సీతారాముల కల్యాణం.. చరిత్రలో తొలిసారి ఇలా!

సీతారాముల కల్యాణాన్ని కనులారా చూడాలి. అప్పుడే మోక్షం-ముక్తి రెండూ లభిస్తాయి. శ్రీరాముని కల్యాణానికి ఉన్న విశేషం ఇది. అందుకే సీతారాముల కల్యాణానికి భక్తులు పోటెత్తుతారు. కళ్లారా కల్యాణాన్ని చూస్తారు. కానీ ఈసారి ఆ అవకాశం…

సీతారాముల కల్యాణాన్ని కనులారా చూడాలి. అప్పుడే మోక్షం-ముక్తి రెండూ లభిస్తాయి. శ్రీరాముని కల్యాణానికి ఉన్న విశేషం ఇది. అందుకే సీతారాముల కల్యాణానికి భక్తులు పోటెత్తుతారు. కళ్లారా కల్యాణాన్ని చూస్తారు. కానీ ఈసారి ఆ అవకాశం లేదు. కరోనా కారణంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా భక్తులు లేకుండా కల్యాణాన్ని జరిపించడం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు చరిత్రకారులు.

కరోనా కంటే ముందు కూడా చాలా వైరస్ లు వచ్చాయి. కానీ ఎప్పుడూ భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి భక్తుల రాక ఆగలేదు. లక్షల కన్నులు చూస్తుండగానే స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగేది. కానీ ఈసారి కరోనా మహమ్మారి కోరలు చాచింది. అందుకే భక్తులెవ్వరూ భద్రాద్రికి రావొద్దని, కల్యాణానికి అస్సలు రావొద్దని అధికారులు వేడుకున్నారు. మరీ ముఖ్యంగా శ్రీరామనవమి నాడు పంచిపెట్టే పానకం, వడపప్పు, అన్నసంతర్పణను కూడా రద్దుచేశారు. 

అలా దేవస్థానం చరిత్రలోనే తొలిసారిగా రామయ్య కల్యాణాన్ని నిత్యకల్యాణ మండపం వద్ద నిర్వహిస్తున్నారు. భద్రాచల రామాలయం నిర్మాణం చేపట్టి దాదాపు 350 సంవత్సరాలు అయి ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఈ 350 ఏళ్లలో ఏనాడూ భక్తులు లేకుండా సీతారాముల కల్యాణం జరగలేదంటున్నారు.

కేవలం ఆలయ పురోహితులు, కల్యాణ కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించే మరికొంతమంది సిబ్బంది, ధర్మకర్తలు మాత్రమే ఈసారి రాములోరి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. భక్తులంతా టీవీల్లోనే కల్యాణ మహోత్సవాన్ని చూసి ఆనందించాలని అధికారులు కోరారు. అయితే భక్తులు లేకపోయినా కల్యాణ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని ఆలయ అర్చకులు ప్రకటించారు. అటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే కార్యక్రమాన్ని యథావిథిగా కొనసాగిస్తున్నారు.

తెలుగులో అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన నవనీత్ కౌర్