భ‌ట్టి వ్యూహం…తేలిపోతున్న రేవంత్‌!

తెలంగాణ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ అడుగులు వేస్తున్నారు. భ‌ట్టి వ్యూహం ముందు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తేలిపోతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వైఎస్సార్ త‌న‌య‌, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల త‌న…

తెలంగాణ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ అడుగులు వేస్తున్నారు. భ‌ట్టి వ్యూహం ముందు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తేలిపోతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వైఎస్సార్ త‌న‌య‌, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆ పార్టీలో క్రియాశీల‌క పాత్ర పోషించ‌నుంది. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ జిల్లాలోని ఇడుపుల‌పాయ‌లో వైఎస్సార్ ఘాట్‌ను భ‌ట్టి విక్ర‌మార్క సంద‌ర్శించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ష‌ర్మిల చేరిక‌ను ఆయ‌న స్వాగ‌తించారు. వైఎస్సార్ కుటుంబం అంటే కాంగ్రెస్‌కు ఎంతో అభిమానం అని ఆయ‌న చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో వైఎస్సార్‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులున్నారు. వీళ్లంద‌రి అభిమానాన్ని చూర‌గొనేందుకు భ‌ట్టి విక్ర‌మార్క పావులు క‌దుపుతున్నారు. వైఎస్సార్ స్ఫూర్తితోనే తాను ఇటీవ‌ల తెలంగాణ‌లో పాద‌యాత్ర చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. వైఎస్సార్‌తో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం వుంద‌న్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు మంచి రోజులొస్తున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో సీఎం పీఠంపై కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రికి వారు ఆశ‌లు పెంచుకుంటున్నారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే తానే సీఎం అని ఫిక్స్ అయిపోయారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అది చేస్తా, ఇది చేస్తా అని ఆయ‌న హామీలిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ నాయ‌కుల‌తో పాటు శ్రేణుల మ‌న్న‌న‌లు పొందాల‌ని భ‌ట్టి విక్ర‌మార్క భావిస్తున్నారు.

రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ శ్రేణులు చంద్ర‌బాబు శిష్యుడిగానే భావిస్తున్నాయి. వైఎస్సార్‌పై రేవంత్‌రెడ్డికి గౌర‌వం లేద‌నే అభిప్రాయం వుంది. అందుకే ఇంత వ‌ర‌కూ ఇడుపుల‌పాయ‌ను రేవంత్‌రెడ్డి సంద‌ర్శించ‌లేద‌ని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్య‌క్షుడు అయిన వెంట‌నే ఎల్లో మీడియా అధిప‌తుల‌ను క‌లిసి ఆశీస్సులు తీసుకోవ‌డం ద్వారా, తాను బాబు మ‌నిషినే అని చాటుకున్న‌ట్టైంది.

అందుకే భట్టి విక్ర‌మార్క తెలివిగా వైఎస్సార్‌ను అభిమానించే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునేందుకు ష‌ర్మిలపై సానుకూలంగా మాట్లాడార‌ని చెప్పొచ్చు. మ‌రోవైపు ష‌ర్మిల చేరిక‌ను రేవంత్‌రెడ్డి వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల‌ను రేవంత్‌రెడ్డి వ్య‌తిరేకించ‌డం అంటే వైఎస్సార్‌కు వ్య‌తిరేకంగా న‌డుచుకోవ‌డ‌మ‌నే సంకేతాలు వెళ్తాయి. దీంతో ష‌ర్మిల చేరిక‌తో తెలంగాణ‌లో స‌రికొత్త రాజ‌కీయం స్టార్ట్ కానుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్ర‌బాబు శిష్యుడిగా రేవంత్‌రెడ్డి, వైఎస్సార్ వ‌ర్గంగా ఆయ‌న త‌న‌య ష‌ర్మిల‌తో పాటు టీపీసీసీ అధ్య‌క్షుడిని వ్య‌తిరేకించిన వారిని స‌మాజం చూస్తుంది. ఈ ధోర‌ణి కాంగ్రెస్ పార్టీకి అధికారం అందిస్తుందా?  దూరం చేస్తుందా? అనేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.