cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

బాబు సమర్పించు....రాజధాని లే అవుట్

బాబు సమర్పించు....రాజధాని లే అవుట్

కట్టుకున్న పంచపాండవులు తల దించుకున్నారు..పెద్దలు భీష్మ, దృతరాష్టులు చేతలుడుగి కూర్చున్నారు. పురజనులంతా చోద్యం చూస్తున్నారు. ద్రౌపదికి దేవుడే దిక్కయ్యాడు. దేవదేవుడు వచ్చి.. చీరలిచ్చి కాపాడాడు.

ఇపుడు గుంటూరు జిల్లాలోని 16 గ్రామాల రైతులది ఇదే పరిస్థితి,.. మంచి చేస్తుందని ఎన్నుకున్న ప్రభుత్వం వారి భూమి లాక్కోవడానికి సిద్ధమవుతోంది. మీడియా ఎప్పుడో తయారయ్యే  రాజధాని గురించి పలవరిస్తోంది కానీ , వీళ్ల బాధలు దానికి పట్టడం లేదు. మిగిలిన సరిహద్దు గ్రామాల ప్రజలు, ఆ గ్రామాల రైతులు పోతేనేం.. మన ఊళ్లకు, మన పొలాలకు మంచి రేటు వస్తుందని చూస్తున్నారు. పోరాడాల్సిన ప్రతిపక్షం జవసత్వాలు చచ్చి నిలువునా నీరసించి అలా వుండిపోయింది.కానీ ఇదే కలియుగం..ఆ రైతుల్ని కాపాడేందుకు ఏ దేవుడూ రాడు.

ఎంత ఘోరం.. ఎంత మోసం

మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు..మీకు అనువైన చోట ఎకరం అందమైన జాగా కనిపించింది. ఇస్తావా.. చస్తావా అన్నారు. ఇస్తే నీకె మంచింది.. ఏడాదికి పాతిక వేలు  ఇస్తా.. నేను ఇల్లు కట్టుకున్నాక, ఊరవతల నీకు ఓ వెయ్యి గజాలు కొని పెడతా.. లేదంటావా చెప్పు.. లాక్కుని, నా చిత్తానికి విదిలిస్తా.. అంటారు.. అప్పుడు ఆ జాగా వాడు తిన్నగా పోలీసుల దగ్గరకు పోతాడు.. లేదా కోర్టుకుపొతాడు.. ఇదేం అన్యాయం. ఎకరా జాగాకు పాతికవేలు.. పైగా కోట్ల ఖరీదు చేసే జాగా తీసుకుని, ఊరవతల వెయ్యి గజాల విదిలింపా అని. అదే ఎకరాల ఏ బిల్డర్ కైనా ఇస్తే, సగం వాటా ఇస్తాడు కదా.. మరి ఆ సంగతేమిటి? అబ్బే నాకు ఇవేమీ పట్టవు.. కాక పట్టవు.. అంటోంది ప్రభుత్వం ఇప్పుడు. రాజధానికి అనువైన ప్రదేశంలో వుండడం ఆ 16 గ్రామాల ప్రజలు చేసుకున్న పాపమా? లేదా ప్రభుత్వ భూమి వున్నచోట రాజధాని పెట్టకుండా, తమకు నచ్చిన చోటే రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పమా.. ఏది పాపం, ఆ 16 గ్రామాల రైతుల తలరాతలను మార్చేస్తోంది?

సినిమాటిక్ గా..

అదేదో సినిమాలో ఓ కామెడీ సీన్ వుంటుంది. అన్నీ చెప్పి, నా రూపాయి ఏమయింది అంటాడు. అలాగ్గానే వుంది. ఇప్పుడు చంద్రబాబు తన మేధస్సు అంతా మధించి తయారు చేసిన రాజధాని పథకం. ఎకరా జాగా రైతుది. అందులో వెయ్యి గజాలు వెనక్కు.. అది కూడా వేరే చోట అనుకోండి.. సరే ఆ సంగతి పక్కన పెట్టండి. మిగిలింది 900 గజాలు. అందులో రోడ్లకు అభివృద్ధికి 400 గజాలు.. మిగిలింది 500 గజాలు. అందులో 250 గజాలు అభివృద్ధి చేసిన రియల్టర్లకు.. మిగిలిన 250 అభివృద్ధి చేసిన జాగా ప్రభుత్వానికి. అంటే, ఏమాత్రం పెట్టుబడి లేకుండా, ఖర్చు లేకుండా  ప్రభుత్వానికి 250 గజాల అన్ని విధాల అభివృద్ధి పరిచిన జాగా. దాని తరువాతి ఏడాది నుంచి నెలకు ఎకరాకు రైతుకు విదిల్చేది 2000. అక్షరాలా రెండు వేల రూపాయిలు మాత్రమే. ఎకరా భూమికి రైతుకు విదిల్చేపరిహారం.

