చంద్రబాబుకి సరైన వాయిస్ లేదా..?

రాజకీయ చాణుక్యులంతా తమ సహచరుల్ని తమ భుజాల కంటే ఎత్తు ఎదగనీయరనేది వాస్తవం. చంద్రబాబు మరో అడుగు ముందుకేసి తన చుట్టూ ఉన్నవారినెవర్నీ తనలో సగం కంటే ఎత్తు ఎదగనీయకుండా మరుగుజ్జుల్ని చేసే రకం.…

రాజకీయ చాణుక్యులంతా తమ సహచరుల్ని తమ భుజాల కంటే ఎత్తు ఎదగనీయరనేది వాస్తవం. చంద్రబాబు మరో అడుగు ముందుకేసి తన చుట్టూ ఉన్నవారినెవర్నీ తనలో సగం కంటే ఎత్తు ఎదగనీయకుండా మరుగుజ్జుల్ని చేసే రకం. అలాంటి చంద్రబాబుకి ఇప్పుడు సపోర్టింగ్ వాయిస్ కరువైంది. ఫలితాలు దగ్గరపడే వేళ సీనియర్లు ఎవరూ చంద్రబాబుకి మద్దతుగా తెరపైకి రావడం లేదు. 

టీడీపీ నేతల్ని నెత్తికెక్కించుకునే మీడియా ఉంది, సెంటీ మీటర్ వార్తని, బ్యానర్ ఐటమ్ గా మార్చి ఏమార్చగల తోక పత్రికలున్నాయి అయినా పచ్చదంఢు ఎందుకో మీడియాకి దూరంగానే ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగానే సీజనల్ గా చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడుతున్నారు తప్ప, పూర్తిస్థాయిలో టీడీపీ నేతలెవరూ ఆయన వ్యాఖ్యల్ని సమర్థించిన పాపాన పోలేదు. బహుశా బాబుని అందరూ లైట్ తీసుకున్నారేమో అనిపిస్తోంది. 

ఈవీఎంల విషయంలో యనమల రామకృష్ణుడు కాస్త రెచ్చిపోయారు కానీ ఈమధ్య ఆయన సైలెంట్ అయ్యారు. కేబినెట్ భేటీ తర్వాత సోమిరెడ్డి వకాల్తా పుచ్చుకుంటున్నారు కానీ ఆయన కూడా సైలెంటే. సీజనల్ గా దేవినేని ఉమా, సీఎం రమేష్ తదితరులు రంగప్రవేశం చేస్తున్నారు. కేంద్ర మంత్రులుగా పదవులిప్పించినా అటు అశోక్ గజపతిరాజు కలసి రావడం లేదు. 

ఇటు కేసులతో సుజనా చౌదరి తెరమరుగయ్యారు. మొన్నటివరకు గొంతు చించుకున్న అచ్చెన్నాయుడు కూడా మౌనవ్రతం చేస్తున్నారు. ఇక లోకేష్ సంగతి చెప్పేదేముంది. ఆయన నోరు చంద్రబాబే కుట్టేశారు. చినబాబు ట్విట్టర్ లో పులి ప్రచారంలో పిల్లి అనే సామెత. 

మొత్తమ్మీద బాబు వాయిస్ కి బలం చేకూరుస్తూ మాట్లాడే నేతలే టీడీపీలో కరువయ్యారు. ఫలితాలు దగ్గరపడే కొద్దీ ఒక్కొక్కరే బాబుకి దూరమవుతున్నట్టున్నారు.