ఒక్కోసారి అనుకోకుండా ఒకటే టైపు పాత్రలు తయారవుతూ వుంటాయి. ఆ మధ్య నాగచైతన్య, నాని క్రికెటర్ లుగా కనిపించారు. విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ కూడా క్రికెటర్ గా కనిపించబోతోంది. లేటెస్ట్ గా నాని తన గ్యాంగ్ లీడర్ సినిమాలో రైటర్ గా కనిపించబోతున్నాడు. ఈ సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ కూడా రైటర్ గా కనిపించబోతున్నాడట.
క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మించే సినిమాలో విజయ్ దేవరకొండ రైటర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. అలా రైటర్ గా హీరో రాసిన మూడు కథలు సినిమాలో పేక్షకులు చూస్తారన్నమాట. మూడు కథల్లో విజయ్ నే హీరోగా వుంటాడు. వేరు వేరు హీరోయిన్లు వుంటారు. అంటే ఒక విధంగా రచయిత రాసిన కథలు కళ్ల ముందు ప్రాణం పోసుకుని కదలాడడం అనుకోవాలి.
ఈ పాయింట్ తో క్రాంతిమాధవ్ ఎలాంటి సినిమా చూపించబోతున్నాడో చూడాలి. ప్రస్తుతమా.. అప్రస్తుతమో కానీ వాస్తవానికి పురానా జమానాలో రాఘవేంధ్రరావు అందించిన కల్పన సినిమాలో అల్లు రామలింగయ్య రచయితగా కనిపిస్తాడు. అతగాడు రాసే కథల్లో పాత్రలన్నీ కళ్ల ముందుకు వచ్చేస్తుంటాయి. అయితే అదంతా కామెడీ వ్యవహారం.