ఇన్నాళ్లూ కండల కోసం తిన్నాం, గుండె కోసం తిన్నాం, లివర్ కోసం తిన్నాం. కానీ ఇప్పుడు ఊపిరితిత్తుల కోసం ప్రత్యేకంగా తినాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా మహమ్మారి ఊపిరితిత్తులపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఊపిరితిత్తుల్ని బలోపేతం చేసుకోవడం అత్యవసరం. మరి దీనికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి.
రోగనిరోధక శక్తితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పదార్థం పసుపు. రోజూ తినే ఆహారంలో పసుపును వాడడం అనాదిగా వస్తోంది. కాకపోతే ఇప్పుడు ఆ మోతాదును ఇంకాస్త పెంచాలంటున్నారు ఆహార నిపుణులు. మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే మంచిదని సూచిస్తున్నారు.
ఊపిరితిత్తుల పనితీరును గణనీయంగా పెంచే ఆహార ఉత్పత్తులు బీట్ రూట్, ఆకుకూరలు. ఎక్కువమంది ఆకుకూరలు తింటారు, కానీ అదే టైమ్ లో బీట్ రూట్ ను నిర్లక్ష్యం చేస్తారు. కనీసం కూరలా కాకపోయినా, సలాడ్ రూపంలోనైనా బీట్ రూట్ తింటే చాలామంచిదంటున్నారు.
ఇక రోజూ తినే ఆహారంలో తులసి, వెల్లుల్లి, నిమ్మ ఉండేలా చూసుకుంటే మంచిది. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక ఊపిరితిత్తుల్ని శుభ్రం చేయడానికి తులసి, నిమ్మకాయలోని గుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇక పండ్లు విషయానికొస్తే.. ఆపిల్, బ్లూ బెర్రీ, అత్తి పండ్లు ఊపిరితిత్తులకు చాలా మంచిది. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, విటమిన్-సి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్ లో ఉండే పోషకాలు ఊపిరితిత్తుల్ని, గుండెను యాక్టివ్ గా ఉంచుతాయనేది ఇప్పటికే పరిశోధనల్లో తేలింది.
ఈ ఆహార పదార్థాలతో పాటు రోజూ గ్రీన్ టీ తాగడం కూడా ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీ వల్ల శరీరంలో కణజాలం మెరుగుపడ్డంతో పాటు మృతకణాలు తొందరగా తొలిగిపోతాయని అంటున్నారు.