కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇరు వైపుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరి నేతల మధ్య మాటలు మంట పుట్టిస్తున్నాయి. కౌంటర్, ఎన్‌కౌంటర్ అన్నట్టు ఇరు పక్షాల మీడియా సమావేశాలు తలపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో తాజాగా శనివారం ఏవీ సుబ్బారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి మాట్లాడుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియపై పోటీకి సిద్ధమన్నారు. తమది ఆళ్లగడ్డ అని, అక్కడే రాజకీయం చేస్తామని తేల్చి చెప్పారు. ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయాలని తమని స్వాగతించడానికి అఖిలప్రియ ఎవరని ఆమె ప్రశ్నించారు.
అఖిలప్రియను అక్కా అని పిలవాలంటే అసహ్యం వేస్తోందని ఈసడించుకున్నారు. దేవుడిచ్చిన మామ (ఏవీ)ను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. భూమా దంపతులు, తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డి 30 ఏళ్ళ కష్టమే అఖిలప్రియకు ఆ స్థానం తెచ్చి పెట్టిందని జస్వంతి అన్నారు. అఖిలప్రియది క్రిమినల్ మైండ్ అని, ఆమె తీరు మహిళలకే సిగ్గు చేటని ఏవీ కుమార్తె జస్వంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తన తండ్రి ప్రాణం ఖరీదు రూ.50 లక్షలా? అడ్డు వచ్చిన వారందర్నీ అఖిలప్రియ చంపుతుందా? అని ఏవీ కుమార్తె ఆవేదనతో ప్రశ్నించారు. ఏవీ కుమార్తె విమర్శలు, ఆరోపణలపై అఖిలప్రియ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వీళ్లిద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తుంటే మాత్రం…ఇప్పట్లో గొడవ సద్దుమణిగేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గృహమే లేకుండా ప్రజలతో గృహ ప్రవేశం చేయించిన ఘనుడు చంద్రబాబు