ముఖ్యమంత్రి అయిన తరువాత పార్టీ పరంగా జగన్ కు పెద్ద సవాలు మంత్రివర్గ ఏర్పాటే. 151 మంది గెలవడం అన్నది ఒక పాయింట్. రెడ్లు, కాపులు, బిసిలు పెద్ద సంఖ్యలో గెలవడం ఇంకో పాయింట్. ఆశావహులు ఎక్కువే వుంటారు. కానీ ఈసారి అర్హులు కూడ ఎక్కువ మందే వున్నారు. పైగా జగన్ మాట ఇచ్చినవాళ్లు వున్నారు. ఇవన్నీ బేరీజు వేసుకుని సెట్ చేయడం అంత వీజీ కాదు.
వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఉత్తరాంధ్ర నుంచి బిసిలను, ఎస్టీనీ, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల నుంచి కాపులను, సీమ, కృష్ణ, గుంటూరుల నుంచి ఫ్లార్వార్డ్ క్యాస్ట్ జనాలను తీసుకునే ఆలోచనలో జగన్ వున్నట్లు తెలుస్తోంది. యాభైకి పైగా రెడ్డి సామాజిక వర్గ సభ్యులు వున్నారు. వీరిలోంచి ఎనిమిది మంది వరకు మంత్రులు కావచ్చు అని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి ఒకటి లేదా రెండు పోస్టులు దక్కే అవకాశం వుంది.
బిసిలు, కాపులకు సరిసమానంగా అయిదు లేదా ఆరువంతున పదవులు వుండే అవకాశం వుందని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వున్న ధర్మాన, బొత్స లాంటివాళ్లు బిసి కోటాలోకి వస్తారని తెలుస్తోంది. తూర్పు నుంచి ఇద్దరు, పశ్చిమ నుంచి ఒక్కరు కాపు కోటాలోకి వస్తారని తెలుస్తోంది. అలాగే సామాజిక వర్గాల సమతూకం చూసుకుంటూ క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ తదితర వర్గాలకు కూడా ఒక్కో పోస్ట్ ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది.
సీమ నుంచి రెడ్లనే అధికంగా తీసుకుంటారు. తనకు అత్యంత నమ్మకస్తులయిన వారు, పార్టీని నమ్ముకున్నవారు అన్న రెండు అర్హతలు మాత్రమే కాకుండా, వివాదాలకు, అవినీతికి అడ్డంగా దూరిపోయి, కంపు చేసుకునేవారు అనే పాయింట్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు బోగట్టా. కానీ సీనియర్లు, అవకతవకల మరకలు వున్న ధర్మాన, బొత్స లాంటి వాళ్ల భారం మాత్రం జగన్ మోయక తప్పదు. వాళ్లను ఎలా కంట్రోల్ చేస్తారో? చూడాలి.