తెలుగు సినిమాలు భారీ కలెక్షన్లను సాధిస్తున్నాయని కితాబిచ్చారు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జొహార్. ఈ రేంజ్ ను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని కూడా ఒక మాట అన్నాడు ఈ దర్శక నిర్మాత. ఈ ప్రశంస వినడానికి బాగానే ఉంది కానీ, తెలుగు సినిమా కలెక్షన్ యవ్వారాలు.. ఒక్కోరికి ఒక్కోలా చెబుతున్నారు ప్రొడ్యూసర్లు సినిమాల రూపకర్తలు!
ఒకవైపు వంద కోట్లు, రెండు వందల కోట్లు, మూడొందల కోట్లు అంటూ.. సినిమా విడుదలైన తొలి వారం లోపే పేపర్ ప్రకటనలు వరసగా ఉంటాయి. షేర్ అని, గ్రాస్ అని, నెట్ అని.. రకరకాల లెక్కలు చెబుతారు. నిర్మాతల, హీరోల ప్రకటనలను బట్టి చూస్తే.. ఏ సినిమా కూడా తెలుగులో ప్లాఫే కాదు! వచ్చిన ప్రతి సినిమా కూడా వందల కోట్ల రూపాయలను కుప్ప పోసుకుని వెళ్లిపోతోంది.
తీరా.. నిర్మాతలు చేసే ఈ ప్రకటనలు విని.. వీరు చేసిన ప్రకటనలకూ, తమకు కట్టిన ట్యాక్సులకూ సంబంధం లేకపోవడంతో… ఆదాయ పన్ను అధికారులు వీరి సినిమా ప్రొడక్షన్ హౌస్ ల మీద పడుతుంటారు. తమ సినిమా వంద కోట్లు, రెండొందల కోట్లు వసూళ్లు చేసిందని చెప్పిన నిర్మాతల ప్రకటనలు విని, అయితే వారు కట్టిన పన్నులు మాత్రం అందులో నాలుగో వంతు కూడా లేకపోవడంతో ఐటీ అధికారులు సెర్చ్ లు నిర్వహించిన దాఖలాలూ ఉన్నాయి.
అయితే ఆ అధికారులతో తాపీగా స్పందించారట సదరు నిర్మాతలు. తమ సినిమా వసూళ్లు పెరిగేందుకు విడుదలప్పుడు ఏవేవో చెబుతూ ఉంటామని, అవి నిజం కాదని.. ఐటీ అధికారులకు వినయంగా చెప్పుకుంటారు సదరు నిర్మాతలు. ఇది కేవలం ప్రచారం కాదు.. ఇది వరకూ పలు సార్లు జరిగింది కూడా ఇదే!
దీంతో ఏ సినిమా విడుదల సమయంలో కలెక్షన్ల గురించి ఆ టీమ్ అధికారికంగా చెప్పుకునే ఫిగర్లు అన్నీ కేవలం బోగస్ అని, కేవలం పబ్లిసిటీ కోసమే వాటిని చెప్పుకుంటారు తప్ప, వాస్తవంగా అంత దృశ్యం ఉండదని జనాలకు బాగా అర్థం అయ్యింది. ఈ మాత్రం కిటుకు బాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ అయిన కరణ్ కు తెలియక కాదు. జస్ట్ ఏదో అనేశాడు. ఈ మాట విని కొందరు సినీ వీరాభిమానులు.. తెలుగు వారి ఖ్యాతి జాతీయ స్థాయిలో మార్మోగుతోందని ఉప్పొంగిపోతున్నారు పాపం!
ఇవతల తెలుగు హీరోలు తమ సినిమా టికెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం తగ్గించి వేసిందని, కనీసం కిరాణా కొట్టుతో కూడా తాము పోటీ పడలేకపోతున్నామని వాపోతుంటే, ఇదే సమయంలో కరణ్ తెలుగు సినిమా వాళ్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయంటున్నాడే!