సూపర్ స్టార్ సినిమా వస్తోందంటే.. ఏపీ కూడా ఊగిపోయింది. రజనీకాంత్ సినిమా విడుదల అవుతోందంటే… ఆ హడావుడే వేరు. ప్రత్యేకించి ‘రోబో’ తర్వాత రజనీకాంత్ సినిమాలకు తెలుగునాట బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చింది. అంతకు ముందులేదని కాదు.. రోబో తర్వాత బీభత్స స్థాయికి చేరింది రజనీకాంత్ క్రేజ్. అంతకు ముందున్న క్రేజ్‌కు రెట్టింపు క్రేజ్ అన్నమాట. ‘లింగా’, ‘కబాలి’ సినిమాలు… రజనీకాంత్ క్రేజ్ కు నిర్వచనాన్ని ఇచ్చాయి.
ఈ సినిమాల విడుదల తర్వాతి సంగతెలా ఉన్నా, విడుదలకు ముందు ఆ హైపే వేరు. ఈ సినిమాలు వస్తున్నప్పుడు ఒకరకంగా పండగ కల వచ్చింది. రోబో సినిమా కల్ట్ హిట్ కావడంతో.. లింగా, కబాలిల విడుదల ముందు వీటిపై సామాన్యజనాల్లో కూడా చర్చ జరిగింది. బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. అయితే విడుదల తర్వాత ‘లింగా’ తీవ్రంగా నిరాశ పరిచింది. ఒక టీవీ సీరియల్ చూస్తున్న అనుభూతిని ఇచ్చిన ఈ సినిమా ఎక్కడా రజనీకాంత్ మ్యాజిక్ లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది.
లింగా డిజాస్టర్ అయినా.. కబాలిపై మళ్లీ హైప్ పెంచగలిగారు. కేవలం తెలుగునాటే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కబాలి హైప్ పతాకస్థాయికి చేరింది. విదేశాల్లో తమిళులు గట్టిగా ఉండే ప్రాంతాల్లో కబాలి రోజున కొన్ని ఆఫీసులకు కూడా సెలవులు ఇచ్చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైప్ అంటే అది, సినిమాకు జోష్ అంటే అది అన్నట్టుగా ‘కబాలి’ నిర్వచనాన్ని ఇచ్చింది. అయితే ఆ హైప్‌తో ఓపెనింగ్స్ వచ్చాయి, కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అయితే సినిమాలో విషయం లేకపోవడంతో విమర్శలు తప్పలేదు.
ఆ ప్రభావం ఇప్పుడు ‘కాలా’ మీద స్పష్టంగా కనిపిస్తోంది. కబాలి ముందు వెబ్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ జరిగిన చర్చతో, వచ్చిన జోష్‌తో, హైప్‌తో పోలిస్తే.. కాలాపై ఉన్న అంచనాలు పదోవంతు కూడా లేవు. రెండు వరస ఫ్లాప్‌లు రజనీకాంత్ తాజా సినిమాపై అంచనాలను తగ్గించి వేశాయి. ఈ తక్కువ అంచనాల మధ్యన వచ్చి కాలా రజనీ మ్యాజిక్‌ను చూపిస్తుందేమో చూద్దాం!