అదే అమ్మేస్తే...

సపోజ్... అదే రైతు ఎకరా భూమి అమ్మేసుకున్నాడనుకుందాం.  ఎకరాకు  15 లక్షలే వచ్చిందనుకుందాం. ఎందుకంటే రాజధాని వ్యవహారం లేక ముందు ఆ ప్రాంతంలో 15 నుంచి 20 లక్షల వరకు వుందని అంటున్నారు కాబట్టి. ఆ పదిహేను లక్షల్లో అయిదు లక్షలు పెడితే వెయ్యి గజాలు కొనుక్కోవచ్చు. 15లక్షల వంతున లెక్కేస్తే అంతే అవుతుంది. మిగిలిన పది లక్షలను బ్యాంకులో వేసుకుంటే నెలకు 8000 వస్తుంది. అక్షరాలా ఎనిమిది వేలు మాత్రమే. ఇప్పుడు చెప్పండి.. వాట్ టు డు..వాట్ నాట్ టు డు..

అసలు 30 వేల ఎకరాలు అవసరమా?

ఓ సచివాలయం.. వివిధ శాఖల డైరక్టరేట్లు.. కార్యాలయాలు.. మంత్రుల నివాసాలు.. ఎమ్మెల్యే క్వార్టర్లు, అధికారుల, సిబ్బంది క్వార్టర్లు. ఇవే కదా రాజధానికి కావాల్సింది. పోనీ బాబుకు మచ్చటయిన కన్వెన్షన్ సెంటర్, శిల్పారామం, కూడా కలుపుకోండి. మహా అయితే వెయ్యి ఎకరాలు. పోనీ సుందరంగా వుండడానికి వెడల్పాటి రోడ్లు.. పార్కులు.. మరో వెయ్యి ఎకరాలు.. కాదూ అంటే మరో వెయ్యి.. మూడు వేల ఎకరాల్లో ముచ్చటైన రాజధాని కట్టేసి, మిగిలినది వదిలేయచ్చు కదా. అత్యంత సహజంగా అదే పెరిగిపోతుంది. మాల్ కట్టేవాడు మాల్ కడతాడు.. ప్లాట్లు వేసేవాడు ప్లాట్లు వేస్తాడు.. ఫ్లాట్లు కట్టేవాడు కడతాడు. ఆ వ్యవహారాలను రైతులు, ఆ బడాబాబులు చూసుకుంటారు. అప్పుడు రైతులు లాభపడతారు. బాబు అనుకున్నట్లు పదేళ్లలో ఈ మూడు వేల ఎకరాల రాజధాని చుట్టూ, మరో మూడువేల అభివృద్ధికి చెందిన ప్రాంతం రెడీ అవుతుంది.

మరి ఎందుకిలా?

ఎందుకంటే, ఆ మూడువేల ఎకరాలకు ప్రభుత్వం సొమ్ము పెట్టాలి. దాంట్లో రాజధాని కట్టాలంటే డబ్బులు కావాలి. అందుకే ఈ మాయ.. మంత్రదండ విన్యాసం. ముఫై వేల ఎకరాలు సేకరించాలి. అందులో పదివేలు రోడ్లు, పార్కులు వాటికి వదిలేయాలి. ఇరవైవేలలో అయిదువేలు అభివృద్ధి పరిచే రియల్టర్లకు ఇవ్వాలి. మరో అయిదువేలు ప్లాట్లు గా వేలం వేసి, ఎన్నారైలకు ఆకాశాన్నంటే రేట్లకు వేలంలో అమ్మేయాలి. ఆ ఆదాయం నుంచి వచ్చే వడ్డీ చాలు ఏటా రైతులకు ఇవ్వడానికి. ముఫై వేల ఎకరాల్లో ముఫై ఇంటూ వెయ్యి గజాలు అంటే,.. ముఫై వేల గజాలు జస్ట్ ఏడు వేల ఏదో మూల, ఈ రైతులకు ఓ లే అవుట్ వేసి వదిలేస్తే సరి.

