తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అక్కడ పార్టీల మధ్యన సీట్ల బేరం ఊపందుకుంది. సొంతంగా సత్తా చాటే పరిస్థితుల్లో లేని తమిళ పార్టీలన్నీ ఒక దాని మీద మరొకటి ఆధారపడుతున్నాయి. అటు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే అనాథగా మారింది.
జయలలిత లేకపోవడంతో ఆ పార్టీకి బీజేపీ పెద్దన్నగా మారింది. అయితే.. ఆ పెద్దన్నకు ప్రజల్లో పట్టు లేదు. సీట్ల వరకూ వచ్చే సరికి అన్నాడీఎంకేనే పెద్దన్న. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్యనా సీట్ల చర్చలు జరుగుతూ ఉన్నాయి.
తమిళనాట ఈ సారి ఏకంగా అరవై సీట్లకు పోటీ చేయాలనుకుంటోందట బీజేపీ! అయితే అది అన్నాడీఎంకే దయతోనే. ఆ సీట్లను కేటాయించాల్సింది అన్నాడీఎంకేనే. అయితే ఆ అరవై బీజేపీకి ఇస్తే.. వాటిల్లో ఆ పార్టీ నెగ్గేవెన్నో అన్నాడీఎంకేకు కూడా తెలియనిది కాదు. అందుకే అందులో సగం అంటోందట.
మరోవైపు ఒక కుల పార్టీ పీఎంకే ఈ సారి అన్నాడీఎంకే కూటమిలో ఉంది. అటు డీఎంకేతో అయినా కలవగలదు, ఇటు ఏఐడీఎంకేతో అయినా జట్టుకట్టగలదు ఈ పార్టీ. అయితే ఇప్పటికే అన్నాడీఎంకేతో ఈ పార్టీ సీట్ల బేరం తెగిందట. వన్నియార్లు ఉన్న చోటే పోటీ చేసే ఈ పార్టీ సుమారు 23 అసెంబ్లీ సీట్లకు పోటీ చేయనుందట కూటమి పొత్తుతో. ఇక ఈ కూటమి నుంచి నటుడు శరత్ కుమార్ పార్టీ బయటకు వచ్చిందట.
సీట్ల బేరం తెగకపోవడంతో శరత్ కుమార్ ఈ కూటమి నుంచి బయటకు వచ్చి కమల్ తో చేతులు కలపనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇక డీఎంకే కూటమిలో కూడా సీట్ల లొల్లి లేకపోలేదు. అక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేయాలని డీఎంకే లెక్క. కాంగ్రెస్ కు నామమాత్రపు సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ తన వాటా గా సుమారు సీట్లను అడుగుతోంది. అటు కాంగ్రెస్ కు అడిగినన్ని సీట్లు ఇవ్వలేక, అలాగని కాంగ్రెస్ ను వదిలించుకోలేని స్థితిలో ఉంది డీఎంకే.
ఇక లోక్ సభ ఎన్నికలతోనే కమల్ సొంత సత్తా ఏమిటో తేలింది. డీఎంకే వైపే కమల్ మొగ్గు ఉండవచ్చు. అయితే ఆ పార్టీ కమల్ కోసమంటూ ప్రత్యేకంగా సీట్లను పంచడానికి పెద్దగా ఆసక్తి చూపుతున్నట్టుగా లేదు. కమల్, శరత్ కుమార్ లు చేతులు కలుపుతున్నారట. బహుశా వీళ్లిద్దరూ కలిసి పోటీ చేసి.. వీళ్లిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే అదే గొప్ప విజయం అవుతుందేమో!