ఇటీవలే షూటింగ్ లో ప్రమాదం బారినపడ్డ హీరో శర్వానంద్ మళ్లీ సెట్ మీదకు వచ్చేస్తున్నారు. రెండు నెలల వరకు సెట్ మీదకే రాలేరు అని ప్రమాదం జరిగిన మొదట్లో వార్తలు వినిపించాయి. శర్వానంద్ కు కాస్త గట్టి శస్త్ర చికిత్సే జరిగింది. అందువల్ల కాస్త ఎక్కువ కాలం విశ్రాంతి, ఫిజియో థెరపీ అవసరం పడతాయని కూడా వినిపించింది. అయితే ఇప్పుడు శర్వా చాలా తక్కువ గ్యాప్ తోనే షూట్ కు రెడీ అయిపోతున్నాడు.
14రీల్స్ పతాకంపై నిర్మించే సినిమాకు రేపు అంటే ఆదివారం పూజ చేయబోతున్నారు. అలాగే ఇప్పటికే నిర్మాణంలో వున్న 96 సినిమాకు జూలై నెలాఖరు నుంచి షెడ్యూలు వేసుకోమని నిర్మాత దిల్ రాజుకు శర్వానంద్ చెప్పినట్లు తెలుస్తోంది. 96 సినిమా షూట్ లోనే శర్వానంద్ గాయపడ్డారు. ఈ సినిమాను వీలయినంత త్వరగా ఫినిష్ చేసి దసరా బరిలో దింపాలని స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఆ డేట్ మిస్ కాకూడదని ప్లాన్ చేస్తున్నారు.
ఇది పూర్తికాగానే 14 రీల్స్ సినిమా, అలాగే తమిళ నిర్మాత ప్రభు సినిమాలు వుంటాయి. ఇప్పటికే పూర్తిచేసిన రణరంగం సినిమా ఆగస్టు 2న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్ తో కనిపిస్తాడు.