిమితం చేశారని కూడా అంటారు. అయితే రెండోసారి వరుసగా టీటీడీ చైర్మన్ పదవి వైవీకే ఇవ్వడంతో ఆయన రాజ్యసభ సీటు వ్యవహారం మరింత వెనక్కి వెళ్లింది. ఇప్పుడు మరోసారి సీట్లు ఖాళీ అవుతున్న సందర్భంలో ఆయన జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇందులో ఎంత నిజముందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మరోవైపు నెల్లూరు జిల్లా నుంచి బీదా మస్తాన్ రావు లాంటి పారిశ్రామిక వేత్తలు కమ్ పొలిటీషియన్లు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. ఈ దశలో మెగాస్టార్ వార్త ఇలాంటి ఆశావహులందరికీ షాకిచ్చింది, ఆ తర్వాత చిరు వివరణతో వారంతా కుదుటపడ్డారు.