గ్యారేజ్ – ఎన్టీఆర్ కు ఏ మేరకు?

అదేం చిత్రమో ఎన్టీఆర్ సినిమాల్లో చాలా వరకు అతనికి తెచ్చిన పేరు కన్నా మిగిలిన వారికి పేరు తెచ్చినవే ఎక్కువ.  నటుడిగా, డ్యాన్సర్ గా అన్ని విధాలా మంచి పెర్ ఫార్మర్ ఎన్టీఆర్. అందులో…

అదేం చిత్రమో ఎన్టీఆర్ సినిమాల్లో చాలా వరకు అతనికి తెచ్చిన పేరు కన్నా మిగిలిన వారికి పేరు తెచ్చినవే ఎక్కువ.  నటుడిగా, డ్యాన్సర్ గా అన్ని విధాలా మంచి పెర్ ఫార్మర్ ఎన్టీఆర్. అందులో సందేహం లేదు. కానీ పూర్తిగా ఎన్టీఆర్ కు పేరు తెచ్చిన సినిమాలు తక్కువ. యమదొంగ రాజమౌళికి, టెంపర్ లో డైలాగులతో పూరి జగన్నాథ్ కు, నాన్నకు ప్రేమతో సుకుమార్ కు ఎన్టీఆర్ తో సమానంగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే మార్కులు తెచ్చి పెట్టాయి.

కొరటాల శివ ఇప్పటికి మూడు సినిమాలు తీసాడు. మిర్చి తొలి సినిమా. ఆ సినిమా ఇటు ప్రభాస్, అటు శివ ఇద్దరి కష్టాన్ని పెర్ ఫెక్ట్ గా చూపించింది. ప్రభాస్ ఆ సినిమాకు పక్కాగా ప్లస్ అయ్యాడు అనిపించుకున్నాడు. అలాగే శివ కూడా తన వర్క్ చూపించాడు. ఇక శ్రీమంతుడు అయితే శివ కన్నా కూడా మహేష్ మార్కులు కొట్టేసాడు. శివ ఎంత వర్క్ చేసినా, మహేష్ కాబట్టి ఆ సినిమా నడిచింది అన్న కామెంట్లు వినిపించాయి.

ఇప్పుడు మూడో సినిమా జనతా గ్యారేజ్. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్..శివ ఎవరు ఎన్ని మార్కులు కొడతారు అన్నది చూడాల్సి వుంది. తొలి రెండు సినిమాల్లో సత్యరాజ్, జగపతి బాబు కూడా బాగానే స్కోర్ చేసారు. కానీ మూడో సినిమాలో మోహన్ లాల్ వారికన్నా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ రెండు పాత్రలకన్నా పవర్ ఫుల్ రోల్ మోహన్ లాల్ కు సెట్ అయినట్లు ట్రయిలర్ చెబుతోంది.

పైగా ఆ ఇద్దరి కన్నా మోహన్ లాల్ పవర్ ఫుల్ నటుడు కూడా. మరి ఇలాంటి నటుడితో సమానంగా స్క్రీన్ పంచుకుంటూ ఎన్టీఆర్ ఎన్ని మార్కులు స్కోర్ చేస్తాడో చూడాలి. పైగా ఈ సినిమాలో మోహన్ లాల్ కు ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి వున్నట్లు వినిపిస్తోంది. అదే నిజమైతే ఎన్టీఆర్ కన్నా మోహన్ లాల్ ఎక్కువ మార్కులు కొట్టేసే చాన్స్ వుంది.

ఎమోషన్ సీన్లు పండించడంలో కొరటాల శివకు ఎంత సామర్థ్యం వుందో అలాంటి వాటిని పండించడంలో ఎన్టీఆర్ కు కూడా అంత స్టామినా వుంది. బృందావనంలో ప్రకాష్ రాజ్, శ్రీహరి లాంటి వాళ్ల మధ్య వుండి కూడా తన స్కోర్ తాను సాధించాడు.మరి ఈ సినిమాలో ఏ మేరకు చాన్స్ వుందో, స్కోర్ చేస్తాడో చూడాలి.