నటుడు, 'సైరా నరసింహారెడ్డి' సినిమా నిర్మాత రామ్ చరణ్ ఇంటి ముందు ఉయ్యాలవాడ వంశీకులు, ఆ ప్రాంతానికి చెందిన రైతులు నిరసనకు దిగడం ఆసక్తిదాయకంగా మారింది. తమ యోధుడి కథను అయాచితంగా సినిమా కథగా ఉపయోగించుకుంటూ, ఆయన పేరుతో మార్కెటింగ్ చేసుకుంటూ.. మరోవైపు తమ ప్రాంతంలో షూటింగ్ జరిపి, పంట నష్ట పరిహారాలు చెల్లించలేదని వారు వాపోయారు.
సినిమా షూటింగ్ సమయంలో తమ పంట పొలాల్లో షూటింగ్ జరిపారని, ఆ సమయంలో తమకు పంట నష్ట పరిహారం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వారు పేర్కొన్నారు. అయితే ఆ మేరకు పంట నష్ట పరిహారం చెల్లించకపోవడంతో పాటు, ఆ ఒప్పందం చెల్లదని ఇప్పుడు చెబుతున్నారని వారు వాపోయారు.
ఈ అంశంపై నిరసనగా వారు నిర్మాత రామ్ చరణ్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ విషయంపై ఆ హీరో నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి స్పందనా వ్యక్తం కాలేదు. నిరసనకు దిగిన వారికి పోలీసులు సర్ధి చెప్పి పంపించారు.
ఏదేమైనా.. కోట్ల రూపాయలు పెట్టి ఒక యోధుడి కథను సినిమాగా తీసుకుంటూ, అంతకు అనేక రెట్ల స్థాయిలో మార్కెటింగ్ చేసుకుంటూ, ఇలాంటి విషయాల్లో కక్కుర్తి పడటం మాత్రం ఏ మాత్రం సమంజసం కాదు. ఈ విషయంపై మెగా ప్రొడ్యూసర్ ఎలా స్పందిస్తాడో!