మాట తప్పాడు… మడమ తిప్పాడు

జ‌గ‌న్ ప్ర‌భుత్వ దుందుడుకు నిర్ణ‌యాలు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్నాయి. అనాలోచిత నిర్ణ‌యాలు ప్ర‌భుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నాయి. ఆవేశంలో విచ‌క్ష‌ణ కోల్పోయి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై మ‌ళ్లీ తన‌కు తానుగా వెన‌క్కి రావ‌డం …త‌ద్వారా ఏపీ…

జ‌గ‌న్ ప్ర‌భుత్వ దుందుడుకు నిర్ణ‌యాలు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్నాయి. అనాలోచిత నిర్ణ‌యాలు ప్ర‌భుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నాయి. ఆవేశంలో విచ‌క్ష‌ణ కోల్పోయి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై మ‌ళ్లీ తన‌కు తానుగా వెన‌క్కి రావ‌డం …త‌ద్వారా ఏపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌లు న‌వ్వుల‌పాల‌వుతున్నాయి. ఈ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఎన్నాళ్లో అనే వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఏపీ ప్ర‌భుత్వ స్వ‌యంకృతాప‌రాధ‌మే త‌ప్ప‌, మ‌రెవ‌రో కార‌ణం కాద‌ని చెప్పొచ్చు.

సీఆర్‌డీఏ ర‌ద్దు, వికేంద్రీక‌ర‌ణ బిల్లులను ఉప‌సంహ‌రించుకోవ‌డం వ్యూహాత్మ‌క‌మ‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే ఈ బిల్లుల‌ను మ‌ళ్లీ స‌మ‌గ్రంగా తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వం అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించింది కాబ‌ట్టి. ఆ మరుస‌టి రోజే శాస‌న‌మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని వెన‌క్కి తీసుకుంటూ …మ‌రో తీర్మానాన్ని ప్ర‌భుత్వం చేయ‌డం గ‌మ‌నార్హం.

తెలియ‌క జ‌రిగితే పొర‌పాట‌ని స‌రిపెట్టొచ్చు. అన్నీ తెలిసి కూడా త‌ప్పు చేస్తే దాన్ని అహంకార‌మనో, నియంతృత్వ‌మ‌నో, మ‌రో పేరుతోనే పిలుస్తారు. 2020, జ‌న‌వ‌రి 27న శాస‌న మండ‌లి ర‌ద్దు తీర్మానంపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్  ఏం మాట్లాడారో తెలుసుకుందాం.

‘శాసన మండలికి ఎలాంటి ప్రజాప్రయోజనాల్లేవు. దీనిపై డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ. కేబినెట్‌ కేవలం శాసనసభకే జవాబుదారీగా ఉంటుంది కానీ శాసనమండలికి కాదు. ఏడాదికి రూ.60 కోట్లు ఈ దండగ పనికి ఖర్చు చేయడం ఆమోదయోగ్యం కాదు. బిల్లులకు అడ్డు తగులుతూ దిక్కుమాలిన ఆలోచనలు చేసే మండలి అవసరం లేదు. దానిని రద్దు చేస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నాను. త్వరలో మా పార్టీకి మండలిలో మెజారిటీ వస్తుందని అందరికీ తెలుసు. అయినా సరే… ప్రజావసరాలు, ప్రభుత్వ బాధ్యతలే మాకు ముఖ్యం. అందుకే మండలిని రద్దు చేస్తున్నాం!’ అని ముఖ్య‌మంత్రి బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు.

త్వ‌ర‌లో త‌మ పార్టీకి మండ‌లిలో మెజార్టీ వ‌స్తుంద‌ని తెలుసంటూనే, మ‌రోవైపు అలాంటి వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చెప్ప‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. పోనీ ఆ నిర్ణ‌యంపై ఎందుకు నిల‌బ‌డ లేక‌పోయారు? ఏమిటీ రివ‌ర్స్ పాల‌న‌? అధికారాన్ని క‌ట్ట‌బెట్టింది చిత్ర‌విచిత్ర నిర్ణ‌యాలు తీసుకోడానికి కాద‌ని పౌర స‌మాజం హెచ్చ‌రిస్తోంది.

ఇప్పుడేమో మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని వెన‌క్కి తీసుకుంటూ అసెంబ్లీలో మ‌రో తీర్మానం. ఆ తీర్మానంపై మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ‌రెడ్డి మాట్లాడుతూ  ‘ ఇప్పటి వరకూ శాసనమండలిని రద్దు చేయడంలో సందిగ్ధత నెలకొంది. శాసనమండలిలో విద్యావేత్తలు, మేధావులు ఉన్నారు. కిందిస్థాయి నుంచి పైకెదిగిన దళిత నేత శాసనమండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇలాంటి తరుణంలో సందిగ్ధతను తొలగించేందుకు.. శాసనమండలిని రద్దు చేయాలంటూ గతంలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నాం!’ అని సెల‌విచ్చారు.

సందిగ్ధ‌త సృష్టిక‌ర్త తానేన‌ని ఏపీ ప్ర‌భుత్వం అసెంబ్లీ వేదిక‌గా అంగీక‌రించిన‌ట్టే. ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకునే ముందూ దాని ప‌ర్య‌వ‌సానాల గురించి ఏ మాత్రం ఆలోచించ‌కుండా ముంద‌డుగు వేయ‌డం ఒక్క జ‌గ‌న్ ప్ర‌భుత్వానికే చెల్లింది. మండ‌లి ర‌ద్దు తీర్మానం చేసే పంపితే… కేంద్ర ప్ర‌భుత్వం సానుకూల నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం ఎలా ఆలోచించింది? ఆ మాత్రం అంచ‌నా లేకుండానే త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పున‌రుద్ధ‌రించిన శాస‌న మండ‌లి వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డం కేవ‌లం జ‌గ‌న్‌కు మాత్ర‌మే చెల్లించింది. 

ఏదో ఒక రోజు కోపం వ‌చ్చి అసెంబ్లీని ర‌ద్దు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని…గ‌త రెండున్న‌రేళ్లుగా సీఎం జ‌గ‌న్‌ను ద‌గ్గ‌ర‌గా చూస్తున్న ఓ ప్ర‌భుత్వ పెద్ద వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.