టీమిండియాకు క్రికెట్ వ్యవహారాల్లో స్పాన్సర్లుగా వ్యవహరించిన కొన్ని కంపెనీలు అర్ధాంతరంగా వైదొలగడం ఇటీవలి కాలంలో జరిగింది. కొన్ని సంస్థలు ఇండియాలో దుకాణం సర్దేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కొన్ని ఆర్థికంగా దెబ్బతిన్నాయి. భారత క్రికెట్ జట్లకు అధికారిక స్పాన్సర్లు, ఐపీఎల్ స్పాన్సర్ల చరిత్ర చూస్తే.. సహారా, డీఎల్ఎఫ్, బైజూస్ తో సహా మరి కొన్ని కంపెనీలు కూడా ఆ తర్వాత వివాదాలు, ఆర్థిక ఇబ్బందులతో వార్తల్లో నిలిచాయి.
మరి స్పాన్సర్ చేసిన వ్యాపార సంస్థలు ఇక్కట్ల పాలయిన చరిత్ర ఉన్నా.. కొత్త స్పాన్సర్లకు అయితే కొదవలేదు! కొన్నేళ్ల కిందట బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ అంటూ ఒక కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశ పెట్టింది. గతంలో పెప్సీ కప్, కోకోకోలా కప్ అంటూ.. జరిగేవి. సీరిస్ సీరిస్ కూ స్పాన్సర్ మారిపోయేవాడు. అయితే కొన్నేళ్ల నుంచి ఇండియాలో ఏ క్రికెట్ సీరిస్ జరిగినా దానికి ఒకటే టైటిల్ ఉంటుంది.
ఆ కప్ పేరును మీడియాలో అలాగే చర్చ జరిగేలా చూస్తారు. మ్యాచ్ లు జరిగే స్టేడియం అంతా ఆ టైటిల్ స్పాన్సర్ పేరే కనిపిస్తుంది. పేటీఎం కప్ అంటూ.. చాలా మ్యాచ్ ల ను నిర్వహించారు. ఇప్పుడు అలాంటి న్యూ టైటిల్ స్పాన్సర్ బీసీసీఐకి లభించింది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వచ్చే మూడేళ్లూ ఇండియాలో బీసీసీఐ నిర్వహించే మ్యాచ్ లకు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. దీనికి గానూ 235 కోట్ల రూపాయల ఒప్పందం రెండు సంస్థల మధ్య కుదిరింది. ఇండియాలో వచ్చే మూడేళ్లలో నిర్వహించే మ్యాచ్ ల లెక్క ప్రకారం.. ఒక్కో మ్యాచ్ కు ఈ సాన్సర్ బీసీసీకి కోట్ల రూపాయల పైనే చెల్లిస్తుందట. దీనికి ప్రతిగా ప్రతి సీరిస్ నూ ఆ స్పాన్సర్ పేరుతో పిలుస్తారు.
జెర్సీ మీద ఉండే స్పాన్సరర్లకు తోడు.. ఇలాంటి మార్గాల్లో బీసీసీఐ తన ఆదాయాన్ని పొందుతూ ఉంది. ఒకవైపు స్పాన్సర్ చేసిన సంస్థలు రకరకాల కారణాలతో దెబ్బతింటున్నా, బీసీసీఐ ఆదాయానికి మాత్రం ఢోకా లేనట్టుగా ఉంది!