రివ్యూల పద్మవ్యూహం

రూపాయి కోడిపిల్లకు పది రూపాయిలు దిష్టి తీస్తే తప్పు అవుతుంది. అదే రూపాయి కోడిపిల్లకు పది రూపాయిల ముస్తాబు చేసి, పాతిక రూపాయిలకు అమ్మితే వ్యాపారం అవుతుంది. తెలుగుసినిమా తీరు అచ్చంగా ఇలాంటిదే. ఇప్పుడు…

రూపాయి కోడిపిల్లకు పది రూపాయిలు దిష్టి తీస్తే తప్పు అవుతుంది. అదే రూపాయి కోడిపిల్లకు పది రూపాయిల ముస్తాబు చేసి, పాతిక రూపాయిలకు అమ్మితే వ్యాపారం అవుతుంది. తెలుగుసినిమా తీరు అచ్చంగా ఇలాంటిదే. ఇప్పుడు సినిమాలు చాలా వరకు రూపాయి కోడిపిల్లల్లా బలహీనంగానే వుంటున్నాయి. కానీ వాటికి పబ్లిసిటీ, హైప్‌, టాక్‌ కోసం మాత్రం పది రూపాయిలు ఖర్చుచేయాలని అనుకుంటున్నారు.. చేస్తున్నారు. కానీ ట్విస్టేమిటంటే, అలా ముస్తాబైన కోడిపిల్ల లాంటి సినిమా, పాతిక రూపాయిలకు కాదు కదా, ఖర్చయిన పదకొండు రూపాయిలకు కూడా అమ్ముడు కావడంలేదు. పైగా జనం మొదటి రోజే దానికి సోకు ఎక్కువ సత్తా తక్కువ అని డిసైడ్‌ చేసి, కొనడం మానేస్తున్నారు.. ఇదో సంగతి

************************

ఇక రెండో సంగతి.. సంతల వైనాలు తెలిసిన వారికి గేదెల వ్యాపారం ముచ్చట కూడా తెలిసే వుంటుంది. గేదెను నీళ్లలోనే వుంచి, కొమ్ములుచూపించి, ఈ లావు సైజుంటుంది.. బాడీ బాగానే వుంటుంది.. తొక బారెడు వుంటుంది.. మూతి మూరెడు వుండి చూడబుల్‌ గానే వుంటుంది. ఇక పొదుగు చూస్తే, బాన పొట్టలా కనిపిస్తుంది.. అంటూ కొనేవాళ్లను కవ్విస్తాడు.. మెప్పిస్తాడు. కానీ అసలు విషయం.. మాత్రం స్పష్టంగా చెప్పడు.. అదే ఎన్ని పాలిస్తుంది? అన్నది. గేదెను ముక్క ముక్కగా వర్ణిస్తాడు తప్ప, టోటల్‌గా పనికి వస్తుందా.. పాలిస్తుందా అన్నది మాత్రం కరెక్ట్‌గా చెప్పడు.. ఇలాగే వుంటాయి… చాలా వరకు మన టాలీవుడ్‌ సమీక్షలు. ఏక్షన్‌ బాగా చేసాడు.. ఫొటోగ్రఫీ బాగుంది.. సంగీతం ఓకే.. ఫస్టాఫ్‌ ఫరవాలేదు., సెకండాఫ్‌ కాస్త ట్రిమ్‌ చేసుకుని వుంటే బాగుండేది.. అంటారే కానీ, అసలు సినిమా చూడబుల్‌గా వుందా లేదా? అన్నది మాత్రం క్లారిటీగా చెప్పరు. ఇంకొందరు మరి కాస్త ముందుకు వెళ్లి ఒకసారి చూడొచ్చు అంటారు. ఈ రోజుల్లో ఓ సినిమా ఒక్క సారి చూడ్డమే ఘనం.. గగనం. అలాంటిది రెండో సారి చూడ్డం కూడానా?  

