నాన్నకు ప్రేమతో సినిమా చకచకా రెడీ అవుతోంది. ఎలాగైనా త్వరగా చుట్టమని ఎన్టీఆర్ తరచు సుకుమార్ పై వత్తిడి చేయడమే ఇందుకు కారణం. అయితే సంక్రాంతి పరిస్థితి చూస్తే, సోగ్గాడే చిన్న నాయనా, డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు ఇప్పటికే థియేటర్లపై రుమాళ్లు, తువ్వాళ్లు వేసేసాయి. అసలే బాలయ్యకు తనకు పోటీగా వస్తాడా 'బుడ్డోడు' అని కోపం. మరోపక్క ఇంత వరకు సేల్స్ దుకాణం ఓపెన్ కాలేదు. ఇంకోపక్క థియేటర్ల కొరత. అలా అని వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు. ప్రెస్టేజీ సమస్య. అలా వెళ్లాలి అంటే ఓ బలమైన కారణం కావాలి.
అదిగో అలాంటి కారణం ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాకు దొరికింది. సంగీతం దర్శకుడు దేవీ శ్రీ ఫ్రసాద్ కు పితృవియోగం సంభవించింది. నాన్నకు ప్రేమతో సినిమా దర్శకుడు సుకుమార్ కు దేవీ శ్రీ ప్రసాద్ ఎంతటి ఆప్తుడో తెలియంది కాదు. అందుకే సుకుమార్ అస్సలు దేవీ ని ఇబ్బంది పెట్టవద్దని, సినిమా రీరికార్డింగ్ గురించి కదిలించవద్దని చెప్పేసాడట. దేవీ శ్రీ చాలా సెన్సిటివ్. గతంలో మాండోలిన్ శ్రీనివాస్ మరణిస్తేనే దాదాపు నెల రోజులు మనిషి కాలేదు. అలాంటిది..అత్యంత ఆప్తుడైన తండ్రి మరణిస్తే..ఎలా వుంటాడు?
పోనీ డిక్టేటర్ మాదిరిగా రీరికార్డింగ్ వేరే వాళ్ల చేత చేయించాలి అంటే, సుకుమార్ అస్సలు ఒప్పుకోడు. ఆయనకు దేవీనే కావాలి. సో..ఇప్పుడు కావాలంటే నాన్నకు ప్రేమతో రిలీజ్ వాయిదా వేసుకోవచ్చు..ఎందుకంటే చెప్పుకోవడానికి ఓ బలమైన కారణం వుందిగా.