మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి సిసలైన ప్రచార పర్వం మొదలైంది. ఈరోజు ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇన్నాళ్లూ ఎన్టీఆర్, రామ్ చరణ్ పై మాత్రమే ఫోకస్ పెడుతూ ప్రచారం చేసిన యూనిట్.. ఇవాళ్టి మేకింగ్ వీడియోలో మాత్రం కీలకమైన నటీనటులందరికీ చోటిచ్చింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ నుంచి మొదలుపెడితే అలియాభట్, శ్రియ, అజయ్ దేవగన్, సముత్తరఖని, ఒలీవియా మోరిస్, ఎలిసన్ డూడీ లాంటి కీలక నటీనటులందరికీ మేకింగ్ వీడియోలో చోటు దక్కింది. వీళ్లతో పాటు కీలకమైన టెక్నీషియన్స్ అంతా కనిపించారు. రాజమౌళితో పాటు కీరవాణి, సెంథిల్, సాబు శిరిల్, రమా రాజమౌళి, శ్రీనివాస మోహన్.. ఇలా అందర్నీ 100 సెకెన్ల వీడియోలో కవర్ చేశారు.
ఈ సందర్భంగా విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఆర్ఆర్ఆర్ ను ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా చెప్పుకొచ్చిన యూనిట్, అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతున్నట్టు మేకింగ్ వీడియోలో స్పష్టంగా చెప్పారు. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై పూర్తిస్థాయిలో పుకార్లకు చెక్ పెట్టినట్టయింది.
సినిమా నేపథ్యం స్వాతంత్ర్య ఉద్యమ కాలానికి సంబంధించినదే అయినప్పటికీ.. మేకింగ్ వీడియోలో మాత్రం ఈ తరానికి తగ్గ మ్యూజిక్ వాడారు. గతంలో బాహుబలి-2కు కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోకు కూడా ర్యాప్, పాప్ మిక్స్ చేసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు కీరవాణి.