*********************

మరి పైన పేర్కొన్న రెండు వైనాలకు వున్న సింకేమిటి అన్నది ఇప్పుడు పాయింట్‌. ఇక్కడ పావలా స్టామినా నుంచి పాతికరూపాయిల రేంజ్‌కు వెళ్లాలనుకున్న సినిమాను,  ఆ రేంజ్‌కు వెళ్లడానికి ఈ సమీక్ష సాయం చేస్తుంది.. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌లో సమీక్షలకు అమాంతం డిమాండ్‌ పెరిగిపోయింది. కొన్ని ఏళ్ల కిందట చూసుకుంటే, అంటే కనీసం ఓ పది నుంచి ఇరవై ఏళ్ల కిందటి వరకు సమీక్షకు అంతగా ప్రాధాన్యత వుండేది కాదు. కేవలం సినిమా పత్రికలు ఒకటి, మహా అయితే రెండు మాత్రమే సమీక్షలు ప్రచురించేవి. బాగా వెనక్కు వెళ్తే, కొన్ని వారపత్రికలు కూడా సమీక్షలు ప్రచురించేవి. ముళ్లపూడి వెంకటరమణ లాంటి పెద్దలు సమీక్షలు రాసేవారు. వాటి తీరు తెన్నులు వేరుగా వుండేవి. గుడిపూరి శ్రీహరి, దేవరాజు రవి లాంటి వాళ్లు రాసినా కూడా సమీక్షలు… ఇలా పీస్‌ మీల్‌ పద్దతిన, ఖైమా కొట్టి, ఏముక్కకు ఆ ముక్కు చూసినట్లు, వుండేవి కాదు. సినిమా మొత్తాన్ని ఆకళింపు చేసుకుని, సినిమా విజయాపజయాలతో, పెద్ద, చిన్న అన్నది కాకుండా, తమ తమ అవగాహన, సిద్దాంతాల మేరకు సమీక్షించేవారు. వాటికి మంచి ఆదరణ కూడా వుండేది. 

కాలం మారింది

ఇప్పుడు సినిమాకు వున్న ఆదరణ మరి దేనికీ వుండడం లేదు. అందుకే డైలీ పత్రికలు కూడా సినిమాకు వీలయినంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆ డైలీ పత్రికల వెబ్‌ సైట్లు కూడా వీలయినంత వరకు సినిమా వార్తలతో నిండుతున్నాయి. దీనికి కారణం, సినిమా వార్తలే ఎక్కువ ఆలంబనగా చేసుకుని వెబ్‌ మ్యాగ్‌ జైన్లు ప్రారంభమై, జనాదరణ పొందడమే. ఎప్పుడైతే వెబ్‌ మ్యాగ్‌ జైన్లకు ఆదరణ పెరిగిందో, వాటిల్లో వచ్చే సమీక్షలకు కూడా ఆదరణ పెరిగింది. అదే సమయంలో ఓవర్‌ సీస్‌ మార్కెట్‌ పెరగడం అన్నది కూడా ఈ సమీక్షలకు ఊతం ఇచ్చింది. అదిగో సరిగ్గా అప్పుడు ప్రారంభమైంది.. అసలు వ్యవహారం.

హైప్‌ ప్లస్‌ రివ్యూస్‌ ఈజీక్వల్టూ ఓపెనింగ్స్‌

ఇప్పుడు ఇదీ టాలీవుడ్‌ నమ్ముకున్న విజయసూత్రం. సినిమాకు వీలయినంత హైప్‌ తీసుకురావాలి. సమీక్షలు కాస్తయినా పాజిటివ్‌గా రావాలి.. రేటింగ్‌ ఎలాగైనా మూడు స్టార్లు దాటాలి.. దాంతో ఓపెనింగ్స్‌ వచ్చేస్తాయి. ఎలాగూ బోలెడు థియేటర్లలో విడుదల చేస్తారు కాబట్టి, కలెక్షన్లు సరిపోయి, సినిమా గట్టెక్కేస్తుంది. ఇదీ స్ట్రాటజీ. అయితే ఈ స్ట్రాటజీ వరకు బాగానే వుంది. కానీ వ్యవహారం అక్కడి నుంచే అడ్డదారి తొక్కడం ప్రారంభమైంది. విత్తు బాగుంటే చెట్టుబాగుంటుందన్న వైనం మరిచిపోయి, బాగాలేని చెట్టుకు మేకప్‌ చేయడం కోసం విత్తం ఖర్చు చేయడం ప్రారంభించారు. ప్రకటనలు, ఇతరత్రా వ్యవహారాల ద్వారా సమీక్షలను మేనేజ్‌ చేసే ప్రక్రియకు తెరతీసారు. దీంతో ఏదినిజం.. ఏది అవాస్తవం అని, సమీక్షలనే తప్పు పట్టే స్థాయికి దిగజారిపోయింది వ్యవహారం. 

