బిగ్ బాస్ నిర్వాహాకులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్వేతారెడ్డి ఫిర్యాదు మేరకు ఇప్పటికే వారిపై కేసులు నమోదు అయ్యాయి. అందుకు సంబంధించి బిగ్ బాస్ నిర్వాహకులు ముందస్తు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో వారు పోలీసుల ముందు హాజరై వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు పలు ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం. శ్వేతారెడ్డిని ఎవరు ఇంటర్వ్యూ చేశారు, ఆమెతో ఏ ప్రశ్నలు అడిగారు? మొదట ఓకే చెప్పి తర్వాత ఆమెను తిరస్కరించడం వెనుక కథేంటి? వంటి అంశాల గురించి పోలీసులు ఆరాతీసినట్టుగా సమాచారం.
తాము వంద ప్రశ్నల వరకూ అడిగిన తర్వాతే ఎవరినైనా బిగ్ బాస్ హౌస్ లోకి సెలెక్ట్ చేస్తామంటూ చెప్పారట నిర్వాహకులు. ఆ వంద ప్రశ్నల జాబితాను వారు ఏకరువు పెట్టినట్టుగా తెలుస్తోంది. పాపులారిటీని బట్టి తమ రియాలిటీ షోకు ఎంపిక చేయడం ఉంటుందని వారు చెప్పారట!
పాపులారిటీ సంగతి సరేకానీ, కాస్టింగ్ కౌచ్ సంగతేమిటో పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇప్పటికే తనను సంప్రదించిన వారిపై ఆమె చేసిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అందుకు సంబంధించిన విచారణ ఇలా కొనసాగుతూ ఉంది.