చరిత్ర గొప్పదే కావచ్చు. కానీ వర్తమానం కూడా కీలకమే. చరిత్రలో ఎన్నో రాజ్యాలు, ఎందరో రాజులు వుండొచ్చు. గొప్పవారే కావచ్చు. కానీ ఇప్పుడు మన పతాకం..సర్వ స్వతంత్ర భారత పతాకం. దాని తరువాతే. గౌతమీపుత్ర శాతకర్ణి గొప్ప రాజే కావచ్చు.
ఆయన తెలుగు రాజే కావచ్చు. ఆ చరిత్ర సినిమా తీసినంత మాత్రాన, ఇప్పుడు ఆ పతాకం ఆవిష్కరించడం ఏమిటి? అదేమన్నా రాజకీయ పార్టీ పతకమా? వాడవాడలా ఆవిష్కరించడానికి. శాతకర్ణి మనకు గొప్ప. నైజాం మరి కొందరికి గొప్ప. అలా అని వాడవాడలా నైజాం పతకాం ఆవిష్కరణలు చేస్తామంటే జనాలు విమర్శించరా?
శాతకర్ణి సినిమా ప్రమోషన్ కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టవచ్చు. తప్పులేదు. కానీ వంద ప్రాంతాల్లో ఈ శాతకర్ణి పతాక ఆవిష్కరణలేమిటి? నిజంగా శాతకర్ణి అంతలా ఆవహించేస్తే, తెలుగుదేశం పార్టీ పతాకంగా పెట్టేసుకోవచ్చు.
అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవిష్కరించేసుకోవచ్చు. అంతేకానీ ఇదేమిటి. క్రిష్ అండ్ కో కి అమరావతి, శాతకర్ణి బాగా పూనేసినట్లు కనిపిస్తోంది. తెలుగు నాట ఇంకా అనేక రాజ్యాలు, సంస్థానాలు వున్నాయి. వాళ్లకీ పతకాలు వున్నాయి. కానీ అదంతా నిన్నటి చరిత్ర. గతంలో కూడా అనేక చారిత్రాత్మక సినిమాలు వచ్చాయి కానీ, ఇలా దాన్ని ప్రజల మీద ఇలా రుద్దే ప్రయత్నం మాత్రం జరగలేదు.