ఆ మధ్య ఓ దినపత్రిక ఎప్పుడూ లేనిది సమీక్షలు ప్రచురించడం ప్రారంభించింది. దీని వెనుక పరమార్థంమరేమీ లేదు. కొందరు నిర్మాతలు సిండికేట్‌గా మారి, కొంత మీడియాకే ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించడం. దీంతో ఆ నిర్మాతల కొమ్ములు ఎలా వంచాలా అని ఆలోచించి, సమీక్షల దారి పట్టింది ఆ దినపత్రిక. సినిమా విడుదలకు ముందే, సమీక్ష ఇలా రాస్తాం.. హెడ్డింగ్‌ ఇలా పెడతాం.. చూసుకోండి అనే రేంజ్‌కు వెళ్లింది. ప్రకటనలిస్తే కేరింత… లేకుంటే ఆవులింత.. అనేంత వరకు వెళ్లింది వ్యవహారం. ఓ సినిమా యూనిట్‌ అయితే పబ్లిక్‌ గానే ఆ పత్రిక సమీక్షల తీరును దుయ్యబట్టింది. అయినా ఆ పత్రిక అదే రేంజ్‌లో వరుసగా కొన్ని సినిమాలను ఉతికి ఆరేసింది. దీంతో మరి కొంతమంది కాళ్ల బేరానికి వచ్చి ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. అలా ప్రకటనలు ఇచ్చిన సినిమాలు బాగుంటే ఓకే. లేదూ అంటే, సమీక్షలు రాయడం మానేసారు. ఇటీవల ఓ సినిమా వచ్చింది. పాపం, ప్రకటనలు ఇవ్వలేదూ… సినిమా డిజాస్టర్‌.. ఇంకేముంది సమీక్ష చెలరేగిపోయింది. 

ఇటీవల ఓ మీడియా సంస్థ, అతి త్వరలో విడుదల కాబోయే సినిమాకు తమ మాధ్యమంలో అంతా పాజిటివ్‌గా మేనేజ్‌ చేస్తామని, అందుకు ప్రకటనల రూపంలో రెండు లక్షల వరకు ఖర్చవుతుందని ఎస్టిమేషన్‌ ఇచ్చిందట. దాంతో కళ్లు తిరిగిన ఓవర్‌ సీస్‌ బయ్యర్స్‌.. సెలంట్‌ అయిపోయారట. ఓ జాతీయ దినపత్రిక అయితే, సినిమా ప్రారంభంలోనే కాంట్రాక్టు కుదిర్చేసుకుంటోంది. సినిమా నిర్మాణం, పూర్తి, విడుదల.. ఈ కాలంలో ఇన్ని ఇంటర్వూలు, ఇన్ని వార్తలు, ఇన్ని స్టార్లు. ఇంత మొత్తం అని అఫిషియల్‌ గానే డీల్‌ సెటిల్‌ చేసుకుంటోందట. ఇందుకోసం ఓ సెపరేట్‌ సంస్థనే ఫ్లోట్‌ చేసేసారు. 

