ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 70

తమ నాయకులు కలహించుకుని డిఎంకెకు అధికారం కట్టబెట్టారని, యిక తాము కరుణానిధి, అతని అనుచరుల ధాటికి తాము ఆగలేమని యిరు వర్గాల ఎడిఎంకె కార్యకర్తల్లో భయం పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలలో రెండు అసెంబ్లీ స్థానాలకు…

తమ నాయకులు కలహించుకుని డిఎంకెకు అధికారం కట్టబెట్టారని, యిక తాము కరుణానిధి, అతని అనుచరుల ధాటికి తాము ఆగలేమని యిరు వర్గాల ఎడిఎంకె కార్యకర్తల్లో భయం పట్టుకుంది. సార్వత్రిక ఎన్నికలలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. మార్చి 11న ఉపయెన్నికలు రాబోతున్నాయి. తాము విడిగా వుంటే ఘోర ఓటమి తప్పదు అని అనుకున్న కార్యకర్తలు విలీనం కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రామనాథ్‌ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన 2500 మంది సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుని సంయుక్త ఎడిఎంకెకు మాత్రమే డిఎంకెను ఓడించే శక్తి వుందని తీర్మానించారు. మధురై, సేలం, తిరుచ్చి జిల్లాలలో కూడా యిలాటి సమావేశాలు జరిగాయి. అప్పుడు మధ్యస్థాయి నాయకులు కలవడం మొదలుపెట్టారు. ఒక సమావేశంలో జానకి వర్గం ప్రతినిథులుగా మాజీమంత్రి ముత్తుస్వామి హాజరు కాగా, జయలలిత పక్షన కెకెఎస్‌ఎస్‌ రామచంద్రన్‌ హాజరయ్యాడు. అలాటి ఒక సమావేశానికి జయలలిత స్వయంగా వచ్చింది.  ఆమె సన్నిహితురాలైన శశికళ జానకీ రామచంద్రన్‌ను నాలుగు సార్లు కలిసింది. దీనికి ఆర్థికపరమైన కారణం ఒకటుంది. వర్గపోరాటాలను ముందే వూహించిన ఎమ్జీయార్‌ తన వీలునామాలో తన సత్యా స్టూడియో ప్రాంగణం నుంచి వచ్చిన ఆదాయం 80% మంది కార్యకర్తలున్న వర్గానికి మాత్రమే చెందుతుందని పేర్కొన్నాడు. జానకి వర్గం వద్ద డబ్బుంది కానీ జయలలిత వద్ద డబ్బు లేదు. నిధులు లేకుండా అధికారపక్షాన్ని ఎన్నికలలో ఎదుర్కోవడం కష్టమని తెలిసిన జయలలిత విలీనం కోసం గట్టిగా ప్రయత్నించింది. 

ఈ చర్చల్లో ఒక రాజీమార్గం సిద్ధమైంది. అవిభక్త ఎడిఎంకెలో ఎవరు ఏ పదవులు నిర్వహించారో వారికి ఆ పదవులు మళ్లీ దక్కుతాయి. జానకి అధ్యక్షురాలిగా, జయలలిత జనరల్‌ సెక్రటరీగా అనుకున్నారు. అయితే జానకి వర్గంలోని సీనియర్‌ నాయకులు వీరప్పన్‌, ఆలడి అరుణ, వలంపురి జాన్‌ వగైరాలు దీనికి అడ్డుకొట్టారు. జయలలిత కింద పనిచేయడం వాళ్ల తరం కాదనుకున్నారు. ఈ పేచీలతో జానకి విసిగిపోయింది. రాజకీయాలు తన ఒంటికి పడవని తేల్చుకుని జనవరి 31 న రాజకీయాల్లోంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. మర్నాడే జయలలిత ''జానకి గారు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. ఆమె అధ్యక్ష పదవి చేపట్టాలి'' అంటూ బహిరంగంగా ప్రకటన యిచ్చింది. అయినా జానకి తన ఆలోచన మార్చుకోలేదు. రెండు వర్గాల విలీనానికి బ్రేక్‌కు పడింది.  ఈ లోపుగా గతంలో స్పీకరుగా చెలరేగి పోయిన పిఎచ్‌ పాండ్యన్‌ ''ఎడిఎంకె (పాండ్యన్‌)'' అనే పేర ఒక పార్టీ పెట్టాడు. పన్‌రూటి రామచంద్రన్‌ జయలలితను వీడి మరో పార్టీ పెట్టాడు. ఆలడి అరుణ, అతనితో బాటు మరో ఐదుగురు ఎంపీలు డిఎంకెతో కలిసి పనిచేస్తామని రాష్ట్రప్రభుత్వాన్ని బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ చూసేసరికి మన పార్టీకి నూకలు చెల్లినట్లే అని 17 లక్షల ఎడిఎంకె కార్యకర్తలు భయపడ్డారు. జానకిపై ఒత్తిడి తెచ్చారు. ఆమె వీరప్పన్‌ అడ్డుపడుతున్నా లెక్కపెట్టకుండా ఎమ్జీయార్‌ స్మృతి నిలపాలంటే అతని పేరుతో పెట్టిన పార్టీ నిలవాలనుకునే ఉద్దేశంతో జయలలితకు పార్టీ అప్పగించేసింది. ఫిబ్రవరిలో విలీనం జరిగింది. రెండాకుల ఎన్నికల గుర్తు, ఆస్తులు  ఎడిఎంకెకు తిరిగి వచ్చేశాయి. జయలలిత సంయుక్త ఎడిఎంకెకు జనరల్‌ సెక్రటరీ అయింది. ఆమె అంటే పడని వీరప్పన్‌ వర్గం దూరంగా వుండిపోయారు. మార్చి ఉపయెన్నికలలో ఎడిఎంకె, డిఎంకె, కాంగ్రెసు విడివిడిగా పోటీ పడ్డాయి. ఎడిఎంకె నెగ్గింది. దాంతో ఎడిఎంకెలో ఉత్సాహం వెల్లివిరిసింది. 