రైతులు సరే.. రైతు కూలీలు?

సరే 16 గ్రామాల రైతులు నష్టపోతారు.. వారికి వెయ్యి గజాల జాగా వుంటుంది. నెలకు రెండు వేలు ఫించన్ లాంటి ఆదాయం వుంటుంది సరే. మరి ఇన్నాళ్లు ఈ పదహారు గ్రామాల పొలాలను నమ్ముకుని బతుకుతున్న రైతు కూలీల పరిస్థితి ఏమిటి? తెలుగు.. తెలుగు.. తెలుగు సంస్కృతి.. అనే తెలుగుదేశం పార్టీ. ఈ పొలాలను, రైతులను నమ్ముకుని బతికే చేతివృత్తుల వారు,. హరిదాసులు, వివిధ కులవృత్తుల వారు.. వీళ్లంతా ఏమైపొతారు. పొట్ట చేతపట్టుకుని, పనులు లేక, ఏటా నాలుగు గింజలు విదిల్చే దాతలు లేక, పట్టణాల దారులంట పోవాల్సిందే. దొరికితే వాచ్ మన్ లుగానో, సెక్యూరిటీ గార్డులుగానో బతకాల్సిందే. ఆ పదహారు గ్రామాలు మరో పాలమూరుగా మారి పట్టణాలకు వలసపోవాల్సిందే.

మీడియా.. ఏదయా?

అధికారులు భవిష్యత్ ఇబ్బందులు లేకుండా గ్రామా సభలు తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. ఎగసిన అర కొర గొంతులు మీడియాలో చిన్న పత్రికలకు వార్తలవుతున్నాయి. పెద్ద పత్రికలు మాత్రం.. ‘ఇస్తే మంచిదే..’ అంటూ కథనాలు వండి వారుస్తున్నాయి. తమ తమ సర్దుబాట్లు,, కట్టుబాట్ల కోసం అభినవ దృతరాష్టుల్లా, మీడియా కళ్లు మూసుకుని, ధర్మపన్నాలు చెబుతోంది. ఎందుకు ముఫై వేల ఎకరాలు అని కానీ, ఇదే ఫూలింగ్ పద్దతి కాని అని అడిగిన పాపాన పోవడం లేదు. ఈ మీడియా బడా బాబులకు ఎక్కడెక్కడో వున్న భూములను ప్రభుత్వం ఇదే తీరున సేకరిస్తే, ఊరుకుంటుందా? రింగ్ రోడ్ లో గజాల జాగా పోయిన మీడియా మెగళ్లు చేసిన యాగీ గుర్తులేదా? వీళ్ల కైతే ఒక వార్త... బడుగు రైతులకైతే ఒక వార్త.

ఓట్ల భయం లేదు

ఓట్ల గురించి  ఇప్పడు అధికార పార్టీకి భయం లేదు.  ఎందుకంటే.. మహా అయితే 16గ్రామాల ఓట్లు పోతాయి. అంటే ఒక నియోజకవర్గం. కానీ మిగిలిన వాళ్లంతా.. మా బాబే.. ఎంత అద్భుమైన రాజధాని కట్టాడో.. ఎంత సూపర్ గా వుందో.. అనుకుంటారు.. మీడియాలో అందమైన ఫొటోలు చూసి, వార్తలు చదివి. కానీ ఈ 16 గ్రామాల రైతుల కన్నీళ్లు కనిపించవు. వెతలు వినిపించవు.

కింకర్తవ్యం

16గ్రామాల ప్రజలు తమ బాధ తాము పడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఒక్కండును.. ఒక్కండును.. నీ మొర ఆలకింపుడు... అన్నట్లే వుంది వారి పరిస్థితి.

చాణక్య

writerchanakya@gmail.com

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!