వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఉంటూ, ఇన్నాళ్లూ తెలుగుదేశం మీద ఎడాపెడా విరుచుకు పడడానికి బాగా ఉపయోగపడిన నటి రోజాకు ప్రస్తుతానికి మంత్రి యోగం ఉన్నట్లుగా లేదు. సాధారణంగా అయితే జగన్ ప్రభుత్వం రాగానే రోజాకు మంత్రిపదవి గ్యారంటీ అని ఎవరైనా అంచనా వేస్తారు. కానీ రకరకాల సమీకరణాల నేపథ్యంలో రోజాకు ఇప్పుడు మంత్రిపదవి దక్కే యోగం లేదని తెలుస్తోంది.
చిత్తూరుజిల్లా నుంచి మంత్రిపదవిని ఆశిస్తున్న వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరువాత రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. ఏ రకంగా చూసినా అంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అవుతారు. జిల్లాలో పార్టీకి ఎప్పటినుంచో పెద్దదిక్కుగా ఉన్న పెద్దిరెడ్డికి పదవి ఇవ్వక తప్పదు. మంత్రివర్గ కూర్పులో కుల సమీకరణాలు, మహిళలకు చోటు కూడా కీలకం గనుక… రోజాను మినహాయిస్తే మరొక సామాజికవర్గం ప్లస్ మహిళ కోటా రెండూ భర్తీ అవుతాయని వారు అంచనా వేస్తున్నట్లుంది.
రోజా గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పటికీ వైస్సార్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ప్రత్యర్థులను తూలనాడడానికి బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడ్డారు. గతంలో అసెంబ్లీలో పార్టీ నిరసనల్లో భాగం పంచుకుంటూ… అధికార పార్టీ వారిని అసభ్య పదజాలంతో దూషించినందుకు రోజాపై నిరవధిక సస్పెన్షన్ వేటు పడింది. దానికి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్ట్ వరకు పోరాటం సాగించినా ఫలితం దక్కలేదు.
అసెంబ్లీ అమరావతికి ఆరిన తరువాత రోజా ఇప్పటిదాకా అందులో అడుగు పెట్టనేలేదు. ఇలా పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన నేపథ్యంలో మంత్రిపదవి తధ్యం అని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.