టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణకు కొందరు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సినిమా చూపిస్తున్నారు. కొట్టకుండా, తిట్టకుండా మంట పుట్టించడం అంటే ఎలాగో బాలకృష్ణ ఎపిసోడ్ మనకు కళ్లకు కడుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో రెండునెలలకు పైగా బుల్లితెర, వెండితెరకు సంబంధించి షూటింగ్‌లు పూర్తిగా బంద్ అయిన విషయం తెలిసిందే.
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మళ్లీ బుల్లితెర, వెండితెరలను షూటింగ్ బాట పట్టించేందుకు తెలంగాణ సర్కార్‌తో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పలు దఫాలుగా చర్చలు జరిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన చిరంజీవి ఇంట్లోనే కొందరు దర్శకులు, నిర్మాతలు, హీరోలు…ఇతరత్రా ప్రముఖులు సమావేశమై చర్చించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా ప్రగతి భవన్లో చిరు, నాగార్జున తదితరుల సారథ్యంలో కలిసి చర్చించారు.
తెలంగాణ సర్కార్‌తో చిత్ర పరిశ్రమ ప్రముఖులు చర్చించడంపై టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు. తనను ఆహ్వానించకపోవడంపై ఆయన మండిపడ్డారు. తననెవరు పిలిచారని ఆయన ప్రశ్నించారు. అలాగే భూములు పంచుకోడానికి కలిశారా అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. బాలకృష్ణ మాటలపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 9న ఏపీ సీఎం జగన్‌ను చిరంజీవి నేతృత్వంలో కలవబోతున్నట్టు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ సినిమా షూటింగ్స్ ప్రారంభించడానికి అందరం కలిసి ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే అన్నారు. అందులో భాగంగా జూన్ 9 మధ్యాహ్నం 3 గంటలకు వై.ఎస్.జగన్‌ను కలవనున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి రావాలని నందమూరి బాలకృష్ణకు తాను ఫోన్ చేసి ఆహ్వానించినట్టు కల్యాణ్ వెల్లడించారు.
అయితే జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజని, ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోవచ్చన్నారు. చిరంజీవి , ఇతర పెద్దలు వై.ఎస్ జగన్‌ను కలుస్తున్నట్టు కల్యాణ్ వెల్లడించారు. అయితే ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. కేసీఆర్‌తో బాలకృష్ణకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటీవల ఓ ఇటర్వ్యూలో తనపై కేసీఆర్ పుత్ర వాత్సల్యం చూపుతారని బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఏపీ విషయానికి వస్తే బాలకృష్ణ, చంద్రబాబు నీడను కూడా జగన్ భరించే పరిస్థితి లేదు. అందువల్ల బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశమే లేదు.
కానీ తనను పిలవలేదని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేయడం మరిచిపోకనే…మరో తెలుగు రాష్ట్ర సీఎంతో జరిగే సమావేశానికి ఆహ్వానం అందింది. సీఎం జగన్‌తో మీటింగ్‌కు వెళ్లలేదనే అపప్రద బాలకృష్ణకు మిగిలిపోనుంది. మున్ముందు బాలకృష్ణ నోరెత్తకుండా సైలెంట్‌గా చెక్ పెట్టినట్టైంది. మొత్తానికి వచ్చే చోటికి పిలుపు లేదు…రాని చోటికి రావయ్యా బాలయ్యా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి భలే ఇరికించారనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.