టాలీవుడ్ పంపిణీ రంగంలో దిల్ రాజు-శిరీష్ లతో వ్యవహారం మామూలుగా వుండదు. పట్టుదలతో ఎత్తుగడలు వేసి ఎదుటి వారిని చిత్తు చేయడంలో వారి తరువాతే ఎవరైనా. కానీ ఎవరైనా అడిగితే మాత్రం ముఫై థియేటర్లు చేతిలో పెట్టుకుని టాలీవుడ్ ను కంట్రోల్ చేయగలనా? అని అమాయకంగా ఎదురు ప్రశ్నిస్తారు.
సంక్రాంతి కి దిల్ రాజు డబ్బింగ్ సినిమ వారసుడు తో స్ట్రయిట్ సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా వుంది.
పెద్ద సెంటర్లతో సమస్య లేదు. కానీ సింగిల్ స్క్రీన్ లు, డబుల్ స్క్రీన్ లు వున్న దగ్గరే సమస్య. ఇలాంటి సెంటర్లలో 100కు పైగా సెంటర్లలో వారసుడు సినిమాకు అగ్రిమెంట్ లు జరిగిపోయినట్లు తెలుస్తోంది. అంటే సింగిల్ స్క్రీన్ లలో తెలుగు స్ట్రయిట్ సినిమా వుండదు. డబుల్ స్క్రీన్ ల్లో బాలయ్య-మెగాస్టార్ ఏదో ఒకరి సినిమా మాత్రమే వుంటుంది.
ఇదిలా వుంటే ఇక్కడ దిల్ రాజు-శిరీష్ మరో ఎత్తుగడ వేసారని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఓక వేళ వారసుడు సినిమాను తరువాత తీయాల్సి వచ్చినా కూడా ఆల్టర్ నేటివ్ ను రెడీ చేసారు. యువి సంస్థ తను నిర్మించిన చిన్న సినిమా కళ్యాణం కమనీయం విడుదల డేట్ ను అనౌన్స్ చేసారు. అది జనవరి 14న విడుదలవుతుంది. వారసుడు ఖాళీ చేసే స్క్రీన్ లు అన్నీ ఆ సినిమాకే వెళ్తాయని, అదే దిల్ రాజు -శిరీష్ ల స్ట్రాటజీ అని వినిపిస్తోంది. అంటే సింగిల్, డబుల్ స్క్రీన్ సెంటర్లలో ఎప్పటికీ రెండు భారీ సినిమాల్లో ఒకటే పడుతుంది. రెండో దానికి చాన్స్ రావడానికి టైమ్ పడుతుంది.
ఆ విధంగా తనకు సినిమా ఇవ్వని మైత్రీ ని దిల్ రాజు-శిరీష్ బలంగా దెబ్బ కొట్టబోతున్నారని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఇలాంటి సెంటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగానే వుంటాయని లెక్కలు చెబుతున్నారు.