డొంక క‌దుపుతున్న ర‌ఘురామ సెల్‌ఫోన్

మ‌నిషి అబ‌ద్ధం చెప్పొచ్చు. కానీ ఆ మనిషి సృష్టించిన యంత్రం మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అబ‌ద్ధం చెప్పే అవ‌కాశం లేదు. అందుకే ప‌లు క్రిమిన‌ల్ కేసుల్లో నిందితులు త‌ప్పించుకునేందుకు ఎన్ని ప‌న్నాగాలు ప‌న్నినా, చివ‌రికి…

మ‌నిషి అబ‌ద్ధం చెప్పొచ్చు. కానీ ఆ మనిషి సృష్టించిన యంత్రం మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అబ‌ద్ధం చెప్పే అవ‌కాశం లేదు. అందుకే ప‌లు క్రిమిన‌ల్ కేసుల్లో నిందితులు త‌ప్పించుకునేందుకు ఎన్ని ప‌న్నాగాలు ప‌న్నినా, చివ‌రికి వారు వినియోగించే సెల్‌ఫోన్లు ప‌ట్టిస్తుండ‌డం మ‌న‌కు తెలిసిందే. అలాగే సీసీ కెమెరాలు కూడా నిందితుల ప‌ట్టివేత‌లో కీల‌కంగా ప‌ని చేస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ‌కీయంగా హాట్ టాపిక్‌గా మారిన ర‌ఘురామ‌కృష్ణంరాజు కేసులో ఆయ‌న సెల్‌ఫోన్ కీలకంగా మారింది. ర‌ఘురామ‌కృష్ణంరాజు సెల్‌ఫోన్ వాడ‌కంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపితే కుట్ర‌పూరిత నేరంలో అస‌లు గుట్టు ర‌ట్టు అవుతుంద‌ని సీఐడీ పోలీసులు విశ్వ‌సిస్తున్నారు.

కులాల పేరుతో విద్వేషాల‌ను రెచ్చ గొట్టేలా ర‌ఘురామ‌కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కుల, మత, వర్గాలను టార్గెట్‌ చేసుకుని, టీవీ5, ఏబీఎన్ చాన‌ళ్ల‌తో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు సీఐడీ పేర్కొంది. టీవీ5, ఏబీఎన్‌ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయ‌ని, డిబేట్ల పేరుతో ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషం జిమ్మించాయని సీఐడీ స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

ర‌ఘురామ‌కృష్ణంరాజును శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంత‌రం గుంటూరుకు త‌ర‌లించారు. ఆ రోజు రాత్రి ఆయ‌న్ను ఏపీ సీఐడీ పోలీసులు త‌మదైన శైలిలో విచారించిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఏపీ స‌ర్కార్‌ను బద్నాం చేసే కుట్ర వెనుక ఎవ‌రున్నార‌ని ర‌ఘురాముడిని సీఐడీ అధికారులు ప్ర‌శ్నించార‌ని, కొన్నింటికి స‌మాధానం చెప్ప‌గా, మ‌రికొన్నింటికి మాత్రం మౌనం పాటించార‌నే స‌మాచారం వ‌చ్చింది.

అయితే ముఖ్య‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దాట వేసి మౌనం పాటించిన ప్ర‌శ్న‌ల‌ను అంత‌టితో సీఐడీ అధికారులు విడిచి పెట్ట‌లేదు. త‌మ అనుమానాల‌కు ప‌క్కా ఆధారాలు ఎలా సేక‌రించాలో సీఐడీ అధికారులు ప‌క్కా ఓ ప్లాన్‌తో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ ఆధారాల‌ను సేక‌రించ‌డంలో ఏపీ సీఐడీ అధికారులు చురుగ్గా ప‌ని చేస్తున్నారు. 

ఇందులో భాగంగా ర‌ఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో ర‌చ్చ‌బండ వేదిక‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌దిత‌ర వైసీపీ ముఖ్యుల‌పై చేసే ఘాటు విమ‌ర్శ‌ల వెనుక అస‌లు సూత్ర‌ధారులు, పాత్ర‌ధారులు ఎవ‌ర‌నే విష‌య‌మై నిగ్గు తేల్చే ప‌నిలో ప‌డ్డారు.

ర‌ఘురాముడికి ఎవ‌రైనా స్క్రిప్ట్స్ పంపుతున్నారా? ఎవ‌రెవ‌రితో వాట్స‌ప్‌లో చాట్ , కాల్స్ చేశార‌నే విష‌యమై లోతుగా అధ్య య‌నం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందుకు సాంకేతిక నిపుణుల‌తో క‌లిసి ర‌ఘురామ‌కృష్ణంరాజు సెల్‌ఫోన్‌లో దాగిన ర‌హ‌స్యాల‌ను ఛేదించే ప‌నిలో ఏపీ సీఐడీ నిమ‌గ్న‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈ అన్వేష‌ణ‌లో సీఐడీ అధికారులు కొంత పురోగ‌తి సాధించార‌ని స‌మాచారం. సెల్‌ఫోన్ క‌దిపితే ర‌ఘురామ కుట్ర పూరిత కేసులో డొంక క‌దులుతున్న‌ట్టు తెలుస్తోంది.

దీంతో త‌మ పాత్ర బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భయాందోళ‌న‌లో బాబు అనుకూల చాన‌ళ్ల జ‌ర్న‌లిస్టున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో నిన్న ఒక‌రిద్ద‌రు ప్ర‌జెంట‌ర్లు డిబేట్ నిర్వ‌హ‌ణ‌కు కూడా రాలేద‌నే చ‌ర్చ సాగుతోంది. ర‌ఘురామ‌కృష్ణంరాజుతో పాటు ఆయ‌న సెల్‌ఫోన్ నుంచి సేక‌రించే కీల‌క ఆధారాలను బ‌ట్టి మ‌రికొంద‌రిని అరెస్ట్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.