చంద్రబాబు చేసిన పాపం.. పవన్‌కు దెబ్బే!

ఇరుకిరుగ్గా ఉండే సందుల్లో రోడ్ షో పేరిట బహిరంగ సభలు పెట్టడం.. అసలే ఇరుగ్గా ఉండే రోట్లకు ఇరువైపులా ఫ్లెక్సిలతో సగం నింపేయడం.. తరలించిన జనం క్రిక్కిరిసి నిలబడిపోతే.. డ్రోన్ షాట్ తీసి.. జనం…

ఇరుకిరుగ్గా ఉండే సందుల్లో రోడ్ షో పేరిట బహిరంగ సభలు పెట్టడం.. అసలే ఇరుగ్గా ఉండే రోట్లకు ఇరువైపులా ఫ్లెక్సిలతో సగం నింపేయడం.. తరలించిన జనం క్రిక్కిరిసి నిలబడిపోతే.. డ్రోన్ షాట్ తీసి.. జనం పోటెత్తినట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడం.. ఇటీవలి ప్రచార సభల్లో చంద్రబాబునాయుడు అనుసరిస్తూ వస్తున్న స్ట్రాటజీ ఇది. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఈ వక్ర స్ట్రాటజీ ఇకపై సాగే అవకాశం లేదు. 

రాజకీయ పార్టీలు నిర్వహించే రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన స్థలాల్లో మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబునాయుడు కందుకూరు సందుల్లోనూ, గుంటూరు గొందుల్లోనూ నిర్వహించిన సభలు ఏకంగా 11 మందిని బలితీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. సభల పేరుతో జనహననానికి పాల్పడే పార్టీల దుర్మార్గపు ఎత్తుగడలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. పంచాయతీలు, మునిసిపాలిటీలో.. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బందిలేని విధంగా ఉండే స్థలాల్లోనే సభలు రోడ్డుషోలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని హోంశాఖ అధికారులకు సూచించింది. 

అంటే.. సభ పెట్టుకోవాలంటే.. బహుశా ఆ ఊరిలో అనుమతి లభించగల ప్రదేశాల జాబితాను పోలీసు అధికారులే తెలియజేస్తారు. అందులో ఒకచోట మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా.. అవాంఛనీయ సంఘటనలకు చెక్ ఫెట్టడొం సాధ్యమవుతుందని అనుకుంటున్నారు. అరుదైన సందర్భాల్లో మాత్రం షరతులతో కూడిన అనుమతులు ఇస్తారని అంటున్నారు.

అయితే ఈ నిర్ణయం ప్రభావం విపక్ష పార్టీల మీదనే ఎక్కువగా పడే అవకాశం ఉంది. చంద్రబాబునాయుడు పరిస్థితి వేరు. ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు. మైదానాల్లోనే అనుమతులు ఇచ్చినా కూడా చచ్చీచెడీ పెట్టుకుంటారు. కానీ తాను ఎక్కడ తలిస్తే అక్కడ రోడ్డు మీద వాహనం ఆపేసి పది మంది జనం కనపడగానే.. హఠాత్తుగా పూనకం తెచ్చుకుని ప్రసంగించడానికి వీలుగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని తయారుచేయించుకున్న సంగతి తెలిసిందే. పవన్ రోడ్ షోలకు ఆ వాహనమే వేదికగా ఉపయోగపడేలాగా దానిని తయారుచేశారు. రోడ్లమీద జనంకనిపిస్తే ఆపి మాట్లాడేయాలనే ప్లాన్ వేసుకున్నారు. కానీ.. అలాంటి ప్లాన్లు చెల్లుబాటు కాకపోవచ్చు. 

చంద్రబాబు ఇరుకు సందుల సభలు ప్రజల ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు పవన్ కల్యాణ్ కు దెబ్బ అవుతాయి. ఆయన కూడా మైదానాల్లోనే సభలు పెట్టుకోవాలంటే.. పాపం జనాన్ని తరలించుకోవడమూ కష్టమే. వారాహి రూపంలోని వ్యూహమూ వర్కవుట్ కాదు.