రిలీజ్ టైమ్ దగ్గరపడుతోంది. దీంతో భారీ సినిమాల నిర్మాతలు, హీరోలు తెగ హడావుడి పడుతున్నారు. ఎలాగైనా తమ సినిమాకు ప్రచారం కల్పించేందుకు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్లాన్స్ మిస్-ఫైర్ అవుతున్నాయి. మరికొన్ని సక్సెస్ అవుతున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలకు సంబంధించి అలా బెడిసికొట్టిన ప్లానింగ్స్ కొన్ని ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ విషయానికే వస్తే.. ట్రయిలర్ రిలీజ్ చేసిన వెంటనే ప్రెస్ మీట్స్ ఏర్పాటుచేశారు. ముంబయిలో ప్రెస్ మీట్ బాగానే జరిగింది. హైదరాబాద్ కు వచ్చేసరికి వ్యవహారం చెడిపోయింది. ప్రెస్ మీట్ కు మీడియాను పిలవాల్సిన మేనేజ్ మెంట్ కంపెనీ, మీడియాతో పాటు అభిమానుల్ని కూడా పిలవడంతో మొదటికే మోసం వచ్చింది. తాకిడి ఎక్కువై మొత్తంగా ప్రెస్ మీట్ రద్దు చేశారు. ఆ తర్వాత సదరు ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని కూడా తొలిగించారు.
సరిగ్గా పుష్ప విషయంలో కూడా ఇదే జరిగింది. మొన్నటికిమొన్న పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేశారు. టీవీల్లో చూసిన వాళ్లకు అది బాగా జరిగినట్టు కనిపించి ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్లినోళ్లకు అసలు విషయం అర్థమౌతుంది. కెపాసిటీని మించి అభిమానుల్ని లోపలకు అనుమతించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఒక దశలో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై కేసు కూడా నమోదైంది..
ఇదే సినిమాకు సంబంధించి మరో గందరగోళం కూడా జరిగింది. ఫ్యాన్స్ మీట్ అంటూ ప్రచారం చేశారు. బన్నీ స్వయంగా అభిమానులతో ఫొటోలు దిగుతాడంటూ ఊదరగొట్టారు. దీంతో లెక్కలేనంత మంది గీతాఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడ స్థలం సరిపోకపోవడంతో, ఎన్-కన్వెన్షన్ కు రమ్మన్నారు. అక్కడకు కూడా భారీగా ఫ్యాన్స్ చేరుకున్నారు.
అయితే ఏం జరిగిందో ఏమో ఆఖరి నిమిషంలో ఆ కార్యక్రమం కూడా రద్దు చేశారు నిర్వహకులు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్-కన్వెన్షన్ గేట్లు విరిచేశారు, అద్దాలు పగలగొట్టారు, బారికేడ్లు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఫ్యాన్స్ కు దెబ్బలు తగలడమే కాదు, కేసులు కూడా పడ్డాయి.
జరిగిన ఘటనపై బన్నీ విచారం వ్యక్తంచేశాడు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని మాటిచ్చాడు. అయితే ఈ ఈవెంట్ ఎవరు నిర్వహించారు, ఎందుకు రద్దు చేశారు, అసలు బన్నీ దీనికి ఓకే చెప్పాడా లేదా లాంటి విషయాల్ని మాత్రం బయటకు రానివ్వలేదు.
టాలీవుడ్ లో 2 పెద్ద సినిమాలకు సంబంధించి వరుసగా ఇలా అపశృతులు దొర్లడం, ఇండస్ట్రీని ఆలోచింపజేసింది. త్వరలోనే భీమ్లానాయక్, రాధేశ్యామ్ ప్రచారం కూడా మొదలుకాబోతోంది.