కొత్త ట్రేడ్‌ పుట్టుకొచ్చింది

సమీక్షలు చదవి సినిమాపై నిర్ణయం తీసుకునేవారు, సమీక్షలు రాసేవారు, సమీక్షలు వేసేవారు, వాటికి బెదిరే నిర్మాతలు పెరిగారు. దీంతో టాలీవుడ్‌ లో కొత్త ట్రేడ్‌ పుట్టుకువచ్చింది. 24 క్రాఫ్ట్స్‌ అన్నది మారింది. టెక్నాలజీ ప్రకారంల కొత్త క్రాప్ట్స్‌ జోడైనట్లే.. సమీక్షలు మేనేజ్‌ చేసే కొత్త సెక్షన్‌ ఒకటి తయారయింది. నిజంగా మేనేజ్‌ చేస్తారా? చేయడం సాధ్యమా అన్నది పక్కన పెట్టండి.. ముందు ఇలా చేస్తాం అంటూ నిర్మాతల వెంటబడే వారు కొంతమంది పుట్టుకు వచ్చారని టాలీవుడ్‌లో లెటెస్ట్‌ గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సినిమాకు ఓ పీఆర్వో అంటూ వుంటారు. వాళ్ల సినిమా ప్రచారం వ్యవహారాలు చూస్తు వుంటారు. వీరితో సంబంధం లేకుండా, నేరుగా నిర్మాతను కలిసి, మీ సినిమాకు పాజిటివ్‌ సమీక్షలు వచ్చేలా చేస్తాం.. ఇన్ని స్టార్‌లు వచ్చేలా చూస్తాం.. ఇంత ఖర్చవుతుంది.. అంటూ బేరం పెట్టే జనాలు కొందరు పుట్టుకువచ్చారు. 

వెబ్‌ మ్యాగ్‌ జైన్లు, సమీక్షల ప్రచురించే మాధ్యమాలు, సినిమాపై అభద్రతాభావం, ఓపెనింగ్‌ కలెక్షన్లే కీలకం కావడం, ఓవర్‌ సీస్‌ మార్కెట్‌ పెరగడం వంటి కారణాలతో నిర్మాతలు ఈ 'సమీక్షల బేరగాళ్ల'కు లొంగుతున్నారు. వాళ్లు కూడా వీలయినంత వరకు తమ పరిచయాలతో కావచ్చు, మొహమాటాలతో కావచ్చు, ఓ పాయింట్‌ టూ ఫైవ్‌ వరకు మేనేజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకు మించి వీళ్లు చేసేదీ లేదు.. సాధించేదీ లేదు. 

ఈ విషయంలో ఏదైనా సరే, తమ ఘనతే అన్నట్లు సాగుతోంది వీళ్ల వ్యవహారం. అదృష్టం బాగుండి, సినిమా కాస్తా సమీక్షకులకు నచ్చి, మంచి రేటింగ్‌ పడితే, చూసారా? ఎలా మేనేజ్‌ చేసామో అంటున్నారు. లేదూ, నిర్మాత బేరానికి లొంగలేదు.. అనుకుందాం.. ఖర్మగాలి సినిమా బాగాలేక.. రేటింగ్‌ తక్కువ పడిందనుకోండి.. అప్పుడూ వీళ్ల ప్రతిభే.. మేం చెప్పాం.. చూసారా.. మీరు వినలేదు.. రేటింగ్‌లు తగ్గిపోయాయి.. అంటారట. నిజానికి నూటికి తొంభై శాతం వరకు వీరికి ఏ వెబ్‌ సైట్‌తోనూ వీళ్లకు కాంట్రాక్టులు వుండవు.. చేసేది వుండదు.. ఆ పేరు చెప్పి, వీళ్లు పండగ చేసుకోవడం, తమ మాటల చాకచక్యంతో వెబ్‌ రేటింగ్‌లను తమకు అనుకూలంగా మార్చుకోవడం తప్ప. 

ఇలాంటి బ్యాచ్‌ ఇంకోపని కూడా చేస్తోంది.. తాము అనుకున్నదానికి అనుకూలంగా మీడియాను తెలివిగా మలుపుతిప్పడం. సినిమా ప్రివ్యూల దగ్గర విశ్రాంతి సమయంలోనే వీళ్ల కార్యక్రమం మొదలవుతుంది. చాలా తెలివిగా ఎదుటివారిలో తమ అభిప్రాయాలను చొప్పించడం అక్కడే ప్రారంభమవుతుంది. ఇఖ ట్విట్టర్లు, ఫేస్‌ బుక్‌లు, వాట్సప్‌ల సంగతి చెప్పనక్కరే లేదు. ఇది డిజాస్టర్‌… నా రేటింగ్‌ పాయింట్‌ ఫైవ్‌.. ఇది సూపర్‌.. త్రీ పాయింట్‌ ఫైవ్‌ అంటూ చెలరేగిపోతారు. 

