ఎవరు సినిమాతో రేపు థియేటర్లలోకి రాబోతున్నాడు అడివి శేష్. నిర్మాత పీవీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఓ ఆఫీస్ బాయ్ కు ఈ సినిమాను అంకితం చేశాడు. ఆ ఆఫీస్ బాయ్ వల్లనే తనలో కసి పెరిగిందని చెప్పుకొచ్చాడు.
“క్షణం సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్, వాళ్ల ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. నేను వెనకే ఉన్నాననే విషయాన్ని అతడు గమనించలేదు. అతడు ఫోన్ లో వాళ్ల ఫ్రెండ్ తో చెబుతున్నాడు. ఏదో చిన్న సినిమా చేస్తున్నారు, ఊపిరి వచ్చేంత వరకు చిన్న ప్లేస్ హోల్డర్ అని చెబుతున్నాడు. అతడి మాటను ఛాలెంజ్ గా తీసుకున్నాను. అతడి అభిప్రాయం తప్పని ప్రతి సినిమాతో ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అతడ్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సినిమాకు కష్టపడి పనిచేస్తాను. ఎవరు సినిమాను అతడికి అంకితం ఇస్తున్నాను.”
ఈ విషయాన్ని ఇప్పటివరకు పీవీపీతో కూడా చెప్పలేదన్న అడవి శేష్.. వస్తున్న అవకాశాల్ని ఎలాగోలా వాడుకోవాలనే మైండ్ సెట్ తనకు ఎంతమాత్రం లేదని స్పష్టంచేశాడు. ఎవరు సినిమా కోసం ఓ కొత్త పంథాను అనుసరించామని, కామన్ ఆడియన్స్ అభిప్రాయాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేశామని చెబుతున్నాడు.
“ఇప్పటివరకు ఈ సినిమాను ఓ వెయ్యి మందికి చూపించాం. పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు వాళ్లు. కాలేజ్ స్టుడెంట్స్, ఐటీ ఉద్యోగులు, వాచ్ మేన్ కుటుంబం.. ఇలాంటి వాళ్లు వెయ్యి మందికి చూపించాం. నేను, దర్శకుడు ఆ ఛాయల్లో ఉండేవాళ్లం కాదు. అసిస్టెంట్ డైరక్టర్లను మాత్రమే ఉంచి సినిమా చూసిన తర్వాత వాళ్ల అభిప్రాయాల్ని తీసుకున్నాం. మేం వాళ్లకు ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. వాళ్లుగా వచ్చి చెప్పిన అభిప్రాయాల్ని మాత్రమే తీసుకున్నాం. ఆ ఫీడ్ బ్యాక్ ద్వారా సినిమాను మరింత బెటర్ గా చేశాం.”
రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఒక రోజు ముందుగా, అంటే ఈరోజే మీడియాతో పాటు కామన్ ఆడియన్స్ కు చూపించబోతున్నారు. ఈ మేరకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను రద్దుచేసి, ఆ స్థానంలో ప్రీమియర్ ఏర్పాటుచేశారు. సో.. 'ఎవరు' ఎలా ఉందనే విషయం ఈరోజు రాత్రికే తెలిసిపోతుందన్నమాట.