ఎమ్బీయస్‌ : యాకూబ్‌ మెమన్‌ ఉరి- 2

చాలా సందర్భాల్లో దీర్ఘ న్యాయప్రక్రియ విసుగు కలిగిస్తుంది. న్యాయవివాదంలో యిరుక్కున్న వారిని ఎవరైనా అడిగితే చెపుతారు. కంటికి కనబడేదాన్ని కూడా కోర్టు పరీక్షకు గురి చేస్తుంది. సాక్ష్యాలు కోరుతుంది. అవతలివాడు అన్యాయం చేస్తున్నాడని స్పష్టంగా…

చాలా సందర్భాల్లో దీర్ఘ న్యాయప్రక్రియ విసుగు కలిగిస్తుంది. న్యాయవివాదంలో యిరుక్కున్న వారిని ఎవరైనా అడిగితే చెపుతారు. కంటికి కనబడేదాన్ని కూడా కోర్టు పరీక్షకు గురి చేస్తుంది. సాక్ష్యాలు కోరుతుంది. అవతలివాడు అన్యాయం చేస్తున్నాడని స్పష్టంగా గోచరిస్తున్నా కూడా వాడికి ఎన్నో అవకాశాలు యిస్తారు. అప్పటిదాకా గుండ్రాయిలా వున్నవాడు పోలీసులు  వచ్చి అరెస్టు చేయగానే అనారోగ్యం, జైలుకి తీసుకెళ్లడానికి వీల్లేదు అంటూ ఆసుపత్రిలో చేరతాడు. ప్రాబ్లెం ఏమిటంటే బిపి, సుగరు అంటాడు. అదేదో సినిమాలో చెప్పినట్లు ప్రతి మనిషికి శంఖుచక్రాల్లా అవి ఎలాగూ వుంటాయి, ఆ భాగ్యానికి యింత హంగామా ఎందుకు అని కోర్టు అనదు. ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించి,  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్టు వచ్చాకనే కస్టడీకి తరలించండి అంటుంది. అవతలి లాయరు తన క్లయింటుకు ఉపవాసమని, అతని భార్యకు భుక్తాయాసమని, తల్లికి ఆయాసమని.. యిలా ఏదో కారణం చెపుతూ వాయిదాలు అడుగుతూనే వుంటాడు. కోర్టు యిస్తూనే వుంటుంది. ఇన్ని అవకాశాలు యిచ్చియిచ్చి చివరకు తీర్పు వస్తే మళ్లీ దాన్ని ఛాలెంజ్‌ చేస్తూ పైకోర్టుకి వెళ్లే అవకాశం కూడా యిస్తారు. ఫైనల్‌గా తీర్పు మీ పక్షాన వచ్చినా డిక్రీ ఓ పట్టాన రాదు, వచ్చినా అమలు కావడానికి ఎంతో టైము పడుతుంది. న్యాయవ్యవస్థ లోపరహితమని అనలేము. కానీ మన దేశంలో ఉరి శిక్ష వేయడానికి ఎంతో సంకోచిస్తారు. రెండు దశాబ్దాలపాటు అనేక తర్జనభర్జనలు జరిగాక, చివరకు శిక్ష వేస్తే మళ్లీ దాన్ని తిరగతోడాలనడం అర్థం లేనిది.

