కోడి పందాలు ఆపడం ఎవ్వరి తరం?

ప్రపంచంలోని ప్రతి దేశంలో కొన్ని దురాచారాలుంటాయి. వీటిల్లో కొన్నింటిని సమాజం, చట్టం రెండూ ఒప్పుకోవు. కొన్నింటిని సామాజికంగా, నైతికంగా అంగీకరించకపోయినా చట్టం ఆమోదిస్తుంది. చట్టం దురాచారంగా పరిగణించినవి ప్రజలు దురాచారంగా చూడరు. వాటిని తరతరాలుగా…

ప్రపంచంలోని ప్రతి దేశంలో కొన్ని దురాచారాలుంటాయి. వీటిల్లో కొన్నింటిని సమాజం, చట్టం రెండూ ఒప్పుకోవు. కొన్నింటిని సామాజికంగా, నైతికంగా అంగీకరించకపోయినా చట్టం ఆమోదిస్తుంది. చట్టం దురాచారంగా పరిగణించినవి ప్రజలు దురాచారంగా చూడరు. వాటిని తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలంటారు. వాటిని పాటించాల్సిందేనని వాదిస్తారు. ఈ విషయంలో చట్టానికి, ప్రజలకు ఎప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.

జనం చట్టాన్ని ధిక్కరించి కూడా సంప్రదాయాల పేరుతో ఆ దురాచారాలను పాటిస్తూనే ఉంటారు. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు. పైగా ఓట్ల కోసం చూసీచూడనట్లుంటాయి. కేంద్రం ఆ దురాచారాల మీద నిషేధం విధిస్తే ఎత్తేయాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో పోరాడతాయి.

కేంద్రం నిషేధం విధించినా, న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా జనం పట్టించుకోరు. అలా పట్టించుకోకపోవడానికి కారణం మంత్రులు, అధికార పార్టీ, ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటమే. ప్రజాప్రతినిధుల మద్దతు ఉంటుంది కాబట్టి పోలీసులూ ఏమీ చేయలేరు. ప్రతి ఏటా ఈ ప్రహసనం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ తెర లేచింది. అదే 'సంక్రాంతి కోడి పందాలు'. 

ఈ పందాలను నిషేధించడం ఎవ్వరి తరం కాదనే సంగతి అందరికీ తెలుసు. తెలంగాణలో కోడి పందాలు కొన్ని ప్రాంతాల్లో ఆడతారేమోగాని ఈ పందాలకు అసలు చిరునామా ఆంధ్రప్రదేశ్‌. ఆ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో ఆడతారు. అయితే  గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఈ జిల్లాల్లోనూ ఈ పందాలకు ప్రసిద్ధి పొందిన ఊళ్లు ప్రత్యేకంగా ఉన్నాయి.

సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కోసమే విదేశాల్లో స్థిరపడిన తెలుగోళ్లు వస్తారంటే వీటిపట్ల మోజును ఎవరాపగలరు? సరే…ఎప్పటిమాదిరిగానే భేతాళుడు శవాన్ని భుజం మీద వేసుకొని నడిచినట్లుగా ఉమ్మడి హైకోర్టు 'తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు జరగడానికి వీల్లేదు' అని తాజాగా రెండు ప్రభుత్వాలను హుకూం జారీ చేసింది. పందాలు జరక్కుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మొన్నీమధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడి పందాలు ఆడటం నేరమని, దాన్ని మానుకోవాలని హితవు చెప్పారు. కాని ఆయన కేబినెట్‌లోని మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులే స్వయంగా కోడి పందాలను ప్రోత్సహిస్తున్నారు. కొందరు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. గత ఏడాది ఇదే జరిగింది. ప్రభుత్వం ఏం చేయగలిగింది?

కోడి పందాలు తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని, దీన్ని ఎవ్వరూ ఆపలేరని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులే బహిరంగంగా ప్రకటించారు. వీరే పందాలను లాంఛనంగా ప్రారంభించారు కూడా. పోలీసులు వీరి కన్నుసన్నల్లోనే పనిచేస్తుంటారు. కొన్నిచోట్ల దాడులు చేసినా అది నామమాత్రమే. ఈసారి బడా పందెంరాయుళ్లు కొందరు విదేశీ కోళ్లు తీసుకొస్తున్నట్లు వార్తలొచ్చాయి. పందెం కోళ్లను కొన్ని నెలల ముందునుంచే పోషిస్తుంటారు కాబట్టి విదేశీ కోళ్లను ఎప్పుడో తెప్పించేవుంటారు.

ఇక పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఇంకా కొనసాగుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇది కొత్త ఏడాదిలోనూ  కొన్ని నెలలు కొనసాగుతుందని వార్తలొస్తున్నాయి. అయితే పందెంరాయుళ్లు మాత్రం 'డోంట్‌ కేర్‌' అంటున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారే కోడి పందాలు ఆర్థిక సంక్షోభం కారణంగా ఆగవంటున్నారు. ఈ పందాల్లో కొత్త నోట్లతోపాటు పాత నోట్లు (రద్దయిన) నోట్లు కూడా వాడేందుకు పందెంరాయుళ్లు సిద్ధమయ్యారని ఓ ఆంగ్ల పత్రిక సమాచారం. ఆర్థిక సంక్షోభం కారణంగా తమలో జోష్‌ తగ్గలేదని చెబుతున్నారట…! 

ఆంధ్రాలో కోడిపందాల మాదిరిగానే తమిళనాడులో సంక్రాంతికి జల్లికట్టు క్రీడ ప్రసిద్ధి. పశువులను (ప్రధానంగా ఎద్దులను) హింసించే ఈ క్రీడను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పొంగల్‌ పేరుతో సంక్రాంతిని వేడుకగా జరుపుకునే తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని అధికార అన్నాడీఎంకే సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్‌శెల్వం పీఠం అధిష్టించాక మొదటిసారి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినప్పుడు జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జల్లికట్టు కోసం పెద్దఎత్తున ఉద్యమిస్తామని డీఎంకే ప్రకటించింది. తమిళనాడులో జల్లికట్టు కూడా ఓటర్లను ఆకర్షించే అంశమే. గత ఏడాది జయలలిత కూడా జల్లికట్టు కోసం కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కాని సుప్రీం కోర్టు బ్రేక్‌ వేసింది. అయినప్పటికీ కొన్ని చోట్ల ధిక్కరించి జల్లికట్టు నిర్వహించారు. ఓట్లు కావాలి కాబట్టి అన్నాడీఎంకే పెద్దగా పట్టించుకోలేదు.

అనేక రాష్ట్రాల్లో చట్టం నిషేధించిన క్రీడలు, దురాచారాలున్నాయి. అయినప్పటికీ వాటిని పూర్తిగా రూపుమాపడం సాధ్యం కాదు. ఇందుకు పాలకుల, అన్ని పార్టీల మద్దతే కారణం.