న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ని 3-0 తేడాతో గెల్చుకున్న తర్వాత, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇప్పటిదాకా వున్న అంచనాలు రెట్టింపయ్యాయన్నది నిర్వివాదాంశం. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది వెరీ వెరీ స్పెషల్ సిరీస్. టీమ్‌ని నడిపించిన నాయకుడిగా విరాట్ కోహ్లీకి నూటికి నూరు మార్కులూ పడతాయి. రెండో టెస్ట్, రెండో ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ పరుగులు చేయడం, మూడో టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా ఈ సిరీస్‌లో 'బ్యాటింగ్ వైఫల్యం' అనే విమర్శలకీ కోహ్లీ చెక్ పెట్టేశాడు.
ఓవరాల్‌గా చూస్తే, కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో సిరీస్‌ని కోహ్లీ మంచి ట్రాక్ రికార్డ్‌నే సంపాదించాడు. దాంతో సహజంగానే, కోహ్లీకి విమర్శకుల ప్రశంసలు దక్కుతాయి. కొందరేమో అత్యుత్సాహంతో, 'నో డౌట్, కోహ్లీ నెంబర్ వన్ కెప్టెన్..' అనేస్తున్నారు. ఏమో, భవిష్యత్తులో కోహ్లీ, టీమిండియాకి నెంబర్ వన్ కెప్టెన్ అనిపించుకుంటాడేమో. ఇప్పుడే ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసెయ్యడం తొందరపాటే అవుతుంది.
కెప్టెన్‌గా సాధించిన ఈ విజయం పట్ల కోహ్లీ, తన సహజ శైలికి భిన్నంగా చాలా కూల్‌గా స్పందించాడు. కెరీర్‌లో సక్సెస్‌లు, వైఫల్యాలు మామూలేననీ, జట్టుగా రాణించి సక్సెస్ కొట్టామనీ, నాయకుడిగా జట్టుని నడిపించిన ఘనత.. అనడం కన్నా, జట్టు మొత్తం సమిష్టిగా రాణించి, తద్వారా కెప్టెన్‌గా తనకూ మంచి విజయాన్ని జట్టు ఇచ్చిందనడం సబబేమోనని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
నిజమే మరి, ఒక్కోసారి మైదానంలో తీసుకునే డైనమిక్ డెసిషన్స్ దెబ్బ కొట్టేస్తుంటాయి. టెస్ట్ క్రికెట్‌లో అయితే మరీ చిత్రంగా మారిపోతాయి పరిస్థితులు. ఈ విషయంలో కోహ్లీ చాలా మెచ్యూర్డ్‌గానే ఆలోచించి స్పందించాడని చెప్పక తప్పదు. ఒకప్పటి కోహ్లీ వేరు, చిన్న చిన్న విషయాలకే తెగ ఇరిటేట్ అయిపోయేవాడు. ఇప్పుడు బాగా మారిపోయాడు. కోహ్లీ అలా మారడం కెప్టెన్‌గా అతనికే కాదు, టీమిండియాకి కూడా ప్లస్సే కదా.!