సెలబ్రిటీలకు మూడు రకాల ర్యాంకులను ఇచ్చింది ఫోర్బ్స్.. మనీర్యాంకు, ఫేమ్ ర్యాంకు.. ఓవరాల్ గా అసలు ర్యాంకు. ఈ మూడు క్యాటగిరీల్లో దేశీయంగా వందమంది సెలబ్రిటీలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ టాప్ పొజిషన్ లో నిలిచాడు. ఫేమ్ ర్యాంకు, మనీ ర్యాంకుల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుని కింగ్ ఖాన్ టాప్ పొజిషన్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే జాబితాలో చాలామంది తెలుగు వాళ్లకు కూడా స్థానం దక్కడం ఆసక్తికరమైన అంశం.
తెలుగు హీరోలు, దర్శకులు, ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తే… మహేశ్ బాబు, అల్లు అర్జున్, కాజల్, శ్రుతిహాసన్, రాజమౌళి, రవితేజ, ప్రభాస్, పూరీలు ఈ జాబితాలో స్థానం సంపాదించారు. వీళ్లందరికీ ఫేమ్ కు, సంపాదనకు తగ్గట్టుగా వివిధ ర్యాంకులను సంపాదించున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ… ఈ జాబితాలో చాలా మంది తెలుగు తారలకు స్థానం దక్కలేదు! అది కూడా తెలుగు ఇండస్ట్రీకి సంపాదించిన టాప్ హీరోలకే ఇందులో స్థానం దక్కలేదు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన పేర్లు మెగా ఫ్యామిలీకి చెందినవి.
హీరో రామ్ చరణ్ కు, పవన్ కల్యాణ్ ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. మరి ఇది ఫోర్బ్స్ పొరపాటో లేక సాంకేతికంగా వారు ఆ జాబితాలో చేరలేదో అర్థం కావడం లేదు. రామ్ చరణ్ నే తీసుకొంటే..కేవలం సినిమాతారగానే కాకుండా వ్యాపార వేత్తగా కూడా ఆయన సత్తా చాటుతున్నాడు. హార్స్ పోలో టీము, విమానయాన సంస్థలో వాటాలతో చెర్రీ వార్తల్లోకి వచ్చాడు. అయినా కూడా ఆయన ఫోర్బ్స్ జాబితాలో కనిపించలేదు. ఇక వరస ప్లాఫుల్లో ఉన్న రవితేజ వంటి హీరో కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించాడు. పూరీ జగన్ కు కూడా ఈ జాబితాలో ఏదో ఒక స్థానం దక్కింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఈ జాబితాలో కనిపించలేదు!
ఇలా ఎందుకు జరిగిందో మెగా ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. సెలబ్రిటీల ర్యాంకింగ్ విధానంలో ఫోర్బ్స్ అనుసరించిన విధానాల్లో తేడాలున్నాయో, లేక నిజంగానే పవన్ కల్యాణ్ వంటి వాళ్లు ర్యాంకింగుల్లో నిలిచేంత డబ్బు సంపాదించలేదో..!