సీఎంను విమ‌ర్శిస్తే స‌హించంః న్యాయ‌స్థానం

ముఖ్య‌మంత్రిని విమ‌ర్శిస్తే స‌హించ‌మ‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించింది. ఈ ర‌క‌మైన హెచ్చ‌రిక‌లు మ‌ద్రాస్ హైకోర్టు మదురై ధ‌ర్మాస‌నం చేసింది. మ‌దురైకి చెందిన సాట్టై మురుగ‌న్ అనే నిందితుడు ప‌దేప‌దే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ను విమ‌ర్శిస్తుండ‌డం,…

ముఖ్య‌మంత్రిని విమ‌ర్శిస్తే స‌హించ‌మ‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించింది. ఈ ర‌క‌మైన హెచ్చ‌రిక‌లు మ‌ద్రాస్ హైకోర్టు మదురై ధ‌ర్మాస‌నం చేసింది. మ‌దురైకి చెందిన సాట్టై మురుగ‌న్ అనే నిందితుడు ప‌దేప‌దే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ను విమ‌ర్శిస్తుండ‌డం, అందులో నిజాలు లేక‌పోవ‌డంతో ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయ్యింది.

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌పై మ‌దురై నివాసి సాట్టై మురుగ‌న్ ప‌లు ఆరోప‌ణ‌లు చేశాడు. నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన అత‌నిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. జామీను కోరుతూ అత‌ను మ‌ద్రాస్‌ హైకోర్టు మ‌దురై బెంచ్‌లో పిటిష‌న్ వేశాడు. ఈ పిటిష‌న్‌ను న్యాయ‌మూర్తి పుగ‌ళేంది విచారించారు.

ముఖ్య‌మంత్రి స్టాలిన్ చ‌క్క‌గా త‌న విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. అలాంటి సీఎంను అభినందించ‌క‌పోయినా ఫ‌ర్వా లేద‌ని, విమ‌ర్శించ‌డాన్ని మాత్రం న్యాయ‌స్థానం స‌హించ‌ద‌ని గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఎలాంటి త‌ప్పు చేసిందో చెప్పాల‌ని నిందితుడిని హైకోర్టు నిల‌దీసింది.

సీఎంను విమ‌ర్శించ‌న‌ని కోర్టుకు ఇచ్చిన హామీని ధిక్క‌రించి ఇకపై ఏ ఒక్క మాట మాట్లాడినా జామీను ర‌ద్దు చేస్తామ‌ని  న్యాయ‌మూర్తి హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. న్యాయ వ్య‌వ‌స్థ గౌర‌వాన్ని పెంచేలా జ‌డ్జి హెచ్చ‌రిక‌లు ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.