కులాలు.. ప్రాంతాలు

రాజకీయ మీడియాను కులాలు, ప్రాంతాలు ప్రభావితం చేస్తున్నట్లు, సినిమాలతో కూడా ఆడుకుంటున్నాయి. సినిమా రంగం ఇప్పటికే కులాల వారీగా రెండుగా చీలిపోయింది. దీంతో ఆ ప్రభావం సినిమా విజయంపైన కూడా పడుతోంది. ఆ మధ్య విడుదలైన రెండు సినిమాలు విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కారణం, ఆ రెండు సినిమాలు రెండు కులాలకు ప్రాతిపదిక భావించడమే. ఈ తరహా వైఖరి ఒక్కోసారి సమీక్షలపై కూడా ప్రభావం కనబరుస్తోంది. ఒకవర్గం సినిమా హిట్‌ అయితే ఆ విజయం తమ సమీక్ష పుణ్యమే అని సదా రెచ్చిపోయే జనాలు కూడా వున్నారు. ఇటీవల ఓ సినిమా ఓవర్‌ సీస్‌లో పెద్ద హిట్‌ అయితే, అదంతా తన పుణ్యమే అన్న రేంజ్‌లో హడావుడి చేసాడో పెద్దాయిన.

పాపం నిర్మాతలు.. హీరోలు

అయితే ప్రకటనలు ఇవ్వకుంటే, సమీక్షల్లో తేడారావడం అన్నది కొంత పార్ట్‌ ఆఫ్‌ మీడియాలో ఎప్పుడైతే ప్రారంభమైందో, నిర్మాతలు ఇలాంటి వాళ్ల బారిన పడుతున్నారు. కొందరు నిర్మాతలు వీరి బారిన పడితే, కొన్ని సార్లు హీరోలు కూడా పడుతున్నారు. తమ సినిమాకు మంచి రేటింగ్‌ వస్తే మంచిదేగా అని లక్షలు వదుల్చుకుంటున్నారు. కొన్ని సార్లు నిజంగానే మేనేజ్‌ మెంట్‌ జరుగుతోంది. ఆ మధ్య మూడునాలుగు డిజాస్టర్‌ సినిమాలకు కూడా మూడు దాటిన రేటింగ్‌లు వచ్చేసాయి. హీరో హ్యాపీ.. కానీ కలెక్షన్లు మాత్రం లేవు. సినిమా డిజాస్టర్‌.. నిర్మాతలు అన్‌ హ్యాపీ. అంటే జనం అంత వెర్రివాళ్లు కాదనేగా.. ఈ రేటింగ్‌లు చూసి సినిమాలకు పొలోమని వెళ్లిపోవడానికి. పాపం ఒక హీరో కమ్‌ నిర్మాత అయితే ఈ రేటింగ్‌ల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేసాడని వినికిడి. కానీ స్టార్‌లు అయితే వచ్చాయి కానీ, కలెక్షన్లు రాలేదట. మరో హీరో అయితే స్టార్‌లు సాధించగలిగాడు కానీ నిర్మాతను గట్టెక్కించలేకపోయాడు. అలాగే ఆ మధ్య ఫరవాలేదు మంచి సినిమా అనిపించేసుకున్న చిత్రానికి కూడా స్టార్‌లు అనుకోకుండా వస్తే, అది ఈ కొత్త బేరగాళ్ల ఖాతాలో వేసేసుకున్నారట. ఆ సినిమాకు మేమే స్టార్‌లు వేయించాం అని క్రెడిట్‌ కొట్టే ప్రయత్నం చేసారట. ఒక్కోసారి ఈ స్టార్‌లను చూపించి కూడా శాటిలైట్‌ బిజినెస్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. సరే అందుకయినా పనిచేస్తుందని ఈ స్టార్‌ మేనేజ్‌ మెంట్‌ వలలో పడుతున్నారు నిర్మాతలు.  