యాకూబ్‌ మెమన్‌ శిక్ష గురించి నా ఉద్దేశాలు వ్యక్తం చేయడానికి ముందు ఉరికి అభ్యంతరం చెపుతూ యితరులు చేసిన వాదనల్లో కొన్నిటిపై నా అభిప్రాయం చెప్తాను. మజ్లిస్‌ నేత చెప్పినదానిలో కొన్ని వాస్తవాలున్నాయి. రాజకీయంగా పలుకుబడి వున్నవాళ్లు ఉరి తప్పించుకుంటున్నారు. కుట్ర పన్ని రాజీవ్‌ను చంపిన హంతకులను ఉరి తీయకుండా జైల్లో వుంచడమే పొరబాటనుకుంటే వాళ్లని వదిలేయాలని తమిళ నాయకులు అనడం యింకా దుర్మార్గం. ఇందిర హంతకుల శిక్ష విషయంలో అకాలీ దళ్‌ ప్రమేయమూ తప్పే. 1984 శిఖ్కు అల్లర్లకు కారకులైన వాళ్లకూ శిక్షలు పడాల్సిందే. బాబ్రీ మసీదు కూల్చినవాళ్ల కేసు ఎప్పటికీ తేల్చకుండా, నిందితులు మంత్రులుగా విరాజిల్లుతూ వుంటే పోలీసు రికార్డుల్లో 'కనబడటం లేదు' అని చూపిస్తూ నాటకం ఆడడమూ అన్యాయమే. హిందు ఉగ్రవాదులుగా ముద్ర కొట్టి మాలెగావ్‌ పేలుళ్లలో నిందితులు అంటూ జైల్లో కూర్చోబెట్టిన వారిపై విచారణ త్వరగా ముగించి వారు అమాయకులో, మాయకులో తేల్చి విడిచిపెట్టడమో, ఉరి తీయడమో చేయాలి తప్ప రాజకీయాలకు వాడుకోకూడదు. ఇతర కేసుల్లో కూడా ఉరి వేయవలసిన వాళ్లను త్వరగా వేసేస్తే అలాటి నేరాలకు పాల్పడేవారికి హెచ్చరికగా వుంటుంది. 

ఉరిశిక్ష పడ్డాక కూడా బీదవాడని, దళితుడని, మైనారిటీ అనే విచక్షణ అనవసరం. అతను కరడుగట్టిన నేరస్తుడని రుజువైంది. అంతవరకే చూడాలి. పేదవాళ్లయితే హత్య చేసినా శిక్ష పడకూడదు, యిమ్యూనిటీ కల్పించాలి అంటే పేదవాళ్లందరినీ హంతకులుగా మారమని ప్రేరేపించినట్లే.  ధనికులు, అగ్రవర్ణస్తులు, రాజకీయంగా పలుకుబడి కలవారు కాబట్టి 8 మంది దళితులను వేటాడి చంపిన చుండూరు ముద్దాయిలకు ఉరిశిక్ష  పడకుండా యావజ్జీవం పడింది, అది కూడా ఏడేళ్ల తర్వాత హుష్‌కాకీ అని ఎగిరిపోయి అందరూ విడుదలై పోయారు అంటే అది ఒక విషాదమే. వాళ్లకు శిక్ష పడేవరకూ ఉగ్రవాదులకు కూడా ఉరి వేయకూడదు అనే వాదన అర్థరహితం. ఒక్కోప్పుడు కొడుకునో, కూతుర్నో పోగొట్టుకున్న అతి సామాన్యులు కూడా న్యాయదేవత తలుపు తట్టితట్టి చివరకు నిందితులకు శిక్ష పడేట్లా చేసిన ఉదంతాలు చదువుతూ వుంటాం. చుండూరు బాధితుల పక్షాన నిలబడినవారు చుండూరు ముద్దాయిల కేసు విషయంలో అప్రమత్తంగా వుంటూ న్యాయపోరాటాన్ని కొనసాగించాలి, ఆ క్రమంలో వేరే కేసుల్లో ఉరి పడిన వారినందరినీ వదిలేయాలని వాదించకూడదు. మెమన్‌కు రాజకీయ మద్దతు లేదని ఒవైసీ వాపోయారు. రాజకీయ మద్దతు మాట ఎలా వున్నా ధనమైతే పుష్కలంగా వుంది. దాని పవర్‌ తక్కువేమీ కాదు. ఐయస్‌ఐ, దావూద్‌లకు ఇండియాలో వున్న కనక్షన్లు దృఢమైనవే. కొందరు సాక్షులు తమ వాఙ్మూలాలు మార్చుకునేట్లా చేశారు కూడా. అయినా మెమన్‌కు శిక్ష పడిందంటే దాని అర్థం – అతనికి వ్యతిరేకంగా కేసు అంత బలంగా వుందని!

