జాగ్రత్త జగన్.. దళారీ వ్యవస్థ పెరిగే ప్రమాదం!

ఎంత గొప్ప పథకమైనా ఆచరణలో సమర్థవంతంగా ఉంటేనే దాని ఫలితాలు ప్రజలకు అందుతాయి. అలా లేకపోతే గొప్ప ఆలోచనలు కూడా ఆచరణలో చప్పగా ఉంటాయి. నాయకుడి విజన్, ప్రజలకు మంచి చేయకపోగా చెడుచేసే ప్రమాదం…

ఎంత గొప్ప పథకమైనా ఆచరణలో సమర్థవంతంగా ఉంటేనే దాని ఫలితాలు ప్రజలకు అందుతాయి. అలా లేకపోతే గొప్ప ఆలోచనలు కూడా ఆచరణలో చప్పగా ఉంటాయి. నాయకుడి విజన్, ప్రజలకు మంచి చేయకపోగా చెడుచేసే ప్రమాదం ఉంటుంది. సీఎం జగన్ నవరత్నాల హామీలు కూడా అలా కత్తిమీద సాములాగే కనిపిస్తున్నాయి.

విలేజ్ వాలంటీర్ వ్యవస్థ జగన్ విజన్ కి అగ్నిపరీక్షగా తయారవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది గ్రామ వాలంటీర్ల సైన్యాన్ని తయారుచేయాలనే కల జగన్ ది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందుబాటులోకి తేవడంతో పాటు.. నిరుద్యోగ సమస్యకు తాత్కాలిక పరిష్కారం ఈ విలేజ్ వాలంటీర్ వ్యవస్థ లక్ష్యం.

అయితే కొంతమంది అనుభవజ్ఞులైన అధికారులు మాత్రం ఈ వ్యవస్థతో అవస్థ తప్పదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విలేజ్ వాలంటీర్ల పేరుతో ప్రభుత్వమే దళారీ వ్యవస్థను పెంచి పోషించినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాలంటీర్ల సేవ ఎప్పుడూ ఉచితంగానే ఉండాలి, అప్పటికీ సీఎం జగన్ ఉదారంగా ఒక్కో వాలంటీర్ కి 5వేల రూపాయల గౌరవప్రదమైన జీతాన్ని ఆఫర్ చేశారు. అయితే 50 కుటుంబాలకు రేషన్ సరకులు ఇంటింటికీ ఇవ్వడం, వారి అప్లికేషన్లన్నీ భర్తీ చేయడం, వారి తరపున ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం, ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారమంతా ప్రజలకు వివరించడం ఇలా.. వారిపై చాలా బాధ్యతలే ఉన్నాయి.

విలేజ్ వాలంటీర్లపై గట్టి పర్యవేక్షణ ఉన్నప్పుడే ఇది విజయవంతం అవుతుంది. అలా లేకపోతే ఈ వ్యవస్థ నుంచే దళారీలు పుట్టుకొస్తారు. ప్రజలు, ప్రభుత్వ అధికారుల మధ్య అనుసంధానంగా ఉండాల్సిన వీరంతా.. ఆమ్యామ్యాలకు అలవాటు పడతారు. తమకోసం పనిచేస్తున్నారు కాబట్టి.. ప్రజలు కూడా సంతోషంగా తృణమో పణమో ఇస్తుంటారు. కానీ ఈ అలవాటు ప్రజలకు గ్రహపాటుగా మారితే ఈ వ్యవస్థకే చేటు తెచ్చే ప్రమాదం ఉంది.

ప్రతి పనికీ ఎంతో కొంత వాలంటీర్లకు ముట్టజెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడితే మాత్రం అది బలవంతపు వసూళ్లకు దారితీస్తుంది. ఇప్పటికే కొన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులకు పనికి ఇంత అని సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడిక వాలంటీర్ కి ఇంత, అధికారికి ఇంత అని వాటాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితి రాకూడదు అంటే.. ముందు నుంచే విలేజ్ వాలంటీర్ వ్యవస్థపై సమగ్ర పర్యవేక్షణ అవసరం. మొక్కలోనే ఇలాంటి అవలక్షణాలను అదుపులో పెట్టగలిగితే.. విలేజ్ వాలంటీర్ల విషయంలో దేశానికే దిక్సూచిగా మారుతుంది మన రాష్ట్రం. అప్పుడే జగన్ విజన్ కి సరైన అర్థం ఉంటుంది. 

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి