ఎప్పుడెవరికి డిమాండ్ వస్తుందో, ఎవరి డిమాండ్ పడిపోతుందో అర్థమే కావడం లేదు. అంతా కరోనా మాయ. ఓడల్ని బండ్లు చేస్తోంది. మరి బండ్లను ఓడలు చేస్తుందో లేదో ఇంకా తెలిసి రాలేదు.
సినీ సెలబ్రిటీల జీవితాలను మాత్రం కరోనా తలకిందులు చేస్తోంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో ఊహించని షాక్ తగులుతోంది. తాజాగా అందాల తార రకుల్‌ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్ సంగతి వింటే ఆశ్చర్యం కలుగుతోంది.
కరోనా సృష్టిస్తున్న విలయతాండవంలో సినిమా పరిశ్రమ బతికి బట్ట కట్టాలంటే నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గాలనేదే అందరి మాట. అయితే పిల్లి మెడలో గంట కట్టేదెవరనే సామెత చందానా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని హీరోహీరోయిన్లకు చెప్పేదెవరు? నిర్మాతలపై ఆర్థిక భారం పడకుండా రెమ్యునరేషన్ తగ్గించుకునే విషయంలో హీరోహీరోయిన్లు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ రకుల్ తన రెమ్యునరేషన్‌ను సగానికి సగం తగ్గించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.
తాజాగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు రకుల్ ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేదని టాక్. తాజా విపత్కర పరిస్థితుల్లో తన రెమ్యునరేషన్‌ను సగం తగ్గించుకునేందుకు రకుల్ సిద్ధమైనట్టు తెలిసింది. అయినా ఆమెకు అవకాశాలు తలుపు తట్టడం లేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టాలీవుడ్‌ను విడిచిపెట్టి బాలీవుడ్, కోలీవుడ్‌పై దృష్టి సారించాలని రకుల్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.