ఒకడేమో కాల్ మనీ కేటుగాడట.. ఇంకొకడేమో దొంగ బస్సులు నడిపినోడట.. మరీ, దారుణంగా కొబ్బరి చిప్పలు ఏరుకునేవాడు కూడా తెలుగుదేశం పార్టీలో వున్నాడట. అవునా.? తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇంత ఘనంగా మారిపోయిందా.? అని ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 'ఆపండిరా బాబూ మీ బూతు పురాణాలు.. పార్టీకి మీ వల్ల ఒరిగిందేమీ లేదుగానీ.. దయచేసి, పార్టీని వదిలి పోండి.. ఓ దరిద్రం వదిలిపోతుంది..' అంటూ సాధారణ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో వుండాలనుకుంటున్నారో.. బయటకు పోవాలనుకుంటున్నారోగానీ, ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబుకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు. అడపా దడపా అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నా, కేశినేని నాని లోలోపల ఖచ్చితమైన ఐడియాతోనే వున్నారు.. అదే తెలుగుదేశం పార్టీఇక పెద్ద షాక్ ఇవ్వడం.
మరో ఇద్దరు ఎంపీలు కింజరాపు రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్‌లతో పొసగక, పార్టీలో ట్వీటుతో కలకలం రేపిన కేశినేని నాని, ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో తన విమర్శనాస్త్రాల్ని కొంతకాలం అధికార వైసీపీ మీదకు మరల్చారు. అనూహ్యంగా మళ్ళీ సొంత పార్టీ మీదకు ఫోకస్ టర్న్ చేశారు. చంద్రబాబుకే డైరెక్ట్‌గా తన లేటెస్ట్ ట్వీట్‌తో వార్నింగ్ ఇచ్చేశారు కేశినేని నాని. 'మీ పెట్ డాగ్స్‌ని కంట్రోల్లో పెట్టుకోకపోతే, నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాను' అన్నది కేశినేని నాని తాజా ట్వీట్ సారాంశం.
కేశినేని దెబ్బకి సదరు 'పెట్ డాగ్' కంగారు పడిందనుకోవాలా.? అంతేగా మరి.! 'చంద్రబాబు సూచనతో ఇకపై ట్వీట్ల యుద్ధం ఆపేస్తాను..' అంటూ సదరు నేత, ట్విట్టర్లో సెలవిచ్చారు. అంతకు ముందు వరకూ, కేశినేనిపై విరుచుకుపడిపోయిన సదరునేత అనూహ్యంగా 'సైలెంట్ మోడ్'లోకి వెళ్ళిపోవడం గమనార్హం. అన్నట్టు, కేశినేని నాని చరిత్ర విప్పేస్తూ.. 'దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నెంబర్‌పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా వున్నాయి. వినే ధైర్యం నీకుందా?' అంటూ చెలరేగిపోయారు బుద్ధా వెంకన్న.
మొత్తమ్మీద, టీడీపీ నేతల జాతకాల్ని ఇంకెవరో విప్పాల్సిన పనిలేదు.. ఆ చెత్త చరిత్రలు జనానికి సవివరంగా తెలుగు తమ్ముళ్ళే వివరిస్తున్నారన్నమాట. అయినా, నిండా మునిగిపోయిన టీడీపీకి.. ఈ తెలుగు తమ్ముళ్ళ 'చెత్త చరిత్ర' తెచ్చే అదనపు నష్టం ఇంకేమన్నా వుంటుందా.? ఏమో, తొందరగా దుకాణం కట్టేయాలని తెలుగు తమ్మళ్ళు ఇంతలా ఆరాటపడుతున్నారేమో.. అంతేనంటారా.?