క్వాలిటీ.. ప్రచారం.. పక్కకు

ఎప్పుడైతే రివ్యూలను మేనేజ్‌ చేయచ్చు అన్న టాక్‌ బయల్దేరిందో, సినిమాకు క్వాలిటీ ప్రచారం తగ్గిపోయింది. ఇలాంటి అడ్డదారులను నమ్ముకొవడం ఎక్కువయింది. సినిమా అంటే కోట్ల రూపాయిల వ్యాపారం. విడుదలకు ముందు ఎంత ప్రొడక్ట్‌ మీద నమ్మకం వున్నా, కాస్త టెన్షన్‌ వుంటుంది. ఎలా వుంటుందో, జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని, నిర్మాతకు కంటి మీద కునుకు వుండదు. అదిగో, సరిగ్గా ఆ టెన్షన్‌ నే క్యాష్‌ చేసుకుంటున్నారు ఈ తరహా జనాలు. 

నిజానికి సమీక్షలు ఎలా వున్నా ప్రేక్షకుల వైఖరి స్పష్టంగా వుంటుంది. బాహుబలి సినిమాకు తెలుగు మీడియా అంత పాజిటివ్‌గా స్పందించలేదు. నార్త్‌ మీడియా మాత్రం వెనకేసుకువచ్చింది. అయితే అక్కడ కూడా వేరే రీజన్‌ వుందని వినికిడి. బాలీవుడ్‌లో ఇందుకోసం లక్షలు వెచ్చించారని గుసగుసలు వున్నాయి. ఏమైతేనేం, తెలుగుమీడియా అంతగా ప్రశంసించకపోయినా, జనం మాత్రం నెత్తిన పెట్టేసుకున్నారు. శ్రీమంతుడు సినిమాను మీడియా, జనం రెండూ సమంగానే ఓకె చేసాయి. రౌడీ, అనుక్షణం, డైనమైట్‌ లాంటి సినిమాలు వున్నాయి. సమీక్షలు బాగానే వచ్చాయి.. స్టార్‌లు బాగానే పడ్డాయి. కానీ జనం ఓకే చేయలేదు. సినిమా చూపిస్త మావా లాంటి చిన్న సినిమా వుంది. ఎవరూపెద్దగా పట్టించుకోలేదు. కానీ జనం డబ్బులు బాగానే కురిపించారు.

ఇదంతా చెప్పేది ఒక్కటే.. మౌత్‌ టాక్‌ను మించింది లేదు. సమీక్షలు మహా అయితే వన్‌ టు టూ పర్సంట్‌ ఆడియన్స్‌ను మాత్రమే ప్రభావితం చేస్తాయి. నిజమైన విజయాన్ని అందించేది సినిమాలో వున్న క్వాలిటీమాత్రమే. కానీ సినిమా జనాలు ఈ విషయం విస్మరించి, ఎలాగోలా సినిమా చుట్టేసి, ఆపై ఇలా సమీక్షలు మ్యానేజ్‌ చేస్తాం అనేవాళ్ల వలలో పడుతున్నారు. సమీక్షలనైతే మ్యానేజ్‌ చేయగలరు కానీ, ప్రేక్షకులను కాదు కదా? ఆ సంగతి తలుచుకుంటే… సమీక్షలు మేనేజ్‌ చేస్తాం.. సమీక్షలు అంటూ నిర్మాతల వెంట బడే ఈ కొత్త తరహా బేరగాళ్ల ఆటలు కట్టేస్తాయి.

మాస్‌ జనాల మాటే కీలకం: ఏలూరు శ్రీను.. పీఆర్వో

తెలుగు సినిమా ప్రేక్షకుల్లో 85శాతం మంది పక్కా మాస్‌… బి సి సెంటర్ల ప్రేక్షకులు. వీరికి సమీక్షలు.. రేటింగ్‌లు పట్టమన్నా పట్టవు. కేవలం సమీక్షలు రేటింగ్‌లు ఓవర్‌ సీస్‌, హైదరాబాద్‌ వరకే. ఇప్పటికీ సినిమాకు పోస్టర్‌ పబ్లిసిటీ కీలకం. ఆ మధ్య ఓ చిన్న సినిమా వచ్చింది. ఎవరికీ పేరు కూడా తెలియదు.. ప్రకటనలు ఇవ్వలేదు.. కేవలం పోస్టర్లు కుమ్మారు అంతే బీసీల్లో. వాటి డీసీఆర్‌లు చూస్తే ఆశ్చర్యం వేసింది.. అంటే జనం ఇంకా టీవీ ప్రకటనల కన్నా పోస్టర్లకు విలువ ఇస్తున్నారన్నమాట బి సి సెంటర్లలో. 