దీన్ని అడ్డుకోవడానికి కరుణానిధి ఒక పథకం రచించాడు. ఎన్నికల సమయంలో జానకి వర్గం వద్ద డబ్బుంది కానీ, జయలలిత వర్గం వద్ద డబ్బు లేదు. అందువలన టిక్కెట్లు కోరిన అభ్యర్థుల నుండి నిధులు వసూలు చేశారు. టిక్కెట్లు కొందరికే యిచ్చారు. ఇవ్వని వాళ్లకు డబ్బులు తిరిగి యివ్వలేదు. కరుణానిధి వాళ్లను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేయమన్నాడు. తాము జయలలితకు, ఆమె సహాయకుడు నటరాజన్‌కు (శశికళ భర్త) కు డబ్బు యిచ్చామని, తిరిగి యిమ్మంటే చంపుతామని బెదిరిస్తున్నారని వాళ్ల నుంచి లేఖలు తీసుకుని కరుణానిధికి అత్యంత నమ్మకస్తుడిగా మారిన పోలీసు కమిషనర్‌ దురై క్రిమినల్‌ కేసులు పెట్టాడు. ఈ సతాయింపులు హద్దు మీరడంతో జయలలిత భరించలేకపోయింది. తన అనుచరులను సమావేశపరచి తను రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నానని చెప్పింది. స్పీకరును ఉద్దేశించి 'తనుకు ఆరోగ్యం బాగా లేకపోవడం చేత మార్చి 15 నుంచి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని' లేఖ రాసి చూపించింది. అయితే తక్కిన నాయకులందరూ బతిమాలడంతో ఆ ఉత్తరాన్ని స్పీకరుకు పంపలేదు. 

జయలలిత అనుయాయుల్లో వున్న తన గూఢచారుల ద్వారా ఆ లేఖ గురించి తెలుసుకున్న కరుణానిధి ఆ ఉత్తరాన్ని చేజిక్కించుకుంటే జయలలిత ప్రతిష్ఠను మంట గలపవచ్చని కరుణానిధి భావించాడు. స్థిరబుద్ధి లేకుండా, ఎప్పుడు రంగం విడిచి పారిపోతుందో తెలియని యిలాటి నాయకురాలిని నమ్ముకోవడం కంటె కష్టనష్టాల్లో సైతం చెక్కుచెదరని కరుణానిధి వంటి అనుభవజ్ఞుణ్ని నమ్ముకుంటే మంచిదని ఎడిఎంకె కార్యకర్తలు భావించాలంటే ఆ లేఖ బయటకు రావాలి. అందువలన దురైను పంపించి నటరాజన్‌ యింటిని సోదా చేయించాడు. అక్కడ లేఖ దొరికిందని కొందరంటారు. నటరాజనే ఆ లేఖను అందించాడని మరి కొందరంటారు. ఎందుకంటే జయలలితకు అతనిపై కోపం వచ్చి మార్చి 16 న తన పోయెస్‌ గార్డెన్‌ యింట్లోంచి తరిమేసింది. ఓ రెండు రోజులు చూసి అప్పటికి కూడా నటరాజన్‌ జయలలిత యింటికి వెళ్లకపోవడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ ఉత్తరం చేతికి చిక్కగానే దాని నకలును పత్రికాఫీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి కారులో వచ్చి అందచేశాడు. పత్రికలు దాన్ని ప్రచురించాయి. 

మర్నాడు ఉదయమే అది స్పీకరు తమిళకుడిమగన్‌ వద్దకు చేరింది. ఎలా చేరిందో ఎవరికీ తెలియదు, ఎవరూ చెప్పలేదు. తనకు చేరిందని అతను ప్రకటించగానే జయలలిత కంగారు పడుతూ తాను ఆ లేఖను పంపలేదని, దాన్ని పట్టించుకోవద్దని మరో లేఖ రాసింది. సరే అలాగే అని స్పీకరు ప్రకటించాడు కానీ ఎడిఎంకె కార్యకర్తల్లో జయలలిత నాయకత్వం పట్ల అనుమానాలు పొడసూపాయి. కుట్రలు పన్నుతున్న నటరాజన్‌ను పసి పట్టలేకపోయిందన్న విమర్శ వచ్చింది. వెంటనే ఎడిఎంకె నాయకులందరూ నటరాజన్‌ స్వయంగా లేఖ యివ్వలేదని, పోలీసులు పట్టుకుపోయారని వాదించసాగారు. జయలలిత మాత్రం నటరాజన్‌కు అనుకూలంగా ఏమీ మాట్లాడలేదు. ఎటూ చెప్పలేని సంకటస్థితి ఆమెది. (సశేషం) ఫోటో – నటరాజన్‌

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015) 

[email protected]

Click Here For Archives