టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు బాలీవుడ్ మీడియా ఓ కొత్త బిరుదు ఇచ్చింది. అదే రీమేక్ రాజు. బాలీవుడ్ లోకి అడుగు పెట్టడమే రీమేక్ తో అడుగుపెడుతున్నాడు దిల్ రాజు. అక్కడితో ఆగకుండా వరుసగా రీమేక్స్ చేస్తున్నాడు. అందుకే ఇతడికి ఈ బిరుదు.
ప్రస్తుతం జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. తెలుగులో నాని పోషించిన పాత్రను, హిందీలో షాహిద్ కపూర్ హీరోగా పోషిస్తున్నాడు. తెలుగు వెర్షన్ ను డైరక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి, హిందీ రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజుకు ఇదే తొలి బాలీవుడ్ ప్రాజెక్టు.
ఈ సినిమాతో పాటు హిట్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు దిల్ రాజు. దీనికి సంబంధించి కూడా గతంలో అధికారిక ప్రకటన వచ్చింది. రాజ్ కుమార్ రావు హీరోగా అదే టైటిల్ తో, శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ సినిమా రాబోతోంది.
ఈ రెండు సినిమాలకు అదనంగా తాజాగా మరో రీమేక్ కూడా ఎనౌన్స్ చేశాడు దిల్ రాజు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో కలిసి నాంది సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. అజయ్ దేవగన్ ఇందులో నటించడు. దిల్ రాజుతో కలిసి నిర్మించబోతున్నాడు. తెలుగులో అల్లరినరేష్ చేసిన హీరో పాత్రను హిందీలో ఎవరు చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇలా బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ తోనే బాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు దిల్ రాజు. ఈ సినిమాలతో పాటు ఎఫ్2 సినిమా హిందీ రీమేక్ కూడా ఈ నిర్మాత లిస్ట్ లో ఉంది. అందుకే బాలీవుడ్ మీడియా దిల్ రాజును ఇప్పుడు రీమేక్ రాజును చేసేసింది.