ఇక సమీక్షల మేనేజ్‌ మెంట్‌ అన్నది అన్నింటా సాధ్యం కాదు. దాని వల్ల ఫ్యాన్స్‌ నో, హీరోలనో హ్యాపీ అది కూడా టెంపరరీగా తప్ప, మరేమీ కాదు. మేనేజ్‌ చేసినా, చేయాలన్నా, చేయాలనుకున్నా, కేవలం వాళ్ల కోసం తప్ప సినిమాకు ఎంత మాత్రం ఉపయోగం కాదు.

సినిమాను చంపేస్తున్నారు: వంశీ శేఖర్‌..పీఆర్వో

వెబ్‌ సమీక్షలు ఒక విధంగా సినిమాను ఓవర్‌సీస్‌లో చంపేస్తున్నాయి. మిగిలిన సమీక్షల సంగతి అలా వుంచితే గ్రేట్‌ఆంధ్ర సమీక్షలకు ఓ క్రెడిబులిటీ వుంది.. ముఖ్యంగా ఓవర్‌ సీస్‌లో. గ్రేట్‌ఆంధ్ర సమీక్షలు మ్యానేజ్‌ చేయలేరని తెలుసు అందరికీ. కానీ దాని వల్ల నష్టమే జరుగుతోంది. ఓవర్‌ సీస్‌లో సినిమా మొత్తం కిల్‌ అయిపోతోంది. ఓవర్‌సీస్‌ మార్కెట్‌ అంటే చిన్నదేమీ కాదు.. దాదాపు నైజాంతో సమానం అవుతోంది ఇప్పుడు. అలాంటి ఏరియా మొత్తం కేవలం ఓ సమీక్ష వల్ల కిల్‌ అయిపోతోంది. ఒక్కోసారి టికెట్‌ బుక్‌ చేసుకుని కూడా, సమీక్ష చదవి డబ్బులు వదులుకుంటున్నారు. 

సమీక్ష కాస్త బాగుంటే కనీసం ఓ వీకెండ్‌ అయినా దక్కుతుంది. లేదంటే మొత్తంగా సినిమా లేచిపోతోంది. అదే విధంగా సాఫ్ట్‌వేర్‌ జనాలు అందరూ కాస్త ఈ సమీక్షల మీదే ఆధారపడతున్నారు. అందువల్ల ఆ మార్కెట్‌ కూడా దెబ్బతింటోంది. 

మంచికి మంచి.. చెడుకు చెడు: బిఎ రాజు..పీఆర్వో

సమీక్షలు మంచి సినిమాలకు మంచి చేస్తున్నాయి.. బాగులేని సినిమాలకు చెడు చేస్తున్నాయి. బాగున్నసినిమాలకు ఎంత హెల్ప్‌ అవుతున్నాయో, బాగులేని సినిమాలను అంతకు అంతా దెబ్బ తీస్తున్నాయి.. ఇక సమీక్షలు మేనేజ్‌ అంటే.. అలాంటిది వుంటుదని అనుకోవడం లేదు. సమీక్షలు చదివి బాగు లేదన్నా సినిమా చూసేవారు వున్నారు.. అలాగే సమీక్షలు చదవకున్నా, ఆగిపోయేవారు వున్నారు. సమీక్షలు, మౌత్‌ టాక్‌, పబ్లిసిటీ, ఇలా అన్నీ కలిస్తేనే సినిమా విజయం సాధిస్తుంది. ఏది వెలితి అయినా వెలితే.

– వెంకట్‌ ఆరికట్ల