1993 మార్చిలో వరుస పేలుళ్లు జరిగాయి. 257 మంది పోయారు. 713 మంది గాయపడ్డారు. నవంబరులో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. టాడా కోర్టులో కేసు విచారణ 1995లో ప్రారంభమైంది. సాక్షులు 684 మంది వున్నారు కాబట్టి వారి విచారణకు ఐదేళ్లకు పైగా పట్టింది. ఆ తర్వాత వాదోపవాదాలు మరో మూడేళ్లు. ఆ తర్వాత మూడేళ్లకు తీర్పు. అంటే 2006 సెప్టెంబరుకి తీర్పు వచ్చింది. 23 మందిని నిర్దోషులుగా వదిలేసి 100 మంది నేరం చేశారంది. 2007 జులైలో యాకూబ్‌తో సహా 12 మందికి ఉరిశిక్షలు, 20 మందికి యావజ్జీవ శిక్ష. టాడా కోర్టు వేసిన శిక్షలపై సుప్రీం కోర్టులో అప్పీలుకి వెళ్లారు. 2013 మార్చికి సుప్రీం కోర్టు యాకూబ్‌కు ఉరిని ఖరారు చేసింది. పదిమంది విషయంలో యావజ్జీవశిక్షగా మార్చారు. (యాకూబ్‌ ముస్లిం కాబట్టి ఉరి వేస్తున్నారని అనేవాళ్లు ఉరి వేయని యీ పదిమంది ఏ మతస్తులో కనుక్కుంటే మంచిది) ఇక అక్కణ్నుంచి క్షమాభిక్షల ప్రయత్నాలు. చివరి గంట వరకు కూడా సస్పెన్స్‌ గురించి వేరే రాయనక్కరలేదు.

మనం అనేక తీర్పుల విషయాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూంటాం. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వుంటాం. పోలీసులు సాక్ష్యాలు తారుమారు చేశారేమో, లేనివి పుట్టించారేమో అనుకుంటూ వుంటాం. అనేక స్టేజీల్లో చెక్స్‌, బాలన్స్‌లు దాటుకుని ఫైనల్‌గా తీర్పు వచ్చిందంటే కోర్టుకి 'బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌' యిచ్చి వాళ్లు కరక్టేమో అనుకుని వూరుకోవడం మంచిది. ఎందుకంటే పదిమంది విషయంలో ఉదారంగా వున్న సుప్రీం కోర్టు యితని విషయంలోనే కఠినంగా ఎందుకు వుంది? ఆ పదిమందీ కూడా తమను టైగర్‌ మెమన్‌ రిక్రూట్‌ చేసుకున్నాక, యాకూబ్‌కు అప్పగించాడనే చెప్పారు. మొత్తం 19 మందిని రిక్రూట్‌ చేసుకుని వాళ్లందరినీ దుబాయి, పాకిస్తాన్‌లకు పంపి మారణాయుధాల్లో ట్రైనింగ్‌ యిప్పించడం, అక్కడి బస, తిండి, ప్రయాణం ఏర్పాట్లు చూడడం, బాంబులు పేల్చి సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపడానికై బొంబాయిలో స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, సినిమా హాలు, బజారు వంటి జనసమ్మర్దం వున్న ప్రాంతాలను నిర్ధారించడం, పేలుడు పదార్థాలు నింపిన బ్యాగులను అవసరమైన చోటికి చేర్చడం, ఈ ఆపరేషన్‌కై హవాలా ద్వారా చేరిన నిధులు ఖర్చు చేయడం – యివన్నీ యాకూబ్‌ చూసుకున్నాడని వాళ్లు చెప్పారు. అంటే తక్కినవాళ్లు పాత్రధారులు కాగా, టైగర్‌, యాకూబ్‌ సుత్రధారులని కోర్టుకి నమ్మకం చిక్కింది. 1993లో జనవరిలో దుబాయిలో జరిగిన ధ్వంసరచన సమావేశంలో అతను పాలుపంచుకున్నాడని కోర్టు నమ్మింది.  (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives